పాట్నా: సైబర్ నేరగాళ్లు బీహార్‌లో సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు. మహిళలు గర్భం దాల్చేలా చేస్తే రూ. 13 లక్షలు ఇస్తామంటూ పురుషులకు ఆఫర్ ప్రకటిస్తున్నారు. ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్ పేరిట మగాళ్లను మోసం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేశారు.
బీహార్‌లోని నవడాలో.. కొంత మంది సైబర్ నేరగాళ్లు ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీసెస్ పేరిట ఒక యాప్‌ను ఏర్పాటు చేశారు. ఈ యాప్‌లో మగాళ్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటే లక్షల రూపాయాలు సంపాదించుకోవచ్చని పురుషులకు ఆఫర్ ప్రకటించారు. తమ భర్తల వద్ద గర్భం దాల్చలేని స్త్రీలకు గర్భం దాల్చేలా చేయాలని ఆ యాప్‌లో పేర్కొన్నారు. ఒక వేళ మీ ద్వారా సదరు మహిళ గర్భం దాల్చితే రూ. 13 లక్షలు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు.
ఈ ప్రక్రియలో పాల్గొనాలంటే మొదటగా రూ. 799 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత నిర్వాహకులు మహిళలు ఫోటోలు పంపిస్తారు. నచ్చిన మహిళ ఫోటోను ఎంపిక చేసుకోవచ్చు. ఆ తర్వాత సెక్యూరిటీ కింద రూ. 20 వేల వరకు డిపాజిట్ చేయించుకుంటారు. అది కూడా మహిళ అందాన్ని బట్టి డిపాజిట్ చేయించుకుంటారు.
ఇక ఆ మహిళ మీ వల్ల గర్భం దాల్చితే రూ. 13 లక్షలు ఇస్తాం. ఒక వేళ గర్భం దాల్చకపోయినా కూడా కన్సోలేషన్ ప్రైస్ కింద రూ. 5 లక్షలు ఇస్తామని చెబుతారు. ఇలా మోసాలకు పాల్పడుతున్న ఆ సైబర్ నేరగాళ్లను బీహార్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి మొబైల్స్, ప్రింటర్, మహిళల ఫోటోలను స్వాధీనం చేసుకున్నారు.