తమిళనాడులో రెండు లారీల మధ్య ఇరుక్కుని కారు దగ్దం
సినిమా క్లైమాక్స్ సీన్ తరహా భయంకర ప్రమాదం.. అదుపుతప్పిన భారీ కంటెయినర్ లారీ.. ఎదురుగా ఉన్న వాహనాలన్నింటినీ ఢీకొట్టింది

- కారులో ఉన్న నలుగురు సజీవ దహనం
- తమిళనాడులోని ధర్మపురిలో దారుణం
- సోషల్‌మీడియాలో ప్రమాద వీడియో వైరల్
విధాత: సినిమా క్లైమాక్స్ సీన్ తరహా భయంకర ప్రమాదం.. అదుపుతప్పిన భారీ కంటెయినర్ లారీ.. ఎదురుగా ఉన్న వాహనాలన్నింటినీ ఢీకొట్టింది. మూడు పెద్దవాహనాలను గుద్దేసింది. రోడ్డుకు అడ్డంగా తిరిగిన భారీ లారీ బ్రిడ్జిపై నుంచి లోయలో పడింది. రెండు ట్రక్కుల మధ్య ఇరుక్కున్న కారు తుక్కుగా మారింది. మంటలు చెలరేగడంతో కారులో ఉన్న నలుగురు సజీవ దహనమయ్యారు. అనేక మంది గాయపడ్డారు. తమిళనాడులోని ధర్మపురిలో బుధవారం జరిగిన భయానక ప్రమాద ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసుల వివరాల ప్రకారం..
తమిళనాడు ధర్మపురిలోని తోప్పూర్ ఘాట్ వద్ద బుధవారం జరిగిన ఘోర ప్రమాదంలో మూడు ట్రక్కులు కారు ఢీకొన్నాయి. నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం ఘటన అక్కడి సీసీటీవీలో రికార్డయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వాహనాలు ఢీకొనడంతో మంటలు చెలరేగడంతో హైవేపై గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించింది. ట్రైలర్ ట్రక్కు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం ప్రమాదానికి కారణమైంది.
వాహనాలు ధర్మపురి నుంచి సేలం వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా డ్రైవర్లలో ఒకరు ట్రైలర్ ట్రక్కుపై నియంత్రణ కోల్పోయాడు. అతని ముందు ఉన్న ఇతర ట్రక్కును ఢీకొట్టాడు. ఈ రెండు లారీలు ఢీకొనడంతో వాహనం అదుపు తప్పి మరో ట్రక్కు ఢీకొట్టింది. ట్రక్కులు ఢీకొనడంతో కారు మూడు ట్రక్కుల మధ్యలో ఇరుక్కుపోయి తుక్కుగా మారింది. ఆ తాకిడికి ట్రక్కు ఒకటి వంతెనపై నుంచి లోయలోకి పడిపోయింది. కారులో మంటలు చెలరేగడంతో వాహనంలోని నలుగురు సజీవ దహనమయ్యారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు హుఠాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప దవాఖానకు తరలించారు.