అజ్మీర్‌లో యువ‌తిపై యాసిడ్ దాడి

పెండ్లికి ఒప్పుకోవ‌డం లేద‌నే అక్క‌సుతో ఓ యువ‌కుడు యువ‌తిపై యాసిడ్ దాడి చేశాడు. ఇంట్లోకి వెళ్లి ఒంట‌రిగా ఉన్నఆమె ముఖంపై యాసిడ్ పోశాడు

అజ్మీర్‌లో యువ‌తిపై యాసిడ్ దాడి
  • పెండ్లికి ఒప్పుకోవ‌డం లేద‌ని ఘాతుకం
  • రెండు గంట‌ల్లోనే నిందితుడి అరెస్టు
  • వ‌న్‌సైడ్ ల‌వ్‌తో రెండేండ్లుగా వేధింపులు


విధాత‌: త‌న‌తో పెండ్లికి ఒప్పుకోవ‌డం లేద‌నే అక్క‌సుతో ఓ యువ‌కుడు యువ‌తిపై యాసిడ్ దాడి చేశాడు. ఇంట్లోకి వెళ్లి ఒంట‌రిగా ఉన్నఆమె ముఖంపై యాసిడ్ పోశాడు. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లోని అజ్మీర్‌లో చోటుచేసుకున్న‌ది. నేరం చేసిన రెండు గంట‌ల్లోనే నిందితుడిని ప‌ట్టుకున్న‌ట్టు పోలీసులు తెలిపారు.


రామ్‌గంజ్ డిప్యూటీ ఎస్పీ రామచంద్ర చౌదరి తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. బాధితురాలు సంజన రామ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆషాగంజ్ ప్రాంతంలో నివాసం ఉంటుంది. నిందితుడైన ఫోటోగ్రాఫర్ ఆశిష్ రాజోరియా అలియాస్ హర్ష్ కూడా పొరుగున నివాసం ఉంటాడు. బాధితురాలు తన అమ్మమ్మతో కలిసి ఇంట్లో ఒంటరిగా ఉన్న‌ది.


బుధవారం ఉదయం సంజ‌న‌ తన ఇంటిని శుభ్రం చేస్తుండగా.. వెనుక తలుపు నుంచి ఆమె ఇంట్లోకి ప్రవేశించిన ఆశిష్‌ పెళ్లి కోసం ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. ఆమె పెళ్లికి నిరాకరించడంతో నిందితుడు బాధితురాలి ముఖంపై యాసిడ్ పోశాడు. ఆమె ముఖంపై యాసిడ్ పడటంతో బాధితురాలు నొప్పితో కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది. నిందితుడు యాసిడ్ బాటిల్‌ను ఇంటి బయట ఉన్న కాలువలో విసిరేసి ప‌రార‌య్యాడు.


పొరుగు ఇంట్లోనే ఉండ‌టం వ‌ల్ల రెండున్నర సంవత్సరాలుగా ఒకరికొకరు తెలుసు. ఏడాది క్రితం నుంచి సోషల్ మీడియా ద్వారా వారికి ప‌రిచ‌యం ఏర్ప‌డింది. వ‌న్‌సైడ్ ల‌వ్‌తో రెండేండ్లుగా ఆమెను అత‌డు వేధింపులు గురిచేస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నాడు. బాధితురాలు బీఈడీ విద్యార్థిని. సివిల్‌ సర్వీసెస్‌కు ప్రిపేర్ ప్రిపేర్ అవుతున్న‌ది. ఆశిష్‌ను పెళ్లి చేసుకోవడానికి ఆమె నిరాకరించింది. దాంతో క‌క్ష పెంచుకున్న ఆశిష్ యాసిడ్ దాడికి పాల్ప‌డ్డాడు.


ఆమె ముఖంపై యాసిడ్ పడిన వెంటనే, బాధితురాలు చల్లటి నీటితో ముఖం కడుక్కోవడం వల్ల ఆమెకు 10% కాలిన గాయాలయ్యాయి. తక్కువ నష్టం జరిగింది. పోలీసులు బాధితురాలిని విచారించి రెండు గంట‌ల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.