బీహార్‌లో చెరువు చోరీ!
బీహార్‌లో చెరువును సైతం చోరీ చేశారు. వినడానికి వింతగా ఉన్నఇది నిజం. రాత్రి వేళల్లో మట్టి నింపి చెరువును కబ్జా చేశారు

- రాత్రి వేళల్లో మట్టి నింపి కబ్జా
- 10-15 రోజుల్లోనే చెరువు ఆనవాళ్లు
- లేకుండా చేసిన ల్యాండ్ మాఫియా
- పోలీసులకు అధికారుల ఫిర్యాదు
విధాత: బీహార్‌లో చెరువును సైతం చోరీ చేశారు. వినడానికి వింతగా ఉన్నఇది నిజం. రాత్రి వేళల్లో మట్టి నింపి చెరువును కబ్జా చేశారు. 10-15 రోజుల్లో చెరువు ఆనవాళ్లు లేకుండా చేసి గుడిసె ఏర్పాటుచేశారు. చెరువు మాయమై దానిపై గుడిసె వెలువడంపై దిగ్భ్రాంతికి గురైన స్థానికులు అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాష్ట్రంలోని దర్భంగా జిల్లాలో భూముల ధరలు భారీగా పెరుగడంతో ల్యాండ్ మాఫియా కన్నునీటితో కళకళలాడుతున్న చెరువుపై పడింది. చెరువును చేపలు పట్టడం, ఇతర కార్యకలాపాల కోసం స్థానిక ప్రజలు వినియోగించుకొనేవారు. చెరువును ల్యాండ్‌మాఫియా రోజు కొద్దిగా మట్టితో నింపడం ప్రారంభించింది. 10-15 రోజుల్లోనే చెరువు మట్టితో నిండిపోయింది. రాత్రిపూట మాత్రమే పనులు జరిగాయని స్థానికులు తెలిపారు.
స్థానిక ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చే సమయానికి వారంతా పారిపోయేవారు. చెరువును పూర్తిగా కబ్జా చేసి గుడిసె వేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారని సబ్ డివిజనల్ పోలీసు అధికారి (ఎస్‌డీపీవో) అమిత్ కుమార్ తెలిపారు.
బెగుసరాయ్‌లోని రైల్వే యార్డ్‌లో నిరుపయోగంగా ఉన్నడీజిల్ ఇంజిన్ 2022 నవంబర్‌లో దొంగలు ఎత్తుకుపోయారు. అదే సంవత్సరం ప్రారంభంలో రోహ్తాస్ జిల్లాలో మొత్తం 60 అడుగుల 247 కిలోల ఇనుప వంతెన చోరీకి గురైంది. కేవలం మూడు రోజుల్లోనే వంతెన కనిపించకుండా పోయింది. ఇప్పుడు కేవలం పది రోజుల వ్యవధిలోనే చెరువును మట్టితో చెరిపేసి గుడిసె వేసేశారు