Congress | ఎన్నాళ్లకెన్నాళ్లకు.. కాంగ్రెస్‌కు వైఎస్సార్ గుర్తొచ్చారు

విధాత‌: మొత్తానికి మళ్ళీ ఇన్నాళ్లకు ఆయన గుర్తొచ్చాడు. బతికుండగా దాదాపు పెద్దగా విలువ ఇవ్వని కాంగ్రెస్ అయన మరణించాక సైతం అవమానించింది. ఆయన పేరును అవినీతి కేసుల్లో ఎఫ్ఐఆర్ లో సైతం పెట్టించి ఆయన్ను అవినీతిపరుడిగా చిత్రీకరించింది. పార్టీకి కానీ వినీ ఎరుగని ప్రజా మద్దతు సాధించి పదేళ్ళపాటు కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో ఉండడానికి ప్రధాన కారకుడైన వైఎస్సార్ ను మరణించాక సైతం అవమానించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయన గతించిన పధ్నాలుగేళ్ళకు ఇప్పుడు ఆయన్ను […]

  • Publish Date - July 8, 2023 / 08:35 AM IST

విధాత‌: మొత్తానికి మళ్ళీ ఇన్నాళ్లకు ఆయన గుర్తొచ్చాడు. బతికుండగా దాదాపు పెద్దగా విలువ ఇవ్వని కాంగ్రెస్ అయన మరణించాక సైతం అవమానించింది. ఆయన పేరును అవినీతి కేసుల్లో ఎఫ్ఐఆర్ లో సైతం పెట్టించి ఆయన్ను అవినీతిపరుడిగా చిత్రీకరించింది. పార్టీకి కానీ వినీ ఎరుగని ప్రజా మద్దతు సాధించి పదేళ్ళపాటు కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో ఉండడానికి ప్రధాన కారకుడైన వైఎస్సార్ ను మరణించాక సైతం అవమానించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయన గతించిన పధ్నాలుగేళ్ళకు ఇప్పుడు ఆయన్ను గుర్తు చేస్తూ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో నివాళులు అర్పించింది.

ఈ పధ్నాలుగేళ్లలో ఏనాడూ గుర్తుకు రాని వైఎస్సార్ ఇప్పుడు గుర్తుకు రావడం చూసి సగటు వైఎస్ అభిమాని ముక్కున వేలేసుకుంటున్నారు. వాస్తవానికి 2004, 2009 లో కాంగ్రెస్ ఆంధ్రాలో అధికారంలోకి రావడానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కారణం అని తెలుగు ప్రజలు నమ్ముతారు. అయితే అయన గతించాక ఆయనకుమారుడు జగన్ మోహన్ రెడ్డిని తీవ్ర ఇబ్బందుల పాల్జేసిన కాంగ్రెస్ ఆ కేసుల్లో దివంగత వైఎస్ ను సైతం ఇరికించింది. ఆయన పేరును సైతం కేసుల్లో పేర్కొని ఆయనను అప్రదిష్టపాల్జేసింది.

అయితే ఆ తరువాత జగన్ కాంగ్రెస్ ను వీడడం .. సొంతపార్టీ పెట్టుకోవడం తెల్సిందే.. ఈ క్రమంలో కాంగ్రెస్ ఏకంగా వైఎస్ ను వదులుకుంది. అంటే ఆ తరువాత ఎన్నడూ వైఎస్ ను తలచుకోలేదు. ఆయన్నుసంపూర్తిగా తమ పార్టీ లీడర్ల జాబితా నుంచి సైతం తొలగించింది. మళ్ళీ ఇప్పుడు అంటే తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణం.. అక్కడ భారీగా వైఎస్సార్ అభిమానులు, క్యాడర్ ఉన్నారన్న వాస్తవాన్ని గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం మళ్ళీ ఇన్నాళ్లకు నేడు వైఎస్సార్ 74వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ వైఎస్ కు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఒక ట్వీట్ పోస్ట్ చేసింది.

దీనిని చూసిన ఆంధ్రలోని వైఎస్సార్ అభిమానులు కాంగ్రెస్ మీద కామెంట్స్ ఎక్కుపెడుతున్నారు. ఇన్నాళ్లకు మా పెద్దాయన గుర్తొచ్చారా ? ఆయన్ను అప్రదిష్టపాల్జేసినపుడు అయన గొప్పతనం కళ్ళకు కనిపించలేదా అని ప్రశ్నలు సంధిస్తున్నారు. మొత్తానికి రాజకీయ అవసరాలు ఎవరినైనా ఏ స్థాయికి అయినా దిగజారుస్తాయి అని మళ్లోసారి జనానికి విశదమైంది.