Aksha | ఏడేళ్ల కథ ఎట్టకేలకు సుఖాంతం.. త‌ల్లిదండ్రుల చెంత‌కు చిన్నారి అక్ష

Aksha 2016 నుండి కనిపించకుండా పోయిన అక్ష కొద్దిరోజుల క్రితం కరీంనగర్‌లో ప్రత్యక్షం విధాత బ్యూరో, కరీంనగర్: ఏడేళ్ల అక్ష కథ ఎట్టకేలకు సుఖాంతం అయింది. ఏడేళ్ల తర్వాత.. కరీంనగర్ జిల్లా బాలల సంక్షేమశాఖా అధికారులు, పోలీసుల కృషితో.. తన తల్లిదండ్రులను అక్ష కలుసుకోగల్గింది. గత పదిహేను రోజులుగా మిస్టరీగా మారిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆ పాప కథ అనేక మలుపులు తిరిగింది. వివరాల్లోకి వెళితే.. అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో […]

Aksha | ఏడేళ్ల కథ ఎట్టకేలకు సుఖాంతం.. త‌ల్లిదండ్రుల చెంత‌కు చిన్నారి అక్ష

Aksha

  • 2016 నుండి కనిపించకుండా పోయిన అక్ష
  • కొద్దిరోజుల క్రితం కరీంనగర్‌లో ప్రత్యక్షం

విధాత బ్యూరో, కరీంనగర్: ఏడేళ్ల అక్ష కథ ఎట్టకేలకు సుఖాంతం అయింది. ఏడేళ్ల తర్వాత.. కరీంనగర్ జిల్లా బాలల సంక్షేమశాఖా అధికారులు, పోలీసుల కృషితో.. తన తల్లిదండ్రులను అక్ష కలుసుకోగల్గింది. గత పదిహేను రోజులుగా మిస్టరీగా మారిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆ పాప కథ అనేక మలుపులు
తిరిగింది. వివరాల్లోకి వెళితే..

అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో 2016లో తండ్రి రవికుమార్‌తో పాటు.. పాప అక్ష కనిపించకుండా పోయింది. దాంతో తల్లి ద్వారక సఖినేటిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి పాప కోసం తల్లి ద్వారక వెతుకుతోంది. ఎక్కడెక్కడో తిరిగి హైదరాబాద్ బసవతారక హాస్పిటల్ లో పనిచేస్తున్న ఆండాళ్ అనే మహిళ వద్దకు అక్ష చేరుకున్నది.

ఆండాళ్ కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎగ్లాస్ పూర్ కు చెందిన భాగ్యలక్ష్మికి అప్పగించింది. పాపకు అనారోగ్యంగా ఉండటంతో భాగ్యలక్ష్మి ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా.. పాప భాష చూసి అనుమానించిన ఆర్ఎంపీ ఆ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో.. ఆ పాప తమదేనంటూ శ్రీకాకుళం నుంచి ఒకరు రాగా.. అంతర్వేది నుంచి పద్మ అనే మహిళ పాప తన మనవరాలేనంటూ ఆధారాలు చూపించడంతో శిశు సంక్షేమ శాఖ అధికారులు విచారణ చేపట్టారు.

డీఎన్ఏ టెస్ట్ చేయించాలని నిర్ణయించారు. ఆ తర్వాత శ్రీకాకుళం వాసి పాప తమది కాదని చెప్పడం.. అలాగే, పద్మ చెప్పింది నిజమేనని నిరూపించుకున్న తర్వాత పాప తల్లి ద్వారకను అధికారులు పిలిపించగా.. తనతో గొడవపడి భర్త రవి పాపను తీసుకొని వెళ్ళిపోయాడని చెప్పడంతో దాన్ని నిర్ధారణ చేసుకున్న అధికారులు పాపను తల్లిదండ్రులకు అప్పగించారు.

పాప కోసం పోరాటం చేస్తున్న అడ్వకేట్‌ను కూడా నిర్ధారించుకుని పాపను అప్పగించే ప్రక్రియను పూర్తి చేసినట్టు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ సుమలత తెలిపారు. పాప అక్ష తమవద్దకు చేరుకోవడంపై ప్రస్తుతం తల్లిదండ్రులు ద్వారక, రవికుమార్ ఆనందం వ్యక్తం చేస్తుండగా.. అదే సమయంలో భార్యాభర్తలిద్దరూ కూడా మళ్లీ కలవడం ఆ కుటుంబంలో ఆనందాన్ని కల్గించింది. రకరకాల ట్విస్టులు, హైడ్రామా మధ్య పాప అక్ష కథ సుఖాంతం కావడంతో అధికారులూ ఊపిరి పీల్చుకున్నారు.