విధాత : వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమే ధ్యేయంగా విపక్ష పార్టీలన్నీ ఒక్కతాటిపైకి వస్తున్నాయి. కాంగ్రెస్‌తో కలిసి నడిచేందుకు సిద్ధమౌతున్నాయి. వామపక్షాలు ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో ఇక్కడా కాంగ్రెస్‌తోనే కలిసి పనిచేస్తామని ఇప్పటికే ప్రకటించాయి. సీట్ల పంపిణీపై చర్చలు ఇరు పార్టీల మధ్య జరుగుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఇది మరింత ఊపందుకోనున్నది. ఇప్పటికే వైటీపీని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని, లేదా అవగాహనతో పనిచేస్తారనే రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.
కాగా.. ఆమెను కూడా కలుపుకొంటే ఖమ్మం జిల్లాలో కలిసి వస్తుందని, అలాగే వామపక్షాలను కూడా కలుపుకొంటే ఉమ్మడి ఖమ్మం, నల్లగొండల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకోవచ్చని కాంగ్రెస్ పార్టీ అంచనాగా చెబుతున్నారు. కర్ణాటక తరహాలో ఇక్కడ కూడా ముందుగానే మెజారిటీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించాలని ఆ పార్టీ అధిష్ఠానం యోచించింది. కానీ.. అనేక కారణాలతో జాబితా ప్రకటనలో జప్యం జరుగుతూ వచ్చింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలిపోకుండా ఉండాలంటే విడివిడిగా కాకుండా కలిసి పోటీ చేయాలన్నది ఇతర పార్టీల ప్రతిపాదన.
అలాగే ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం కోసం దరఖాస్తు పెట్టుకున్న జాబితా కూడా పెద్దగానే ఉన్నది. ఒక్క అభ్యర్థి మాత్రమే పోటీలో ఉన్న స్థానాల సంఖ్య తక్కువే. అందుకే ఈ కారణాల అన్నింటి దృష్ట్యా అభ్యర్థుల జాబితా ప్రకటన ఆలస్యమౌతున్నదని తెలుస్తోంది. అయితే.. ఆదివారం ఢిల్లీలో సమావేశమైన తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ.. పది పదిహేను స్థానాలు మినహా మిగిలిన అన్నిటిపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తున్నది.
ఇదిలాఉంటే..
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తోనే తెలంగాణ జన సమితి వెళ్తుందనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. దానికి అనుగుణంగానే ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. వారిద్దరి మధ్య పొత్తుల అంశంపై చర్చ జరిగినట్టు తెలుస్తున్నది.
రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతున్నదని, దాన్ని ఎదుర్కోవాలంటే ప్రజాస్వామిక శక్తులన్నీ కలిసి పనిచేయాలని కోదండరాం కోరారని తెలుస్తున్నది. దానికి కాంగ్రెస్ నేతృత్వం వహించాలని విజ్ఞప్తి చేశారని సమాచారం. కలిసి వచ్చే పార్టీలతో కలిసి సంకీర్ణ కూటమిగా ఏర్పడాలని, అందులో తమకూ భాగస్వామ్యం కల్పించాలని ఖర్గేకు ప్రతిపాదించినట్టు తెలుస్తున్నది.
ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు ప్రొఫెసర్ యోగేంద్రయాదవ్ కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో తరుచూ పర్యటిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారందరితో ఆయన ఆ మధ్య సమావేశమయ్యారు. ఆ భేటీలో పాల్గొన్నవారంతా కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించారు.
బీఆర్‌ఎస్‌ను ఓడించడానికి చేసున్న ప్రయత్నంలో తెలంగాణ జేఏసీ చైర్మన్‌గా పనిచేసిన కోదండరామ్‌ను కలుపుకొని పోవాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారని తెలుస్తున్నది. ఆయన కాంగ్రెస్ కూటమిలోకి వస్తే కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఆ పనిచేస్తున్న ఉద్యమకారులందరికీ ఒక వేదిక దొరికినట్టు అవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నదయి.
కేంద్ర ఎన్నికల కమిషన్ సోమవారం తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది. ఆ జాబితాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌తోపాటు.. ప్రధాన ప్రతిపక్షంగా ఉండి, ఈసారి అధికారంలోకి వచ్చే అవకామున్న మధ్యప్రదేశ్ కూడా ఉన్నది. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఈ ఎన్నికలు సెమీ ఫైనల్‌గా భావిస్తున్నారు. ఈ మూడు రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ ఈసారి ఎలాగైనా అధికారంలోకి వచ్చితీరాలనే సంకల్పంతో కాంగ్రెస్ ఉన్నది.
మిగిలిన మూడు రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని ఇప్పటికే సర్వేలు వెల్లడించాయి. రాజస్థాన్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు జరగనున్నది. తెలంగాణలోనూ ప్రధాన పోటీ బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్యే అన్నది స్పష్టమైంది. ఇక్కడ పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ బీఆర్‌ఎస్‌ను నిలువరించాలంటే వామపక్షాలు, జనసమితి, వైటీపీ లాంటి పార్టీలను కలుపుకుని వెళ్తే ఆశించిన ఫలితాలు వస్తాయని విశ్లేషకులు అంటున్నారు.