28న అమిత్‌షా రాక.. బీజేపీఎల్పీ నేత ఎంపిక
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఈ నెల 28వ తేదీన రాష్ట్రానికి వస్తున్నారు. అమిత్‌షా సమక్షంలోనే బీజేపీఎల్‌పీ నేతను ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది

- పార్లమెంటు ఎన్నికలపై కసరత్తు
విధాత: కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్‌షా ఈ నెల 28వ తేదీన రాష్ట్రానికి వస్తున్నారు. అమిత్‌షా సమక్షంలోనే బీజేపీఎల్‌పీ నేతను ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3వ తేదీన వచ్చాయి. బీజేపీకి ఎనిమిది స్థానాల్లో గెలిచింది. ఫలితాలు వచ్చి 22 రోజులు పూర్తయినప్పటీకి ఎల్‌పీ నేతను ఎన్నుకోలేకపోయింది. బీజేపీ ఎల్ పీనేతగా తనకు అవకాశం ఇవ్వాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గట్టిగా పట్టుబట్టారు.
అయితే అధిష్టానం రాజాసింగ్‌ను కాకుండా మరొకరికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనలో ఉంది. ఎల్ పీ నేతగా తనకు అవకాశం ఇవ్వాలని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి కూడా అడుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే బీఆరెస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌ను, పీసీసీ అధ్యక్షులు, సీఎం రేవంత్‌రెడ్డిలను ఓడించి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే కేవీ రమణారెడ్డి గెలుపొందారు. ఇద్దరు సీఎంలను ఓడించిన తనకు ఎల్‌పీ నేతగా అవకాశం ఇవ్వాలని రమణారెడ్డి బీజేపీ పెద్దలను కోరారు.
ఇలా బీజేపీ ఎల్‌పీ నేతకు పార్టీలో పోటీ పెరగడంతో అధిష్ఠానం ఇప్పటి వరకు ఎటూ తేల్చలేక పోయింది. జాతీయ నాయకత్వం కూడా ఇతర రాష్ట్రాలలో బీజేపీ సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో బీజీగా ఉన్న నాయకత్వం కాస్త ఆలస్యంగా తెలంగాణపై కేంద్రకరించినట్లు కనిపిస్తోంది. ఈ నెల28న అమిత్‌షా రాష్ట్రానికి వస్తుండడంతో బీజేపీఎల్‌పీ నేత ఎంపిక సమస్య సమసి పోతుందన్న అభిప్రాయంతో పార్టీ నేతలున్నారు.
ఈ సందర్భంగా జరిగే పార్టీ సమావేశంలో బీజేపీ ఎల్ పీ నేతను ఎన్నుకుంటారని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. అలాగే పార్లమెంటు ఎన్నికలపై కూడా చర్చించనున్నట్లు తెలిసింది. ఈ సమావేశంలో నియోజక వర్గాల వారీగా పార్టీ బలాబలాను సమీక్షించనున్నట్లు సమాచారం. అలాగే పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ఎత్తుగడలపై చర్చించనున్నట్లు పార్టీ నేతలు చెపుతున్నారు.