House Insurance Tips| ఇంటికి భీమా చేస్తున్నారా?: ఈ జాగ్రత్తలు తప్పనిసరి……
ఇంటికి భీమా చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రకృతి వైపరీత్యాలు సంబవించిన సమయంలో , అగ్ని ప్రమాదాలు వాటిల్లితే ఏదైనా అనుకోని ప్రమాదంలో ఇల్లుకు నష్టం వాటిల్లితే ఇన్సూరెన్స్ క్లైయిమ్ చేసుకోవచ్చు. అయితే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొనే సమయంలోనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలా చేయకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.

House Insurance Tips | ప్రకృతి వైపరీత్యాలు సంబవించినప్పుడు, అల్లర్లు, దొంగతనాలు, ఇంకా ఏదేని కారణాలతో జరిగే నష్టాల నుంచి ఆర్ధిక రక్షణ పొందడానికి ఇంటికి ఇన్సూరెన్స్ చేయాలి. ఏదైనా ప్రమాదం జరిగి ఇంటికి లేదా ఇంట్లోని వస్తువులకు నష్టం జరిగితే ఇన్సూరెన్స్ క్లైయిమ్ చేసుకోవచ్చు. వరదలు, భూకంపాలు,అగ్ని ప్రమాదాలు, తుఫాన్లు, దొంగతనాల వంటి ప్రమాదాలు జరిగితే ఇంటికి చేసిన ఇన్సూరెన్స్ ద్వారా ఆర్ధికంగా ఇబ్బందులు లేకుండా చేసుకోవచ్చు. కొత్తగా ఇల్లు కొన్నప్పుడు లేదా కొత్తగా ఇల్లు నిర్మించిన సమయంలో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు.
ఎలాంటి పాలసీ తీసుకోవాలి?
ఇంటికి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొనే సమయంలో కొన్ని అంశాలను పరిశీలించాలి. ఇంటికి పూర్తిస్థాయిలో కవరేజీ వచ్చేలా పాలసీని తీసుకోవాలి. ప్రీమియం తక్కువగా ఉండే పాలసీలు తీసుకోవడం వల్ల అన్ని ప్రమాదాలకు ఆ పాలసీ ద్వారా ఇన్సూరెన్స్ క్లైయిమ్ చేసుకోలేం. మీ ఇంటి విలువ, ఇంట్లోని ఫర్నీచర్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొన్న తర్వాత పాలసీని తీసుకోవాలి. మీరు తీసుకొనే పాలసీలతో ఇంటికి ఏ రకమైన నష్టాలు జరిగితే ఇన్సూరెన్స్ క్లైయిమ్ చేసుకోవచ్చనే విషయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. అప్పుడు మీకు సరిపోయే పాలసీని తీసుకోవాలి. మీరు పాలసీ తీసుకొనే సమయంలో ఉన్న ఖర్చులు భవిష్యత్తులో ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది.
షరతుల గురించి తెలుసుకోవాలి..
పాలసీ తీసుకొనే సమయంలో ఏమైనా మినహాయింపులు ఉన్నాయా అనే విషయాన్ని పరిశీలించాలి. అగ్ని ప్రమాదాలు, వరదలు ఇలాంటి వాటికి బీమా వర్తించదనే షరతులుంటే పాలసీ తీసుకున్నా ప్రయోజనం ఉండదు. ఎలాంటి వాటికి బీమా వర్తిస్తుందో బీమా ఏజంట్ ను అడిగి తెలుసుకోవాలి. పాలసీ తీసుకున్న తర్వాత ఇతరత్రా ప్రమాదాలకు అదనంగా ప్రీమియం చెల్లించాలా? అనే విషయాలను కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. పాలసీ తీసుకున్న తర్వాత ఏదేని కారణంతో రెన్యూవల్ చేసుకోకపోతే లేట్ ఫీజుతో రెన్యూవల్ చేసుకొనే అవకాశం ఉంటుందో కనుక్కోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్, ఇతర ఇన్సూరెన్స్ ల మాదిరిగానే ఇంటి బీమా పాలసీని కూడా రెన్యూవల్ చేసుకోవాలి. పాలసీ తీసుకున్న తర్వాత ఇంట్లో మార్పులు చేర్పులు చేస్తే ఆ పాలసీలో వీటిని నమోదు చేసి ప్రీమియం పెంచుకోవాలి. మీ ఇంట్లోని ఎలక్ట్రానిక్స్, ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను పాలసీలో పొందుపర్చాలి. లేకపోతే నష్టపోతారు. ప్రమాదాలు జరిగిన సమయంలో ఇల్లు రిపేరు చేయాల్సి వస్తే వేరే ఇంట్లో అద్దెకు ఉండాల్సి వస్తోంది. అలాంటి పరిస్థితుల్లో ఎన్ని రోజులు అద్దెకు ఉంటే అన్ని రోజుల అద్దె ఈ పాలసీ ద్వారా క్లైయిమ్ చేసుకొనే అవకాశం ఉంటుందో లేదో చెక్ చేసుకోవాలి.
ఎప్పుడు క్లైయిమ్స్ చేయాలి?
చిన్న చిన్న విషయాలకు క్లైయిమ్ చేయవద్దు. పాలసీ తీసుకున్నామని ఏది పడితే దానికి ఇన్సూరెన్స్ క్లైయిమ్ చేస్తే నష్టమని నిపుణులు చెబుతున్నారు. పెద్ద ప్రమాదం జరిగితే దాన్ని క్లైయిమ్ చేసే సమయంలో తక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంది. చిన్న చిన్న రిపేర్లకు స్వంత డబ్బులు ఖర్చు చేయడం మంచిది. ప్రమాదాలు జరిగినప్పుడు మీరు పాలసీ తీసుకున్న కంపెనీ క్లైయిమ్ సెటిల్ మెంట్ ఎన్ని రోజుల్లో చేస్తోందో తెలుసుకోవాలి. ఆ కంపెనీ పరిస్థితి, ఆ కంపెనీపై వినియోగదారుల అభిప్రాయాలు తెలుసుకోవాలి.