ఆ మూడు పార్టీల ఎజెండా ఒక్కటే

దేశానికి, తెలంగాణకు అవినీతి, కుటుంబ పార్టీలతో నష్టం వాటిల్లుతుందని, ప్రధాని నరేంద్ర మోదీకి దేశ ప్రజలే కుటుంబమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు

  • Publish Date - March 12, 2024 / 10:44 AM IST
  • అవినీతి, కుటుంబ పార్టీలతో దేశానికి నష్టం
  • కాంగ్రెస్‌, బీఆరెస్‌, ఎంఐఎంపై అమిత్‌షా విమర్శలు
  • బీజేపీతోనే తెలంగాణ వికాసం

విధాత, హైదరాబాద్‌ : దేశానికి, తెలంగాణకు అవినీతి, కుటుంబ పార్టీలతో నష్టం వాటిల్లుతుందని, ప్రధాని నరేంద్ర మోదీకి దేశ ప్రజలే కుటుంబమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. హైదరాబాద్‌ ఇంపీరియల్ హోటల్‌లో బీజేపీ సోషల్ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ పలు స్కామ్‌లతో 12లక్షల కోట్ల అవినీతి పాల్పడగా, రాష్ట్రంలోని బీఆరెస్ ప్రభుత్వం లక్ష కోట్ల అవినీతికి పాల్పడిందని, సంబంధిత అవినీతి చిట్టా మా వద్ద ఉందన్నారు. ఎంతసేపు కాంగ్రెస్‌, బీఆరెస్‌, ఎంఐఎంలు తమ కుటుంబ సభ్యుల కోసమే పనిచేస్తుండగా, ప్రధాని మోదీ దేశం కోసం పనిచేస్తున్నారని, అవినీతి రహిత పాలన అందించారని, మూడవ సారి ప్రధాని అయితే భారత్‌ను విశ్వగురువుగా నిలబెడుతారని స్పష్టం చేశారు. ఎంఐఎం చేతిలో తెలంగాణలో కాంగ్రెస్, బీఆరెస్‌లు కీలుబొమ్మలన్నారు. ఆ మూడు పార్టీల జెండాలు వేరైనా ఏజెండా ఒక్కటేనని, అవి రాష్ట్రంలో బీజేపీని ఓడించేందుకు కలిసి పనిచేస్తున్నాయన్నారు.

మోదీతోనే దేశానికి సుస్థిర, సురక్ష, సుపరిపాలన

దేశంలో ప్రధాని మోదీ పదేళ్ల పాలనతో దేశం వికసిత భారత్ దిశగా ముందుకు దూసుకెలుతుందన్నారు. కాశ్మీర్ 370ఆర్టికల్ రద్దు చేశామని, ట్రిఫుల్ తలాక్ రద్దు చేసి, ముస్లిం మైనార్టీ మహిళలకు మేలు చేశామని, 33శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చామన్నారు. సీఏఏ అమలులోకి తెచ్చామన్నారు. ప్రధాని మోదీ మూడోసారి అధికారంలోకి రాగానే భారత్ ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోబోతుందన్నారు. దేశానికి స్థిరమైన సురక్షితమైన సుపరిపాలన మోదీ అందిస్తున్నారని, అందుకే మహిళలు, యువత, రైతులు అంతా ప్రధానిగా మళ్లీ మోదీనే కాబోతున్నారని చెబుతున్నారని అమిత్‌షా చెప్పారు. దేశ సరిహద్దులు సురక్షితంగా ఉండటంతో పాటు దేశంలో అంతర్గత తీవ్రవాదం సమస్య లేకుండా చేస్తున్నామన్నారు. త్వరలోనే లోక్‌సభ షెడ్యూల్ రాబోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందని, ప్రజలు ఆ పార్టీని ఆదరించే పరిస్థితి లేదన్నారు. తెలంగాణలో అవినీతి, కుటుంబ పార్టీలైన కాంగ్రెస్‌, బీఆరెస్‌ల పాలనలో తేడా ఉండదని, అందుకే ఆ పార్టీలతో తెలంగాణ అభివృద్ధి సాధ్యం కాదన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లు ఎత్తివేస్తామని, కాంగ్రెస్ ఆ పనిచేయలేదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ సీఎం రేవంత్‌రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ అవినీతి చిట్టా పంపిస్తానని, దానిపై చర్యలు తీసుకున్నాకే బీజేపీపై విమర్శలు చేయాలని సూచించారు.

తెలంగాణకు బీజేపీ పెద్దపీట

కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం పదేళ్లలో తెలంగాణకు 2లక్షల కోట్లు అందిస్తే, ప్రధాని మోదీ పదేళ్ల ప్రభుత్వం 12లక్షల కోట్లు అందించిందని, రైల్వేలు, జాతీయ రహదారులు, యూనివర్సిటీలు, ఆసుపత్రులు వంటి మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు అందించిందని గుర్తు చేశారు.

బీజేపీ పార్టీ సోషల్ మీడియా సైనికులు నరేంద్ర మోదీ పాలనా విజయాలు, బీజేపీ సైద్దాంతికతను ప్రజలకు వివరించి వారి మద్దతు కూడగట్టాలని సూచించారు. మోదీ మూడోసారి ప్రధాని అవుతారని, ఆయన కోరిక మేరకు 400 సీట్లు సాధించాల్సిన అవసరముందన్నారు. అందుకు రాష్ట్రంలో 12 ఎంపీ సీట్లు బీజేపీ గెలవాలని, ఇందుకోసం పార్టీ శ్రేణులు ప్రణాళిక బద్ధంగా పనిచేయాలన్నారు.