AP | అమితాగ్రహమా!.. జగన్నాటకమా?

వైసీపీ, బీజేపీ మాట‌ల యుద్ధం వెనుక మర్మం! అమిత్‌ షా ఆరోపణల్లో సీరియస్‌నెస్‌ ఉందా? జగన్‌ కేసులపై ఇప్పటి దాకా నాన్చుడు ధోరణి వేల కోట్ల నిధులు విడుదల చేసిన కేంద్రం సర్కార్‌ ఇప్పుడు జగన్‌ది అవినీతి ప్రభుత్వమని ఆరోపణ ఒక్కసారిగా వైఖరి మార్పు వెనుక అనుమానాలు అవినీతి జరిగితే ఈడీ, సీబీఐలు ఏం చేస్తున్నాయి? ‘నేను కొట్టినట్టు చేస్తా.. నువ్వు ఏడ్చినట్టు నటించు’ అంతా రాజకీయ డ్రామా అంటున్న విశ్లేషకులు AP | వైసీపీ-బీజేపీ మ‌ధ్య […]

AP | అమితాగ్రహమా!.. జగన్నాటకమా?
  • వైసీపీ, బీజేపీ మాట‌ల యుద్ధం వెనుక మర్మం!
  • అమిత్‌ షా ఆరోపణల్లో సీరియస్‌నెస్‌ ఉందా?
  • జగన్‌ కేసులపై ఇప్పటి దాకా నాన్చుడు ధోరణి
  • వేల కోట్ల నిధులు విడుదల చేసిన కేంద్రం సర్కార్‌
  • ఇప్పుడు జగన్‌ది అవినీతి ప్రభుత్వమని ఆరోపణ
  • ఒక్కసారిగా వైఖరి మార్పు వెనుక అనుమానాలు
  • అవినీతి జరిగితే ఈడీ, సీబీఐలు ఏం చేస్తున్నాయి?
  • ‘నేను కొట్టినట్టు చేస్తా.. నువ్వు ఏడ్చినట్టు నటించు’
  • అంతా రాజకీయ డ్రామా అంటున్న విశ్లేషకులు

AP | వైసీపీ-బీజేపీ మ‌ధ్య ఏపీలో నిజంగానే వైరం నెల‌కొన్నదా? జగన్‌ పాలనలో విశాఖ అరాచక శక్తులకు అడ్డాగా మారి, భూ మాఫియా, మైనింగ్‌ మాఫియా చెలరేగిపోతోందన్న హోంమంత్రి అమిత్ షా ఆరోప‌ణ‌ల్లో సీరియ‌స్‌నెస్ ఉందా? జ‌గ‌న్ పాల‌న అంతా అవినీతి, కుంభ‌కోణాల మ‌యం అంటూ విశాఖ ప‌ర్య‌ట‌న‌లో వైసీపీ ప్ర‌భుత్వంపై అమిత్ షా మండిప‌డ‌టంలో చిత్త‌శుద్ధి ఉందా? నిన్న‌టివ‌ర‌కు చెట్టాప‌ట్టాల్ వేసుకున్న వైసీపీ-బీజేపీ తీరా ఎన్నిక‌ల‌కు 9నెలల ముందు ఎందుకు స్వ‌రం మార్చాయి? ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన డబ్బు అంతా కూడా జగన్‌ ప్రభుత్వ అవినీతి ఖాతాల్లోకే వెళ్తోందన్న అమిత్ షా వ్యాఖ్యల అంత‌రార్థం, ప‌రమార్థం ఏమిటి?

(విధాత ప్రత్యేక ప్రతినిధి)

అమిత్‌షా, జేపీ న‌డ్డా.. ఇద్దరూ ఏపీ ప‌ర్యటన సంద‌ర్భంగా వైసీపీ పాల‌న‌ గురించి చేసిన వ్యాఖ్యల‌పై బీజేపీ-వైసీపీ మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతోంది. ఈ రాజకీయ ఆరోప‌ణ‌లు, ప్రత్యారోప‌ణ‌లు చూస్తుంటే బీజేపీ, వైసీపీ మధ్య గ్యాప్ వచ్చిందని చాలామంది అనుకుంటున్నారు. కానీ రాజ‌కీయ విశ్లేష‌ణ‌కులు మాత్రం ఇదంతా మ‌రో డ్రామా అని కొట్టిపారేస్తున్నారు. బీజేపీ, వైసీపీ రాజకీయ వ్యూహాల్లో భాగంగానే ఈ డ్రామా న‌డుస్తోంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

‘నేను కొట్టినట్టు చేస్తా.. నువ్వు ఏడ్చినట్టు నటించు’ అన్న విధంగా బీజేపీ వైసీపీ మధ్య ‘రాజకీయ సరసం’ నడుస్తున్నట్టు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ‘‘నిన్నగాక మొన్న కేంద్రం జగన్‌ ప్రభుత్వానికి భారీగా పెండింగ్‌ నిధులను విడుదల చేసింది. జగన్‌ను ప్రతి కేసులో కాపాడుతూ వచ్చింది. ఢిల్లీలో మొన్నమొన్న కూడా రహస్య సమావేశాలు జరిపింది.

నాలుగేళ్లపాటు నోరుమూసుకుని, కనీసం పాత కేసుల విచారణ ముందుకు సాగకుండా చూసి, కొత్త కేసులేవీ పెట్టకుండా చూసి, ఇంతలోనే జగన్‌ అవినీతిపై యుద్ధం చేస్తామంటే ఎలా నమ్మాలి? ఇది డ్రామా కాక మరేమిటి?’’ అని ఒక రాజకీయ విశ్లేషకుడు ప్రశ్నించారు.

జ‌గ‌న్ పాల‌న‌లో నిజంగానే అంత అవినీతి జ‌రుగుతుంటే, ఇన్నాళ్లూ కేంద్రం ఎందుకు మౌనంగా ఉన్నదని వారు ప్రశ్నిస్తున్నారు. అమిత్ షా చెప్పిన‌ట్లు ఏపీకి కేంద్రం విడుద‌ల చేస్తున్న ల‌క్షల కోట్లు జ‌గ‌న్ ఖాతాలోకి వెళుతుంటే సీబీఐ, ఈడీ వంటి సంస్థలు ఎందుకు ప‌ట్టించుకోవ‌డంలేద‌ని వారు ప్రశ్నిస్తున్నారు. ‘‘త‌మ‌తో ఉంటే నీతిమంతులు, ఇత‌రుల‌తో ఉంటే అవినీతిపరులు’’ అని బీజేపీ అనుక్షణం నిరూపిస్తున్నదని వారు భావిస్తున్నారు.

అమిత్‌షాకు సూటి ప్రశ్న

ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధుల‌ను అవినీతితో త‌న ఖాతాలో వేసుకోవ‌డం త‌ప్ప జ‌గ‌న్ చేసింది ఏమీ లేదు అంటున్న అమిత్‌షా, జేపీ న‌డ్డాల‌కు ఏపీ మేధావులు సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నారు. ‘‘మ‌రి అవినీతితో ల‌క్షల కోట్లు మింగుతున్న జ‌గ‌న్ అవినీతి కేసుల‌ను నాలుగేళ్లుగా ఎందుకు తొక్కిపెట్టారు? ఎందుకంటే జ‌గ‌న్ బిజేపీ శిబిరంలో ఉన్నారు కాబ‌ట్టి. మోదీ, షాల ద్వయం ఈ దేశంలో సీబీఐ, ఈడీ లాంటి ద‌ర్యాప్తు సంస్థల‌ను విప‌క్ష నేత‌ల‌పై కాకుండా, బీజేపీ శిబిరంలో ఉన్న ఒక్క రాజ‌కీయ నాయ‌కుడిపై అయినా ఉసిగొల్పిందా’’ అని ప్రశ్నిస్తున్నారు.

ప‌వ‌న్‌ను ప‌ట్టుకోవ‌డం, జ‌గ‌న్‌ను ఆదుకోవ‌డమే అజెండా

ఇంత‌కూ ఎన్నిక‌ల‌ముందు వైసీపీ-బీజేపీల మ‌ధ్య కృత్రిమ యుద్ధ వాతావ‌ర‌ణం వెనుక పెద్ద స్కెచ్చే ఉందంటున్నారు. ‘‘ప‌వ‌న్‌-టీడీపీ మ‌ధ్య పొత్తు దాదాపు ఖ‌రారైంది. ఇప్పుడు ప‌వ‌న్‌ను టీడీపీకి దూరం చేసి బీజేపీకి దగ్గర చేయాలంటే వైసీపీతో వైరం ఉన్నట్లు క‌ల‌రింగ్ ఇచ్చుకోవాలి. అలా చేస్తే తిరిగి అధికారం చేప‌ట్టే అవ‌కాశం వైసీపీకి ఉంటుంది. ఈ విధంగా జగ‌న్‌కు బీజేపీ స‌హ‌క‌రించే వ్యూహంలో భాగంగానే వైసీపీని టార్గెట్ చేసిన‌ట్లు’’ ఒక రాజకీయ పరిశీలకుడు అభిప్రాయపడ్డారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన‌, వామ‌ప‌క్షాలు క‌లిసి పోటీ చేయ‌డానికి దాదాపు సిద్ధపడ్డాయి. వైసీపీ-బీజేపీ దోస్తీపై విద్యావంతులైన మైనార్టీ వ‌ర్గాల్లో కూడా అవ‌గాహ‌న వ‌చ్చి, వారు ప్రత్యామ్నాయంవైపు ఓట్లేసే ఆలోచ‌న‌లో ఉన్నట్లు స‌ర్వేల్లో వెల్లడైంది.

‘‘బీజేపీకి హిందూత్వ ఓట్లు ఎంత బ‌ల‌మో, వైసీపీకి ముస్లిం, క్రైస్తవుల ఓట్లు అంతే బ‌లం. ఈసారి ఈ మైనార్టీ ఓటు బ్యాంకు చీల‌కుండా, టీడీపీ కూట‌మికి మ‌ర‌ల‌కుండా తిరిగి జ‌గ‌న్ పార్టీకే ప‌డాలంటే బీజేపీ-వైసీపీ మ‌ధ్య తీవ్ర విభేదాలు ఏర్పడినట్లు క‌నిపించాలి. ఈ వ్యూహం కూడా జ‌గ‌న్‌కే ఉపయోగపడుతుంది’’ అని ఒక రిటైర్డు అధికారి విశ్లేషించారు.

బీజేపీ ప‌దేళ్ల పాల‌న‌పై మొహం వాచిన ఆంధ్రా ఓటర్లు ఆ వ్యతిరేక ఓటును చంద్రబాబుకు వేయకుండా జ‌గ‌న్‌కు వేయించే కుట్రలో భాగమే ఈ ఎత్తుగడ అని ఆయన అన్నారు. మొత్తంగా వైసీపీనా, టీడీపీనా? అంటే ఎవ‌రి వ‌ద్ద వారే అన్నట్లు బీజేపీ న‌టిస్తున్నా, నిజానికి జ‌గ‌న్‌కే ఎక్కువ మ‌ద్దతు ఇస్తున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎందుకంటే, అవినీతి కేసులున్న జ‌గ‌న్ పార్టీ గెలిస్తే, కేసుల బూచి చూపి కేంద్రంలో మ‌ద్దతు కూడ‌గ‌ట్టుకోవ‌డం ఈజీ. అదే చంద్రబాబు బ‌ల‌ప‌డితే ఆయ‌న్ను మ్యానేజ్ చేయ‌డం క‌ష్టత‌రం. ఈ లాజిక్‌తోనే బీజేపీ-వైసీపీ మ‌ధ్య స్పష్టమైన లోపాయికారి ఒప్పందం జ‌రిగింద‌న్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బీజేపీ అంటేనే అవినీతిని కొమ్ముకాసే పార్టీ

‘‘భార‌తీయ జ‌న‌తా పార్టీనే అవినీతిప‌రులను కొమ్ముకాసే పార్టీ. ఆ పార్టీ ఉన్నదే సంపన్నవర్గాలు, కార్పొరేట్‌ కంపెనీలు, వ్యాపార వర్గాలను పోషించడానికి. ఆ పార్టీ విధానాలు అన్నీ దేశ సంప‌ద‌ను దోచుకున్న వారిని కాపాడేవే. ప్రతిపక్ష శిబిరంలో ఉండే నిజాయితీప‌రుల‌ను కూడా అవినీతిప‌రులుగా చిత్రించి, వారిపై సిబిఐ, ఈడీ లాంటి ద‌ర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతారు.

బ్యాంకులకు వేలకోట్లు ఎగవేసినవారు, మారణహోమం సృష్టించినవాళ్లు, హత్యలు చేసినవాళ్లు, అత్యాచారాలు చేసినవాళ్లు, రైతు ఉద్యమకారులను కార్లతో తొక్కించిన వాళ్లు, రెజ్లర్లను లైంగికంగా వేధించినవాళ్లు, 40 శాతం క‌మీష‌న్ తీసుకున్నవాళ్లు, వ్యాపం కుంభకోణానికి పాల్పడినవాళ్లు, గాడ్సే భక్తులు…ఇటువంటి వారందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటారు’’ అని ఒక విశ్లేషకుడు విమర్శించారు.