ఆస్కార్స్: నాడు శిష్యుడు రెహమాన్.. ఇప్పుడు గురువు కీరవాణి..!
విధాత: ఎం ఎం కీరవాణి… ఈయన ప్రస్తుతం దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళంలో మరకతమణిగా బాలీవుడ్ లో ఎంఎం క్రీమ్ గా పరిచయమైన కీరవాణి అంతర్జాతీయ గుర్తింపు సాధించారు. రామోజీరావు సంస్థ ఉషా కిరణ్ మూవీస్ లో వచ్చిన మనసు మమత ద్వారా సంగీత దర్శకునిగా పరిచయమయ్యారు. ఈ చిత్రానికి మౌళి దర్శకుడు. ఆ తర్వాత కూడా ఈయన ఉషా కిరణ్ మూవీస్ లో ఎన్నో చిత్రాలు చేశారు. కీరవాణి బాగా గుర్తింపును తీసుకొని […]

విధాత: ఎం ఎం కీరవాణి… ఈయన ప్రస్తుతం దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళంలో మరకతమణిగా బాలీవుడ్ లో ఎంఎం క్రీమ్ గా పరిచయమైన కీరవాణి అంతర్జాతీయ గుర్తింపు సాధించారు. రామోజీరావు సంస్థ ఉషా కిరణ్ మూవీస్ లో వచ్చిన మనసు మమత ద్వారా సంగీత దర్శకునిగా పరిచయమయ్యారు. ఈ చిత్రానికి మౌళి దర్శకుడు. ఆ తర్వాత కూడా ఈయన ఉషా కిరణ్ మూవీస్ లో ఎన్నో చిత్రాలు చేశారు. కీరవాణి బాగా గుర్తింపును తీసుకొని వచ్చిన చిత్రం మాత్రం క్రాంతి కుమార్ దర్శక నిర్మాతగా తెరకెక్కించిన కళాఖండం సీతారామయ్యగారి మనవరాలు అని చెప్పాలి.
ఆ తరువాత క్షణక్షణం చిత్రంతో ఆయన మరో స్థాయికి చేరారు. ఇక రాఘవేంద్రరావు దర్శకునిగా మెగాస్టార్ చిరంజీవితో ఈయన పని చేసిన ఘరానా మొగుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా కొందరు సంగీత దర్శకులు బిజిఎం బాగా అందిస్తారని మరికొందరు మెలోడీ లని మరికొందరు మాస్ అని ఇలా కేటగిరీలుగా విభజించుకుంటారు. కానీ కీరవాణిలో ఇవి అన్ని కలిసి ఇమిడి ఉన్నాయి. ఆయన అందించే సంగీతం సంగీత వాయిద్యాల హోరు లేకుండా సాహిత్యం వినబడేలా ఉంటుంది. ఈయన మాస్ సాంగ్స్ చేసినా కూడా తనదైన మెలోడీ మార్కులు చూపిస్తారు.
తెలుగు, తమిళ ,హిందీ భాషలకు 100 చిత్రాలకు పైగానే సంగీతాన్ని అందించారు. 1997లో వచ్చిన అన్నమయ్య చిత్రానికి గాను ఉత్తమ సంగీత దర్శకునిగా జాతీయ స్థాయి అవార్డును అందుకున్నారు. ఈయన రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన 25 చిత్రాలకు పైగా సంగీతం వహించారు. ఒకరకంగా ఈయన రాఘవేంద్రరావు, రాజమౌళిలకు ఆస్థాన సంగీత దర్శకుడు.
ఈయన సంగీతం అందించిన చిత్రాలన్నీ చెప్పుకోదగినవే కావటం విశేషం. మాతృదేవోభవ, సీతారామయ్యగారి మనవరాలు, క్షణక్షణం, అల్లరి మొగుడు, మేజర్ చంద్రకాంత్, అల్లరి ప్రియుడు, అన్నమయ్య, శ్రీరామదాసు, స్టూడెంట్ నెంబర్ వన్, చత్రపతి, సింహాద్రి, అనుకోకుండా ఒక రోజు, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం, మిస్టర్ పెళ్ళాం, పెళ్లి సందడి, సుందరాకాండ వంటి ఎన్నో చిత్రాలు ఒకదాన్ని మించి మరొకటి విజయం సాధించాయి. రాఘవేంద్రరావు నుంచి క్రిష్ వరకు బాపు నుంచి విశ్వనాధ్ వరకు ఎందరో చిత్రాలకు పని చేశారు. ప్రస్తుతం సెలక్టెడ్ చిత్రాలకు మాత్రమే సంగీతం అందిస్తున్నారు.
అయితే 2023 గోల్డెన్ గ్లోబ్ ఆవార్డులకు గాను రాజమౌళి దర్శకత్వం వహించిన RRR చిత్రానికి గాను రెండు నామినేషన్స్ దక్కగా, ఉత్తమ ఆంగ్లేతర చిత్రం ఒరిజినల్ సాంగ్ విభాగంలో కీరవాణి స్వరపరిచిన నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డును దక్కించుకుంది. అంతకుముందు ఆయన శిష్యుడు రెహమాన్ ఈ ఆవార్డును సాధించగా ఇప్పుడు గురువు ఆ ఆవార్డు దక్కించుకున్నాడు.
మణిశర్మతో కలిసి కీరవాణి వద్ద కీబోర్డ్ ప్రేయర్ గా కొన్ని సినిమాలకు పనిచేసిన రెహమాన్ తన గురువు కంటే ముందు ఈ ఘనతను సాధించి రికార్డుల్లోకి ఎక్కాడు. అంతర్జాతీయ స్థాయిలో రెండు ఆస్కార్ అవార్డులు, రెండు గ్రామీ పురస్కారాలు, ఒక్క గోల్డెన్ గ్లోబ్ పురస్కారం అందుకున్నాడు. మరీ ముఖ్యంగా స్లమ్ డాగ్ మిలియనీర్ లోని జయహో అనే పాట ఈయనకు గోల్డెన్ గ్లోబ్ అవార్డును తెచ్చి పెట్టింది. రెండు ఆస్కార్ అవార్డులను ఒక గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్న తొలి భారతీయుడిగా ఏఆర్ రెహమాన్ కీర్తి ఎంతో ఉన్నత స్థాయికి చేరింది.
ప్రస్తుతం తన నాటు నాటు పాటతో గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్న కీరవాణి త్వరలో ఆస్కార్ అవార్డులకు పోటీ పడ బోతున్నాడు. ఇందులో ఆయన ఆస్కార్ పురస్కారాన్ని అందుకుంటాడా లేదా అనేది పక్కన పెడితే మొత్తానికి కీరవాణి ఆస్కార్కు చేరువలో ఉన్నాడని చెప్పవచ్చు. శిష్యుడు ఎప్పుడో సాధించిన ఘనతను ఇప్పుడు గురువు సాధించడం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అందులో ఇది తెలుగు చిత్రం కావడంతో తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కీరవాణి ఆస్కార్ రూపంలో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించినట్టు అధిరోహించి అక్కడ మన తెలుగు సినిమా జెండాను ఎగురవేస్తాడో లేదో చూడాలి..!