ఉగ్రదాడిలో లెఫ్టినెంట్ కల్నల్‌కు బుల్లెట్ గాయం.. 8 ఏండ్లుగా కోమాలో ఉండి కన్నుమూత
ఎనిమిదేండ్ల క్రితం జరిగిన ఉగ్రదాడిలో బుల్లెట్ గాయానికి గురైన లెఫ్టినెంట్ కల్నల్ కోమాలోకి వెళ్లారు. ఈ ఎనిమిదేండ్లు మృత్యువుతో పోరాడుతూ శనివారం కన్నుమూశారు

శ్రీనగర్ : ఎనిమిదేండ్ల క్రితం జరిగిన ఉగ్రదాడిలో బుల్లెట్ గాయానికి గురైన లెఫ్టినెంట్ కల్నల్ కోమాలోకి వెళ్లారు. ఈ ఎనిమిదేండ్లు మృత్యువుతో పోరాడుతూ శనివారం కన్నుమూశారు. లెఫ్టినెంట్ కల్నల్ మృతి పట్ల ఆర్మీ సైన్యం సంతాపం ప్రకటించింది.
వివరాల్లోకి వెళ్తే.. జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో 2015, నవంబర్ నెలలో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ కొనసాగుతోంది. ఆ సమయంలో సేన మెడల్ గ్రహీత లెఫ్టినెంట్ కల్నల్ కరణ్‌బీఆర్ సింగ్ నాట్.. ఆ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించారు. కుప్వారాకు సమీపంలోని ఓ గ్రామం వద్ద కూంబింగ్ ఆపరేషన్ జరుగుతుండగా, ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కరణ్‌బీర్ సింగ్ తలకు బుల్లెట్ తగిలింది. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి కోమాలోకి వెళ్లిపోయారు. 2015 నుంచి మొన్నటి వరకు అంటే ఎనిమిదేండ్లుగా ఆయన మృత్యువుతో పోరాడుతూ చివరకు తుదిశ్వాస విడిచారు. జలంధర్‌లోని మిలటరీ ఆస్పత్రిలో కన్నుమూసినట్లు ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు.
లెఫ్టినెంట్ కల్నల్ కరణ్‌బీర్ సింగ్ నాట్ నిజానికి 1998లో ది బ్రిగేడ్ ఆఫ్ గార్డ్స్‌లో షార్ట్ సర్వీస్ కమీషన్ ఆఫీసర్‌గా నియమించబడ్డారు. నాట్ 2012లో తన సర్వీస్ నుండి రిలీవ్ అయ్యే ముందు 14 సంవత్సరాలు రెజిమెంట్‌లో పనిచేశారు. షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్‌గా సర్వీస్ పూర్తి చేసిన తర్వాత అతను టెరిటోరియల్ ఆర్మీలో చేరారు. ఆ తర్వాత విధుల్లో భాగంగా నిర్వహించిన టెర్రర్ యాంటీ ఆపరేషన్‌లో బుల్లెట్ గాయం తగలడంతో కోమాలోకి వెళ్లిపోయారు. నాట్‌కు భార్య నవప్రీత్ కౌర్, కూతుళ్లు గునీత్, అష్మిత్ ఉన్నారు.