ఆరోపణల రొచ్చులో BRS ఎమ్మెల్యేలు!

విధాత: అడుసు తొక్కనేలా కాలు కడుగనేలా అన్నట్లుగా ఉంది.. ఉమ్మడి నల్గొండ జిల్లా అధికార BRS పార్టీ ఎమ్మెల్యేల నిర్వాకం. అధికారం అండగా వారిదే రాజ్యం అన్నట్లుగా ఇన్నాళ్లుగా సాగిన రోజులకు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది కాలం చెల్లడం మొదలైంది. ఇంతకాలం అధికార పార్టీ ఎమ్మెల్యేల అక్రమాలపై మౌనంగా ఉన్న పార్టీలోని అసంతృప్తివాదులు ఇక ఎంత కాలం అంటూ ఎన్నికల వేళ తమ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అధికారం మాటున చేసిన అక్రమాలు, భుకబ్జాలు, ఇసుక […]

  • By: krs    latest    Feb 26, 2023 11:41 AM IST
ఆరోపణల రొచ్చులో BRS ఎమ్మెల్యేలు!

విధాత: అడుసు తొక్కనేలా కాలు కడుగనేలా అన్నట్లుగా ఉంది.. ఉమ్మడి నల్గొండ జిల్లా అధికార BRS పార్టీ ఎమ్మెల్యేల నిర్వాకం. అధికారం అండగా వారిదే రాజ్యం అన్నట్లుగా ఇన్నాళ్లుగా సాగిన రోజులకు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది కాలం చెల్లడం మొదలైంది.

ఇంతకాలం అధికార పార్టీ ఎమ్మెల్యేల అక్రమాలపై మౌనంగా ఉన్న పార్టీలోని అసంతృప్తివాదులు ఇక ఎంత కాలం అంటూ ఎన్నికల వేళ తమ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అధికారం మాటున చేసిన అక్రమాలు, భుకబ్జాలు, ఇసుక దందాలపై రాజకీయ ప్రత్యర్థులకు, మీడియాకు వరుస లీకులు ఇస్తుండటంతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరు అవినీతి బురదలో ఇరుక్కుపోతున్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఒకరిద్దరి ఎమ్మెల్యేలపై మినహా మిగతా వారందరి పైన ఏదో ఒక అక్రమాల ఆరోపణల కథనాలు మీడియాలో వెలువడుతుండటం జనాన్ని ఆలోచింప చేస్తున్నాయి. హుజూర్నగర్ నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రభుత్వ, ఫారెస్ట్ భూముల ఆక్రమణల పర్వంలో కూరుకుపోయాడంటూ అక్కడి ప్రతిపక్ష నేత వరుస విమర్శనాస్త్రాలను ఎక్కు పెడుతూనే ఉన్నారు.

కోదాడ నియోజకవర్గంలో అనంతగిరి, చిలుకూరు మండలాల్లో గుట్టల మట్టితో సాగిస్తున్న అక్రమ దందా వెనుక స్థానిక ఎమ్మెల్యే అనుచరుల పాత్ర ఉందన్న ఆరోపణలు చోటు చేసుకున్నాయి. దీనిపై అక్కడ పోలీస్ శాఖ విచారణ సైతం చేపట్టింది. మూసీ నది, బిక్కెరు వాగునుండి సాగుతున్న కోట్లాది రూపాయల అక్రమ ఇసుక దందా విషయమై నకిరేకల్, తుంగతుర్తి, నల్గొండ ఎమ్మెల్యేలు వేల కోట్లు ఆర్జిస్తున్నారంటూ బీఎస్పీ అధినేత, మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఈ నియోజకవర్గాల ఎమ్మెల్యేల మధ్య ఇసుక దందా వ్యాపార లావాదేవీలు పరస్పరం వారి మధ్య వైరాన్ని సైతం సృష్టించిందన్న ప్రచారం ఆ పార్టీ వర్గాల్లో వినిపించింది. ఇసుక రీచ్ లకు, ఇసుక రవాణాలకు ఇచ్చిన అనుమతుల ముసుగులో మూసి,బిక్కేరు నుండి హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలకు సాగిస్తున్న అక్రమ ఇసుక దందా వెనుక బీఆర్ఎస్ రాష్ట్ర పెద్దల భాగస్వామ్యం కూడా ఉందని, అందుకే ఆ పార్టీ ఎమ్మెల్యేలే అక్రమ ఇసుక దందాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు వెలువడ్డాయి.

నకిరేకల్, నల్గొండ నియోజకవర్గంలోని భూవివాదాల్లో అక్కడ ఎమ్మెల్యేల ప్రమేయం పై ఆరోపణలు తరచూ వివాదాస్పదమవుతున్నాయి. ముఖ్యంగా ఇసుక దందా, భూదందా, వెంచర్లలో వాటాలు, కాంట్రాక్టర్లలో కమిషన్లు, మున్సిపాలిటీలలో భవనాల నిర్మాణాలకు ముడుపులు, అధికారుల పోస్టింగులలో వసూళ్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకాలో అక్రమాలు వంటి వాటితో కోట్లు దండుకుంటున్నారన్న ఆరోపణల రచ్చ సాధారణమైపోయింది. మిర్యాలగూడ, సాగర్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులపై కూడా భూ దందాలు, అక్రమ వసూళ్ల ఆరోపణలు వెలువడ్డాయి.

ఆలేరు నియోజకవర్గంలో భూ వివాదాల సెటిల్మెంట్లలో, రియల్ వ్యాపారాల్లో స్థానిక ఎమ్మెల్యే కుటుంబంపై సైతం ఆరోపణలు వచ్చాయి. మునుగోడులో ఇసుక రవాణా, భూదందా, ఫ్యాక్టరీలలో అక్రమ వసూలు వంటి ఆరోపణలు అక్కడి ప్రజాప్రతినిధి పై వినిపించాయి. భువనగిరి నియోజకవర్గంలో రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ వ్యవహారం స్థానిక ఎమ్మెల్యేను ఆబాసు పాలు చేసింది.

సూర్యాపేటలో గతంలో మెడికల్ కళాశాల, కలెక్టరేట్ల నిర్మాణ స్థలాల ఎంపికలో రియల్ నేపథ్యం ఉందంటూ మంత్రి జగదీష్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినప్పటికి మంత్రి తన అభివృద్ధి పనులతో వాటిని తిప్పికొట్టి అవి కేవలం ఆరోపణలు అని నిరూపిస్తూ ఆయన రెండోసారి విజయం సాధించారు.

దేవరకొండ నియోజకవర్గంలో కాందిశీకుల భూములు, భూదానోద్యమ భూముల దందాలలో, బినామీ వెంచర్లలో , స్టోన్ క్రషర్ల ఏర్పాటులో స్థానిక ఎమ్మెల్యే ప్రమేయంపై ఆరోపణలు చోటుచేసుకున్నాయి.ఇలా మొత్తంగా అన్ని నియోజకవర్గాలలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల అక్రమ దందాలపై రేగిన ఆరోపణల రచ్చ రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ జయాపజయాలపై ఎంత మేరకు ప్రభావం చూపుతాయన్నది ఎన్నికలే తేల్చాల్సి ఉంది.