Assembly Elections | ఆ అభ్యర్థుల ఎంపిక అవగాహన మేరకేనా?

Assembly Elections విధాత‌: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ మొదట 50 మంది అభ్యర్థులను ప్రకటించడానికి సిద్ధపడుతున్నాయి. ఆగస్టు నెలలోనే ఆ జాబితా విడుదలవుతుందని ఆయా పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రధానంగా పోటీ పడుతున్న బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు నువ్వా నేనా అన్నట్లు అప్పుడే అభ్యర్థుల ఎంపిక పై దృష్టి సారించాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బీఆర్‌ఎస్‌ గద్దె దింపాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్‌ అధిష్ఠానం, రాష్ట్ర నాయకత్వం అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ప్రభుత్వ […]

Assembly Elections | ఆ అభ్యర్థుల ఎంపిక అవగాహన మేరకేనా?

Assembly Elections

విధాత‌: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ మొదట 50 మంది అభ్యర్థులను ప్రకటించడానికి సిద్ధపడుతున్నాయి. ఆగస్టు నెలలోనే ఆ జాబితా విడుదలవుతుందని ఆయా పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రధానంగా పోటీ పడుతున్న బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు నువ్వా నేనా అన్నట్లు అప్పుడే అభ్యర్థుల ఎంపిక పై దృష్టి సారించాయి.

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బీఆర్‌ఎస్‌ గద్దె దింపాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్‌ అధిష్ఠానం, రాష్ట్ర నాయకత్వం అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగ, రైతు ఇలా అనేకవర్గాలు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నాయని, మరోసారి గెలుపు అంత ఈజీ కాదనే అభిప్రాయం ప్రజల్లోనే కాదు అధికారపార్టీలోనూ వ్యక్తమవుతున్నది.

అందుకే బీఆర్‌ఎస్‌ అధినేత ప్లాన్‌ బీ అమలు చేయబోతున్నారా? తాము కచ్చితంగా గెలువబోయే చోట బలమైన అభ్యర్థులను, తమకు అవకాశం లేని, కష్టమనే చోట బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టబోతున్నారా? అయితే బీఆర్‌ఎస్‌ లేదా బీజేపీ అభ్యర్థే గెలువాలి కానీ కాంగ్రెస్‌కు మాత్రం ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదని అనుకుంటున్నారా? అంటే ఔననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు

సొంత పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నా..

కొంతకాలంగా అధికారపార్టీ ఎమ్మెల్యేలపై సొంతపార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకత్వమే తిరుగుబాటు చేస్తున్నది. వారికి టికెట్లు ఇవ్వవద్దని అధిష్ఠానాన్ని కోరుతున్నది. వారికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నది. బీఆర్‌ఎస్‌లో ఈసారి సిట్టింగ్‌లలో సుమారు 30 మంది అభ్యర్థులను మార్చుతారని వార్తలు వస్తున్నాయి.

ఆ మధ్య మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు కూడా ఇదే విషయాన్ని తెలిపారు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని కొట్టిపారేసినా.. దాన్నే మరోరూపంలో అమలు చేస్తున్నారని అనిపిస్తున్నది. కొంతమంది అభ్యర్థులకు ఉదాహరణకు రామగుండం, హుజురాబాద్‌ లాంటి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థులు బలంగా ఉన్నారు. ఆ రెండు స్థానాలపై అధికారపార్టీ అప్పుడే ఆశలు వదులుకున్నదా? అంటే ఇటీవలి పరిణామాలు చూస్తే నిజమే అనిపిస్తుంది.

ఎందుకంటే రామగుండం ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసన గళం వినిపించిన వారిని మంత్రి కేటీఆర్‌ పిలిపించి కలిసి పనిచేయాలని సూచించారు. ఆయనకు టికెట్‌ ఇవ్వవద్దని కార్యకర్తలు, కొంతమంది నేతలు కోరుతున్నా… ఆయనకు టికెట్‌ దాదాపు ఖరారు అయినట్టే మీడియాలోనూ.. సోషల్‌ మీడియాలోనూ ప్రచారం జరుగుతున్నది.

ఇక అసెంబ్లీ సమావేశాల్లో ఈటల రాజేందర్‌తో మంత్రి కేటీఆర్‌ ఆత్మీయ ఆలింగనం, ఆయన పట్ల అధికారపార్టీ పెద్దలు వ్యవహరిస్తున్న తీరు రాజకీయంగా చర్చనీయాంశమౌతున్నది. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ల అధిష్ఠానాల మధ్య అంతర్గత అవగాహన మేరకే ఈ నిర్ణయాలు జరుగుతుండ వచ్చని చర్చించుకుంటున్నారు.

మిగిలిన నియోజకవర్గాలపై ఏం చేయబోతున్నారు?

స్టేషన్‌ఘన్‌పూర్‌, వర్దన్నపేట, భూపాలపల్లి,మహబూబాబాద్‌, కొత్తగూడెం, పాలేరు, చొప్పదండి, తాండూరు, నకిరేకల్‌ , ఆలేరు ఇలా అనేక చోట్ల అధికారపార్టీ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సొంతపార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ ఎవరికి ఇచ్చినా మరొకరు పార్టీ మారే అవకాశాలు లేకపోలేదు. అయితే వాళ్లు పార్టీ వీడినా అక్కడ కాంగ్రెస్‌ పార్టీకి అవకాశం ఇవ్వకుడదనే యోచనలో బీఆర్‌ఎస్‌ అధినేత ఉన్నారని సమాచారం.

అందుకే ఈమధ్య కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులు బీజేపీ కంటే ఎక్కువగా కాంగ్రెస్‌నే టార్గెట్ చేసి విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అందుకే ఆయా నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల ప్రకటనను బట్టి ఈ రెండు పార్టీల మధ్య అవగాహనపై స్పష్టత వస్తుందనే టాక్‌ వినిపిస్తున్నది.

మొదటి జాబితాలో ఉండేది ఎవరు?

సిట్టింగులందరికీ టికెట్‌ గ్యారెంటీ అని, సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయని కేసీఆర్‌ పదే పదే చెబుతున్నారు. కానీ మొదట 50 మంది అభ్యర్థులనే ప్రకటిస్తారని అంటున్నారు. అందులో దాదాపు మంత్రులంతా ఉండొచ్చు.

మిగిలిన జాబితా ఎవరి పేరు గల్లంతు అవుతుందో? సారు ఈసారి మమ్మల్ని కనికరిస్తారని కొంతమంది ఆశావహుల ఆశలు కొన్నిరోజులుగా ఆపార్టీలో జరుగుతున్న పరిణామాలతో ఆవిరవుతున్నాయి. సర్వేల ఆధారంగా టికెట్లు ఇస్తామన్నది కూడా ఉత్తముచ్చటేనా అనే సందేహాలు వారిలో వ్యక్తమౌతున్నది. ఈ వ్యవహారాలన్నీ ఎన్నికల నోటిఫికేషన్‌ రాకముందే కారు పార్టీలో కాక పుట్టిస్తున్నాయి.