ఏపి టిడిపి అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఈ మధ్య పెద్దగా అలికిడి లేదు.చంద్రబాబు అరెస్ట్ తరువాత అక్కడక్కడా మీడియాతో..కార్యకర్తల సమావేశంలో మాట్లాడడమే తప్ప ముఖ్యమైన వేదిక అయిన అసెంబ్లీలో సౌండ్ లేదు.. ఏమైంది.. ఎందుకలా ఉన్నారు. ప్రజాప్రతినిధులు ఎవరైనా అసెంబ్లీలో తమ వాయిస్ వినిపించి ప్రజల్లో ఇమేజి పెంచుకోవాలని చూస్తారు. వారి వాక్చాతుర్యం మొత్తం చట్ట సభలో చూపాలని ఆశిస్తారు.
మరి చంద్రబాబు అరెస్ట్ తరువాత జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో అచ్చెన్న ఎందుకు మాట్లాడలేదు.. సైలెంట్ గా ఎందుకు ఉన్నారన్నది తెలియడం లేదు. కానీ చూస్తుంటే మాత్రం తనను పార్టీలో పెద్దగా ప్రయార్టి ఇవ్వనందుకు అలక వహించారని అంటున్నారు.అసెంబ్లీ సమావేశాల్లో అంతా బాలయ్య అల్లరి చిల్లర వేషాలతో సరిపోయింది. విజిల్ ఊదడం. చేతులతో అసభ్యంగా సంజ్ఞలు చేయడం..మీసాలు తిప్పడం..చంద్రబాబు కుర్చీలో ఎక్కి నిలబడడం వంటి చర్యలతో బాలయ్య మొత్తం టిడిపి సభ్యుల్లో ఎక్కువగా హడావుడి చేశారు.
కానీ అచ్చెన్న మాత్రం ఏమీ చేయకుండా మిన్నకున్నారు. అంటే ఇదంతా జైల్లో చంద్రబాబు బాలయ్యకు మొన్నటి ములాఖాత్ సమయంలో చెప్పి, సభలో టిడిపి మొత్తాన్ని నడిపించాలని సూచించి ఉండవచ్చని, అందుకే బాలయ్య అంత ఓవర్ చేశారని..ఇక తాను మిన్నకుండడం మేలని భావించి అచ్చెన్న సైలెంట్ అయ్యారని అంటున్నారు. దీంతోపాటు జనసేన తో పొత్తు విషయంలోనూ తనను పట్టించుకోకుండా కేవలం పవన్..లోకేష్ ..బాలయ్య సమక్షంలో పొత్తు ప్రకటన జరిగిపోవడం సైతం అచ్చెన్నను అవమానపర్చింది అంటున్నారు.
స్టేట్ ప్రెసిడెంట్ అయిన తనతో కనీసం మాట మాత్రం అయినా చెప్పకుండా నిర్ణయాలు తీసుకున్నాక ఇక తనకు విలువేముంది అని అచ్చెన్న ఫీలయ్యారు అంటున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని అయిన తనను చంద్రబాబు కనీసం ములాఖాత్ కు పిలవలేదని, కుటుంబం తరువాత ఆయన్ను కలిసింది యనమల రామకృష్ణుడి మాత్రమే కానీ తనకు ఆమాత్రం గుర్తింపు కూడా దక్కలేదని ఫీలైన అచ్చెన్న కాస్త సైలెంట్ మోడ్ లోకి వెళ్లినట్లు చెబుతున్నారు.