ఏపీలో వచ్చే ఎన్నికల్లో 160 సీట్లు గెలుస్తాం

ఆంధ్రప్రదేశ్ శాసనసభకు త్వరలో నిర్వహించే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 160 స్థానాలను గెలవబోతున్నట్లు ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు

  • Publish Date - January 4, 2024 / 01:30 PM IST
  • జగన్‌ రెడ్డిని బంగాళాఖాతంలో కలపడం ఖాయం
  • బీసీలకు అండాదండా తెలుగుదేశం పార్టీనే..
  • టీడీపీ బీసీ సదస్సులో రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభకు త్వరలో నిర్వహించే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 160 స్థానాలను గెలవబోతున్నట్లు ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు. అధికార వైసీపీ పార్టీ, సీఎం జగన్ ను జనం బంగాళాఖాతంలోకి కలపడం ఖాయమని అన్నారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆపార్టీ ఆధ్వర్యంలో జయహో బీసీ సదస్సు ప్రారంభమైంది. కార్యక్రమానికి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి పార్లమెంటు పరిధిలో జయహో బీసీ సభలు పెడతామని,. చంద్రబాబు, లోకేష్‌ ఆధ్వర్యంలో బీసీ డిక్లరేషన్‌ ప్రకటిస్తామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.


ఎన్టీఆర్ నాయకత్వంలో టీడీపీ పార్టీ ఆవిర్భావంతోనే బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేసి, రాజకీయ అవకాశాలు కల్పించినట్లు చెప్పారు. బీసీలంతా తెలుగుదేశం జెండా కింద ఎదిగిన వారేనని అన్నారు. బీసీలు టీడీపీ వెంట ఉన్నారని వైసీపీ అక్కసు వెళ్లగక్కుతోందన్నారు. సీఎం జగన్‌ దండయాత్ర చేపట్టి, బీసీలను అన్ని రంగాల్లో అణగతొక్కేందుకు కుట్రపన్నారని అన్నారు. అందులో భాగంగానే రిజర్వేషన్లు 20 శాతానికి తగ్గించి దగాకోరుగా బీసీలో మదిలో జగన్ నిలిచారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు తమ పార్టీ నేతల కోసమే కట్టబెట్టిందని, బడుగుల్లో ఒక్కరికైనా రుణం ఇచ్చినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పు కుంటానని సవాల్ విసిరారు.


వైసీపీలో రాష్ట్రం నలుదిక్కులనూ విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డికి జగన్‌ రాసిచ్చాడన్నారు. జగన్‌ రెడ్డి తన సొంత సామాజిక వర్గానికే ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇస్తూ బడుగు, బలహీన వర్గాలను అణగతొక్కుతున్నాడంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే తమ బతుకులు బాగుపడతాయని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. జగన్‌ రెడ్డి పాలనలో బీసీలకు జరిగిన అన్యాయంపై క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరిస్తామని చెప్పారు.