‘అవతార్ 2’ రివ్యూ: వండరే కానీ.. ఏదో వెలితి?

మూవీ పేరు: ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ విడుదల తేదీ: 16 డిసెంబర్, 2022 నటీనటులు: సామ్ వర్తింగ్టన్, జోయా సాల్డానా, స్టీఫెన్ లాంగ్, సిగర్నీ వీవర్, జోయెల్ డేవిడ్ మూర్ తదితరులు సంగీతం: సైమన్ ఫ్రాంగ్లెన్ డైలాగ్స్: అవసరాల శ్రీనివాస్ (తెలుగు) సినిమాటోగ్రఫీ: రస్సెల్ కర్పెంటర్ ఎడిటింగ్: స్టీఫెన్ ఈ, రివ్కిన్, డేవిడ్ బ్రెన్నర్, జాన్ రెఫౌవా నిర్మాతలు: జేమ్స్ కామెరూన్, జోన్ లాండౌ కథ, కథనం, దర్శకత్వం: జేమ్స్ కామెరూన్ విధాత‌: హీరోయిజాన్ని […]

‘అవతార్ 2’ రివ్యూ: వండరే కానీ.. ఏదో వెలితి?

మూవీ పేరు: ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’
విడుదల తేదీ: 16 డిసెంబర్, 2022
నటీనటులు: సామ్ వర్తింగ్టన్, జోయా సాల్డానా, స్టీఫెన్ లాంగ్, సిగర్నీ వీవర్, జోయెల్ డేవిడ్ మూర్ తదితరులు
సంగీతం: సైమన్ ఫ్రాంగ్లెన్
డైలాగ్స్: అవసరాల శ్రీనివాస్ (తెలుగు)
సినిమాటోగ్రఫీ: రస్సెల్ కర్పెంటర్
ఎడిటింగ్: స్టీఫెన్ ఈ, రివ్కిన్, డేవిడ్ బ్రెన్నర్, జాన్ రెఫౌవా
నిర్మాతలు: జేమ్స్ కామెరూన్, జోన్ లాండౌ
కథ, కథనం, దర్శకత్వం: జేమ్స్ కామెరూన్

విధాత‌: హీరోయిజాన్ని కూడా డామినేట్ చేయగల అద్భుతం గ్రాఫిక్స్‌కు ఉంది. ఇప్పుడు కొత్తగా యూనివర్స్ అంటూ మరో ప్రపంచాన్ని క్రియేట్ చేసేందుకు దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అవేంజర్స్, 2012, ఎటర్నల్స్ వంటి స్టోరీస్‌‌కు అత్యద్భుత సాంకేతిక పరిజ్ఞానం జోడించి.. ప్రేక్షక ప్రపంచాన్ని మరో ప్రపంచంలోకి పంపిస్తుంది హాలీవుడ్.

ఇప్పుడీ సంస్కృతి అన్ని వుడ్‌లను వ్యాపిస్తోంది. టాలీవుడ్‌లో రాజమౌళి వంటి దర్శకుడు కూడా ఎంత గొప్ప స్టార్స్ ఉన్నా.. సాంకేతిక పరిజ్ఞానం జోడించి.. ప్రపంచాన్ని తనవైపు చూసుకునేలా చేస్తున్నాడు. ఇక అప్పుడెప్పుడో వచ్చిన ‘టైటానిక్’, ‘అవతార్’ వంటి చిత్రాలతో జేమ్స్ కామెరూన్ సరికొత్త సృష్టికి నాంది పలికాడు.

ముఖ్యంగా ‘అవతార్’ సృష్టించిన సంచలనం ఎప్పటికీ ప్రత్యేకమైనదే. ఒక గ్రహాన్ని సృష్టించి, అందులో కొన్ని జీవులను.. ఆ జీవులకో సిస్టమ్‌ని క్రియేట్ చేసి.. వారికి మానవులతో ఇబ్బందులను క్రియేట్ చేయించి.. మళ్లీ ఆ మానవుడి ద్వారానే పరిష్కారం చూపించడం ‘అవతార్‌’లోని విశేషం.

భూమి మీద ఎంపిక చేసిన మనుషులు.. ఇతర గ్రహాలలోకి ప్రయాణించినప్పుడు ప్రత్యేక జీవ, వైద్య, వైజ్ఞానిక, శాస్త్ర, సాంకేతికతతో.. అక్కడి మనుషుల్లా రూపాంతరం చెందడమే ‘అవతార్’. అలాంటి ‘అవతార్’ సినిమాకి సీక్వెల్ అంటే.. ఏ రేంజ్‌లో అంచనాలు ఉంటాయో ఊహించలేం. ‘అవతార్ 2’పై కొన్ని రోజులుగా అలాంటి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్.. ఈసారి వాటర్ ప్రపంచంలో విహరించేందుకు సిద్ధం కండి అనేలా.. అందరినీ సిద్ధం చేసింది.

భారీ బడ్జెట్‌తో, భారీ అంచనాలతో నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ఆ అంచనాలను అందుకుందా? జేమ్స్ కామెరూన్ మరోసారి మాయ చేశాడా? ‘అవతార్ 2’ ని మరో వండర్‌లా ఆయన తీర్చిదిద్దాడా? అసలు ఈ సినిమాపై ప్రేక్షకుల రెస్పాన్స్ ఏమిటి? అనేది మన సమీక్షలో తెలుసుకుందాం.

కథ:
‘అవతార్ 2’లోకి అడుగుపెట్టాలంటే.. ‘అవతార్ 1’ కాస్తైనా తెలుసుండాలి.. ఒకసారైనా చూసుండాలి. అందుకే, అవతార్ 2 విడుదలకు ముందు మరొక్కసారి ఆ చిత్రాన్ని థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. అవతార్ కథ ప్రకారం.. పండోరా గ్రహం నేపథ్యంలో ఈ సినిమా మొదలవుతుంది.

ఆ గ్రహంపై ఓ అద్భుతమైన మహావృక్షం.. ఆ వృక్షం క్రింద అన్అబ్ టైనియమ్ అనే ఖనిజ నిక్షేపం ఉండటం.. దానికోసం భూమిపై ఉన్న ఓ కార్పోరేట్ సంస్థ కన్నేయడం చూపించారు. అందుకోసం ఒక వ్యక్తిని ఆ గ్రహానికి పంపిస్తారు. కానీ అక్కడికి వెళ్లిన ఆ వ్యక్తి మారిపోయి.. పండోరా గ్రహ వాసుల కోసం పోరాడి.. ఆ సంపదను కాపాడతాడు. సింపుల్‌గా మొదటి పార్ట్ ఇది.

ఇప్పుడు అవతార్ 2 విషయానికి వస్తే.. ఇందులో కుటుంబానికి ప్రాధాన్యత‌ను ఎక్కువగా ఇచ్చారు. ఆ కుటుంబాన్ని కాపాడుకోవడమే ఈ అవతార్2‌లోని మెయిన్ కాన్సెప్ట్. తొలి పార్ట్‌లో భూమి నుంచి పండోరా గ్రహానికి వెళ్లిన జెక్ (సామ్ వర్తింగ్‌టన్).. అక్కడ నీత్రి (జో సల్దానా)ని పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత ఆ నావీ తెగకి నాయకుడు అవుతాడు. పదేళ్ల కాలంలో వీరికి పుట్టిన ముగ్గురు పిల్లలతో పాటు దత్త పుత్రిక కిరీ, మరో బాలుడిని కూడా కలుపుకుని మొత్తంగా హాయిగా జీవితం కొనసాగిస్తుంటారు.

ఇదే సమయంలో భూ గ్రహ వాసులు మరోసారి పండోరా గ్రహాన్ని ఆక్రమించుకోవాలని ప్లాన్ చేస్తారు. అందుకోసం ఆ గ్రహంపై ఫస్ట్ పార్ట్‌లో కార్పోరేట్ సంస్థని మోసం చేసిన జెక్‌ని, అతని కుటుంబాన్ని.. అక్కడి మొత్తం తెగని నాశనం చేయాలని భావించగా.. తన కుటుంబాన్ని, తన నావీ తెగని కాపాడుకునేందుకు జెక్ ఏం చేశాడు? ఎందుకు భూ గ్రహ వాసులు.. మళ్లీ పండోరా గ్రహాన్ని ఆక్రమించుకోవాలని అనుకుంటారు? మరి టైటిల్‌లో చెప్పిన ‘ది వే ఆఫ్ వాటర్’ సంగతేంటి? అనేది తెలియాలంటే మాత్రం విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడాల్సిందే.

నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:

అంతా నీల వర్ణం మనుషులు.. ఎవరెవరు ఏ పాత్ర చేశారో కూడా చెప్పడం కష్టం. కానీ మెయిన్ పాత్ర మాత్రం జెక్. ఈ పాత్రలో సామ్ వర్తింగ్‌టన్.. అటు కుటుంబాన్ని, తన నావీ తెగని కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాలు అందరినీ అలరిస్తాయి. అతనికి నీత్రి కూడా మంచి సపోర్ట్ ఇస్తుంది. వారి పిల్లలుగా చేసిన వారు కూడా.. ఆకట్టుకుంటారు.

ఇక ఈ తెగని టార్గెట్ చేసిన పాత్రలో స్టీఫెన్ లాంగ్ పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించారు. ఆయన టీమ్ కూడా సినిమాకు సీరియస్ నెస్ తీసుకువచ్చింది. ఇతర పాత్రలలో చేసిన వారంతా కూడా ఓకే. ఇదొక మాయాజాలం కాబట్టి.. పాత్రల కంటే కూడా విజువల్ గురించే ఎక్కువగా చెప్పుకోవాలి.

సాంకేతిక నిపుణుల పనితీరుకు వస్తే..
ఇదొక అద్భుతమనే చెప్పుకోవాలి. ముఖ్యంగా కెమెరా, విఎఫ్‌ఎక్స్ వర్క్ ఈ అవతార్‌ 2కి ప్రత్యేకం. విజువల్లీ మాత్రం ఖచ్చితంగా ఈ చిత్రం వండర్ అని అంతా అంటున్నారంటే.. అందుకు కారణం వారే. సంగీతం పరంగా ఓకే అని మాత్రమే చెప్పుకోవాలి.

ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు ఈ మధ్య థమన్ ఓ పిచ్చిని ఎక్కించేశాడు. బాక్స్‌లు పగిలేలా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంటూ ఈ మధ్య ఎక్కువగా వినబడుతున్న నేపథ్యంలో.. యాక్షన్ ఎపిసోడ్స్ వరకు ఓకే కానీ.. మిగతా చోట్ల అంతగా మ్యూజిక్ మ్యాజిక్ చేయలేదనే చెప్పుకోవాలి.

ఈ సినిమాలకు ఇలాగే ఉంటుంది అంటే మాత్రం ఏమీ చేయలేం. అలాగే ఈ సినిమాకు దాదాపు 4, 5గురు ఎడిటింగ్ వర్క్ చేశారంటే.. జేమ్స్ ఈ పార్ట్ కోసం ఎంత ఫీడ్ వారికి ఇచ్చి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. అందులో నుంచి వారు 3 గంటల సినిమాను పక్కకి తీయడం.. అభినందించదిగ్గ విషయమే. అయితే ఇంకాస్త నిడివి తగ్గించే ప్రయత్నం చేస్తే బాగుండేది.

విజువల్‌ ప్రపంచంలో ఉన్న ప్రేక్షకుడికి నిడివి తెలియదు కానీ.. బయటికి వచ్చిన తర్వాత టైమ్ చూసుకుంటే మాత్రం షాకవక తప్పదు. ఇంకా.. తెలుగు డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. అవసరాల శ్రీనివాస్ డైలాగ్స్ అక్కడక్కడ చమక్కు మనిపించేలా ఉన్నాయి. ఇక నిర్మాణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

3 వేలకు పైగా కోట్లు ఈ సినిమాకు ఖర్చు పెట్టినట్లుగా లెక్కలు వినబడుతున్నాయి కానీ.. సినిమా చూస్తుంటే.. ఆ నెంబర్ చాలా తక్కువే అని అనిపిస్తుంది. అంతగొప్పగా విజువల్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఇక జేమ్స్ కామెరూన్ ఈ పార్ట్ కోసం పడిన శ్రమ, వెచ్చించిన కాలం.. తద్వారా వచ్చిన అవుట్‌ పుట్.. అన్నీ మెప్పిస్తాయి కానీ.. ఏదో వెలితి మాత్రం అనిపిస్తుంటుంది. అదేంటో విశ్లేషణలో తెలుసుకుందాం.

విశ్లేషణ:

వెలితి అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. ఇందులో తొలి సగం చాలా వరకు ‘అవతార్’ని చూస్తున్నట్లే అనిపిస్తుంది. పండోరా గ్రహంపైనే అంతా జరుగుతుంటుంది. కొత్తగా ఏమీ అనిపించదు. కాకపోతే పిల్లలు యాడ్ అవుతారు అంతే. విజువల్‌గా ‘అవతార్’నే చూస్తున్నట్లు అనిపిస్తున్న తరుణంలో.. భూమిపై ఏర్పడిన సమస్యని చూపించి.. ఈ గ్రహంపై నివాసం ఏర్పాటు చేసుకోవాలని భూ గ్రహ వాసులు అనుకున్నప్పుడు.. సినిమాలో సీరియస్‌నెస్ పెరుగుతుంది.

అప్పుడు జెక్ అండ్ టీమ్ కనిపించకుండా ఉండేందుకు మెట్కయినా ప్రాంతమైన సముద్రగర్భంలోకి వెళ్తారు. అక్కడి నుంచి మాత్రం.. ఇక అంతా అద్భుతమే అని చెప్పాలి. జేమ్స్ కామెరూన్ ప్రతిభ ఏంటో ఇక్కడ తెలుస్తుంది. ఫ్యామిలీని రక్షించుకోవడం, వేరే చోటకి వెళ్లడం.. ఇవన్నీ మన రామాయణ, మహాభారత కథలని తలపిస్తాయి.

జేమ్స్ కూడా మొదటి నుంచి ‘అవతార్’కి స్ఫూర్తి భారతీయ పురాణాలే అని చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో అది క్లియర్‌గా తెలుస్తుంది. అలాగే అమ్మ కడుపులో ఉన్నప్పుడు.. అంటే పుట్టకముందు, అలాగే చనిపోయిన తర్వాత అస్థికలు కలిపేది నీళ్లలోనే అని కూడా ఇందులో అంతర్లీనంగా జేమ్స్ చెప్పుకొచ్చాడు.

ఎప్పుడైతే జెక్ టీమ్ మెట్కయినా ప్రాంతానికి వస్తారో.. అక్కడొక ప్రపంచాన్ని జేమ్స్ సృష్టించాడు. సముద్ర గర్భంలో ఉండే జలచరాలను ఎంతో అందంగా చూపించడమే కాకుండా.. పిల్లలని అలరించడానికి జేమ్స్ కొడుకుతో తిమింగలం ఫైట్ చాలా ఆకర్షణీయంగా చిత్రీకరించాడు. ఇంకా చెప్పాలంటే.. మెట్కయినా యూనివర్స్ మొదలైనప్పటి నుంచి.. జేమ్స్ కామెరూన్ చెలరేగిపోయాడంతే.

తన ఊహా శక్తిని అందుకోవడం అసాధ్యమనే రేంజ్‌లో అవతారమెత్తాడు. అయితే ఫస్టాప్ ఇంకాస్త ఆసక్తికరంగా, కొత్తగా ఆలోచించి ఉంటే మాత్రం.. తిరుగుండేది కాదు. అలాగే కొన్ని చోట్ల ఇలా కూడా చేస్తారా? అది అసాధ్యం కదా.. అనే విధంగా మాట్లాడుకోవడానికి ఆస్కారమిచ్చాడు.

అలాగే శత్రువు.. అదే విలన్ పాత్ర చిత్రీకరణ కూడా అంత ఎఫెక్టివ్‌గా లేదు. మొత్తంగా అయితే.. విజువల్ వండరే కానీ.. ఇంకా కావాలి అనిపించేలా ఉంటుంది. అందుకు కారణం ‘అవతార్’ మొదటి పార్ట్ తర్వాత చాలా చిత్రాలు విజువల్‌కి ప్రేక్షకులను ఆకర్షించాయి.

‘అవతార్’ కూడా మళ్లీ విడుదల చేశారు. ఇలాంటి నేపథ్యంలో ఇంకా ఊహించడమనేది మానవ నైజం. అయితే కలెక్షన్స్ పరంగా మాత్రం ఈ సినిమాకు తిరుగుండక పోవచ్చు. వాటర్ కాన్సెప్ట్, దానిని తీర్చి దిద్దిన తీరు వండర్ అంతే.

ట్యాగ్‌లైన్: వండరే కానీ.. ఏదో వెలితి?
రేటింగ్: 3.25/5