Baby Review | ఈ బేబీ.. గుచ్చుకునే గులాబీ

Baby Review | మూవీ పేరు: ‘బేబీ’ విడుదల తేదీ: 14 జూలై, 2023 నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్, నాగబాబు, హర్ష, సాత్విక్ ఆనంద్, బబ్లూ. సినిమాటోగ్రఫీ: రామ్ రెడ్డి సంగీతం: విజయ్ బుల్గానిన్ ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్ నిర్మాత: ఎస్.కె.ఎన్ రచన, దర్శకత్వం: సాయి రాజేష్ నీలం ‘హృదయకాలేయం’ చిత్రంతో సాయి రాజేష్ నీలం అందరికీ నిర్మాతగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ‘కొబ్బరిమట్ట’, ‘కలర్ ఫొటో’ చిత్రాలకు […]

  • Publish Date - July 15, 2023 / 02:28 AM IST

Baby Review |
మూవీ పేరు: ‘బేబీ
విడుదల తేదీ: 14 జూలై, 2023
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్, నాగబాబు, హర్ష, సాత్విక్ ఆనంద్, బబ్లూ.
సినిమాటోగ్రఫీ: రామ్ రెడ్డి
సంగీతం: విజయ్ బుల్గానిన్
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
నిర్మాత: ఎస్.కె.ఎన్
రచన, దర్శకత్వం: సాయి రాజేష్ నీలం

‘హృదయకాలేయం’ చిత్రంతో సాయి రాజేష్ నీలం అందరికీ నిర్మాతగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ‘కొబ్బరిమట్ట’, ‘కలర్ ఫొటో’ చిత్రాలకు కూడా ఆయన నిర్మాతగా వ్యవహరించారు. కథకుడిగా, నిర్మాతగా సక్సెస్ సాధించిన సాయి రాజేష్.. ఇప్పుడు దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం ‘బేబీ’. ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి ఏదో రకంగా వార్తలలో ఉంచాలని మేకర్స్ తాపత్రయపడుతూ వచ్చారు. అలాంటి వారికి ‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా’ సాంగ్ వచ్చిన తర్వాత ఇక సినిమా గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే ఆ పాట అంతగా జనాల్లోకి వెళ్లిపోయింది. అయినా కూడా ప్రమోషన్స్ పరంగా ఎక్కడా వెనక్కి తగ్గలేదు.

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, యూట్యూబ్‌ వీడియోలతో బాగా ఫేమస్ అయిన వైష్ణవి చైతన్య, ‘థ్యాంక్యూ బ్రదర్’ చిత్ర హీరో విరాజ్ అశ్విన్ మధ్య సాగే స్టోరీ ఇదని పోస్టర్స్‌తో క్లారిటీ ఇస్తూ వచ్చారు. ఇక రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్‌తో ఇది ముక్కోణపు ప్రేమ కథ అనే విషయం అర్థమైంది. మరీ ముఖ్యంగా ‘మొదటి ప్రేమకి మరణం లేదు.. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది’ అనే కొటేషన్ యువతలోకి బాగా వెళ్లిపోయింది. ‘కలర్ ఫొటో’ తర్వాత మరో కొత్త లవ్ స్టోరీ ఇదనేలా టాక్ మొదలవ్వడంతో సహజంగానే సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా? అసలీ ‘బేబీ’ ప్రేక్షకులని ఎలా మెప్పించింది.. అసలిందులో ఉన్న మ్యాటరేంటి అనేది మన రివ్యూలో తెలుసుకుందాం.

కథ:
కథను దాదాపు ట్రైలర్‌లోనే రివీల్ చేశారు మేకర్స్. వైషు (వైష్ణవి చైతన్య), ఆనంద్ (ఆనంద్ దేవరకొండ) ఇద్దరూ ఎదురెదురింట్లో ఉంటూ కలిసి చదువుకుంటూ ఉంటారు. వీరిద్దరి మధ్య స్కూల్ డేస్‌లోనే ప్రేమ చిగురిస్తుంది. ఇద్దరూ అది ప్రేమని తెలుసుకుంటారు.. ప్రేమించుకుంటారు. అయితే టెన్త్ క్లాస్‌లో ఆనంద్ ఫెయిలవుతాడు. వైష్ణవి మాత్రం పాసై కాలేజీకి కూడా వెళుతుంది. ఆనంద్ ఆటో డ్రైవర్‌గా మారతాడు. వైష్ణవి ఇంటర్ పూర్తి చేసి ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చేరుతుంది.

అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఎప్పుడైతే కాలేజీలో అడుగు పెట్టిందో.. వైషులో మార్పు మొదలవుతుంది. పరిస్థితులకు, పరిసరాలకు అనుగుణంగా తను మారిపోతుంది. అంతేకాదు క్లాస్‌మేట్ విరాజ్ (విరాజ్ అశ్విన్)కు చాలా దగ్గరవుతుంది. ఎంత దగ్గర అంటే.. ఇద్దరూ శారీరకంగా ఒక్కటయ్యేంతగా. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ విషయం తెలిసిన ఆనంద్ ఏం చేశాడు? ఆనంద్ ప్రేమకథ తెలుసుకుని విరాజ్ ఏం చేశాడు? వైషు చివరికి ఎవరి సొంతమవుతుంది? అనేది తెలియాలంటే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా చూడాల్సిందే.

నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:

ముందుగా నటీనటుల విషయానికి వస్తే.. ఈ సినిమాకు ఒకరు ఎక్కువ చేశారని, ఒకరు తక్కువ చేశారని చెప్పలేం. ఆనంద్, వైష్ణవి, విరాజ్ ముగ్గురూ ముగ్గురే అన్నట్లుగా జీవించేశారు. ఆనంద్ దేవరకొండ ఈ సినిమాలో మెచ్యురిటీ నటనను కనబరిచాడు. ఇంతకు ముందు సినిమాలు వేరు, ఈ సినిమా వేరు అన్నట్లుగా తన కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా ఇది. అన్న విజయ్ దేవరకొండకు ఏ మాత్రం తక్కువ కాదు అనేలా.. సహజ నటనతో ఆనంద్ ఆకర్షించాడు. అతని కెరీర్‌కి నిజంగానే ఇది పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది.

వైష్ణవి చైతన్య గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె పాత్రని దర్శకుడు వైవిధ్యంగా డిజైన్ చేశాడు. ఆమె యూట్యూబ్ వీడియోల అనుభవం ఎంతగానో ఉపయోగపడింది. నిజంగా ఒక పక్కింటి అమ్మాయిని, లేదంటే.. మనకు తెలిసిన అమ్మాయి జీవితం ఇలా అయిపోయిందా? అనిపించేంతగా వైష్ణవి తన నటనతో ఆకట్టుకుంది.

విరాజ్ కూడా తన పాత్రకి పూర్తిగా న్యాయం చేశారు. నేటి కాలేజ్ కుర్రకారు ఎలా అయితే అడ్డదారులు తొక్కుతున్నారనేది విరాజ్ పాత్ర ద్వారా దర్శకుడు బాగా చూపించాడు. విరాజ్ కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న తన పాత్రకి పర్ఫెక్ట్‌గా సరిపోయాడు. ఇంకా నాగబాబు, సాత్విక్ ఆనంద్, బబ్లూ, హర్ష వంటి వారంతా వారి పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. కాకపోతే మెయిన్ ముగ్గురూ తమ నటనతో.. అంతా తమవైపే చూసేలా చేశారు.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే..

విజయ్ బుల్గానిన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అరిపించేశాడు. నిజంగా ఒక ప్రేమ కథని ప్రేక్షకుల హృదయాలలోకి చేర్చాలంటే ఎలాంటి బీజీఎమ్ కావాలో.. అలాంటి బీజీఎమ్ ఈ సినిమాకు సెట్ చేశాడు. ఫస్ట్ టైమ్ ఒక మ్యూజిక్ దర్శకుడు సినిమాకు ఇంత కష్టపడతాడా? అనిపించింది అంటే.. అతని పనితనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కే కాదు.. పాటలు కూడా చక్కగా కుదిరాయి.

అలాగే సినిమాటోగ్రఫీ కూడా చక్కని మూడ్‌ని క్యారీ చేసింది. మనకు తెలిసిన కథే ఇది అని, మన పక్కనే జరుగుతున్నట్లుగా అనిపించే విషయంలో సినిమాటోగ్రఫీ కూడా ప్రధాన భూమిక పోషించింది. ఎడిటింగ్ పరంగా మాత్రం.. సినిమా చాలా స్లోగా నడిచింది. నిడివి కాస్త తగ్గించే అవకాశం కూడా ఉంది. మెయిన్ కొన్ని సీన్లు మ్యూజిక్‌తోనే నడిపించేశారు. అలాంటి వాటిపై కొద్దిగా దృష్టి పెట్టాల్సింది.

నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు సాయి రాజేష్ గురించి చెప్పుకుంటే.. ఈ సినిమాకు ఆయన రాసిన డైలాగ్స్ బాగా పేలాయి. ముఖ్యంగా నేటి జనరేషన్‌కి ఈ కథ చాలా దగ్గరగా ఉంటుంది. అంతా తెలుగువారితో.. చాలా న్యాచురల్‌గా సినిమాని తెరకెక్కించడంతో పాటు.. కథ కోసం కొండలు, సముద్రాలు దాటి వెళ్లకుండా.. మనకు తెలిసి కథే అనిపించేలా ఈ సినిమాని ఆయన తెరకెక్కించిన తీరు బాగుంది.

విశ్లేషణ:

చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న ఓ అమ్మాయి, అబ్బాయి.. కాస్త పెద్దయిన తర్వాత వారిద్దరి మధ్య ప్రేమ పుడితే.. ఎలా ఉంటుంది? అనేది తెలుపుతూ దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించిన తీరు అందరినీ మరొక్కసారి స్కూల్ డేస్‌కి తీసుకెళుతుంది. అయితే స్కూల్ డేస్ సన్నివేశాలలో ఆనంద్ అంతగా సెట్ కాలేదు కానీ.. వైష్ణవి మాత్రం కళ్లతోనే సినిమాని నడిపిస్తుంది. అలా ఇద్దరి మధ్య కథ నడుస్తుండగా.. ఒకరు చదువు ఆపేసి.. మరొకరు కాలేజ్ చదువు కోసం వెళ్లడం అంతా చాలా న్యాచురల్ ఉంటుంది.

వాస్తవానికి ఇలాంటి ప్రేమకథలు అందరికీ ఉంటాయి. టెన్త్ క్లాస్ లోపు కచ్చితంగా అందరికీ ఓ ప్రేమ కథ ఉంటుంది. కానీ అది ప్రేమ అని తెలుసుకునే ఏజ్ కాదు. ఆ ఏజ్ వచ్చే సరికి ప్రేమించిన వారు పక్కన ఉండరు. దీనిని పెద్దవాళ్లు ఆకర్షణ అంటారు. అయితే అది ప్రేమే అని చెప్పేందుకు సాయి రాజేష్ ఇంకాస్త లోపలికి వెళ్లి ఈ కథని రాసుకున్నాడు. వైష్ణవి కాలేజ్‌కి వెళ్లిన తర్వాత నుంచి సినిమా గ్రాఫ్ అమాంతం లేస్తుంది. ఆమె ప్రవర్తనతో పాటు, ఆనంద్ తాపత్రయం నేటి యువత ఇలాంటి విషయాలలో పడే సంఘర్షణని తెలియజేసేలా.. చాలా సహజంగా దర్శకుడు ప్రేక్షకుల మైండ్‌లోకి ఎక్కించాడు.

నిజంగా ప్రేమించిన అమ్మాయి తను పక్కన లేకుండా కాలేజ్‌కి వెళుతుంటే.. ఏ లవర్‌కైనా కాస్త కంగారు, ఇంకాస్త అనుమానం ఉంటాయి. అలా ఉంటే అది ప్రేమ కాదని అనలేం. ఎందుకంటే.. ప్రస్తుతం సమాజ తీరు అలా ఉంది మరి. అతను అనుకున్నట్లే.. వైషు మారిపోవడం, విరాజ్‌తో ఆనంద్‌కి తెలియకుండా షికార్లు, పబ్‌లు.. అబ్బో ఒక్కటేమిటి? నేటి యువత తీరుని కళ్లకు కట్టినట్లుగా చూపించాడు. ఆనంద్‌ని రెచ్చగొట్టేలా ఓ పబ్ సీన్ ఉంటుంది.. ఆ సీన్‌లో థియేటర్లు హోరెత్తుతాయి.

ఆ తర్వాత వైషు విషయం తెలిసిన తర్వాత ఆనంద్ ఇచ్చే క్లాస్, చెప్పే డైలాగ్స్ అసలు వినబడనంతగా థియేటర్లో కుర్రాళ్లకు కిక్కిస్తాయి. అయితే ఇంత గొప్పగా సినిమాని తీసుకెళ్లి చివరికి ఎటూ కాకుండా, ఏ పాత్రకి న్యాయం చేయకుండా వదిలేయడం మాత్రం కాస్త డిజప్పాయింట్ చేసింది. ముఖ్యంగా వైష్ణవిని చివరిలో చూపించిన తీరు.. అందరికీ కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది. క్లైమాక్స్‌పై దర్శకుడు ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేదని అనిపిస్తుంది.

ఎక్కడా బోర్ కొట్టదు.. బోర్ కొట్టకుండా నడిచే సినిమాలకు నిడివితో పనిలేదు. మరోవైపు సంగీతం కట్టిపడేస్తుంది. ఇంకేం కావాలి. క్లైమాక్స్‌ కాస్త మార్చి రాసుకుంటే మాత్రం.. నిజంగానే ఈ సినిమా మరో కల్ట్ క్లాసిక్‌లా నిలబడిపోయేది. యూత్‌ని టార్గెట్ చేస్తూ తెరకెక్కిన చిత్రమిది. కాస్త ‘ఆర్ఎక్స్100’ ఛాయలు కూడా కనిపిస్తాయి.

మొత్తంగా అయితే.. టికెట్ కొనుక్కుని థియేటర్‌లోకి వెళ్లిన ప్రేక్షకుడిని అన్ని రకాలుగానూ ఈ సినిమా శాటిస్‌ఫై చేస్తుంది. మరీ ముఖ్యంగా మన పక్కన ఇంటిలోనో, ఎదురింటిలోనో ఇటువంటి సంఘటన జరిగినట్లే అనిపిస్తుంది. కొన్ని డైలాగ్స్ పరంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇబ్బంది కలిగించవచ్చు. అదర్‌వైజ్ అందరికీ కనెక్ట్ అవుతుందీ ‘బేబీ’.

ట్యాగ్‌లైన్: ఈ బేబీ.. గుచ్చుకునే గులాబీ
రేటింగ్: 3/5

Latest News