మనుషులను కుక్కలు పీక్కుతినే అధ్వాన పాలన: రేవంత్ రెడ్డి
జెండాలు పాతిన భూములు గండ్ర పాలు భూ ఆక్రమణల్లో కేటీఆర్‌కు వాటా? విచారణకు మంత్రి సిద్ధమా? భూపాలపల్లి జిల్లాలో టీపీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మనుషులను వీధికుక్కలు పీక్కుతినే స్థాయి అధ్వాన పాలన రాష్ట్రంలో జరుగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఐదేళ్ల చిన్నారిని హైదరాబాద్‌లో కుక్కలు కరిచి చంపేస్తే కుక్కలకు ఆకలేసిందని అక్కడి మేయర్ చెప్పడం సిగ్గుచేటని అన్నారు. ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదని, మున్సిపల్ శాఖ […]

- జెండాలు పాతిన భూములు గండ్ర పాలు
- భూ ఆక్రమణల్లో కేటీఆర్‌కు వాటా?
- విచారణకు మంత్రి సిద్ధమా?
- భూపాలపల్లి జిల్లాలో టీపీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మనుషులను వీధికుక్కలు పీక్కుతినే స్థాయి అధ్వాన పాలన రాష్ట్రంలో జరుగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఐదేళ్ల చిన్నారిని హైదరాబాద్‌లో కుక్కలు కరిచి చంపేస్తే కుక్కలకు ఆకలేసిందని అక్కడి మేయర్ చెప్పడం సిగ్గుచేటని అన్నారు.
ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదని, మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ పూర్తిగా విఫలమయ్యారని రేవంత్ రెడ్డి విమర్శించారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా 13వ రోజు బుధవారం భూపాలపల్లి జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు.
మనిషి చనిపోతే కుటుంబ నియంత్రణ చేస్తారట
కుక్కలు కరిచి మనుషులు చనిపోతే.. కుక్కలకు కుటుంబ నియంత్రణ చేస్తామని మంత్రి చెబుతున్నారని అన్నారు. బాధిత కుటుంబానికి నష్ట పరిహారం ఇవ్వకుండా కేవలం సారీ చెప్పి చేతులు దులుపుకున్న ఘనత ఈ దుర్మార్గపు ప్రభుత్వానికి దక్కిందని రేవంత్ విమర్శించారు. బాధిత కుటుంబంపై కనీస సానుభూతి చూపని రాక్షస ప్రభుత్వం ఇదని దుయ్యబట్టారు. కేటీఆర్ భూపాలపల్లి పర్యటనకు ముందే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా 14వ రోజు భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండలంలోని కోటంచలోని లక్ష్మీ నరసింహా స్వామి ఆలయంలో స్వామి వారిని రేవంత్ రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణతో కలిసి దేవున్ని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు.
జెండాలు పాతిన భూములు గండ్రపాలు
నక్సలైట్లు ఎర్రజెండాలు పాతి పేదలకు పంచి పెట్టిన భూములను మళ్లీ గండ్ర రమణారెడ్డి ఆక్రమించు కుంటున్నాడని రేవంత్ ఆరోపించారు. దోపిడీకి ధరణి పోర్టల్‌ను అడ్డం పెట్టుకుని వందల ఎకరాలను ఆక్రమించుకుంటున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాలకుర్తికి ఎర్రబెల్లి దయాకర్‌రావు, భూపాలపల్లికి రమణారెడ్డిని, వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌ను, వరంగల్ తూర్పుకు నన్నపునేని నరేందర్‌లను సామంత రాజులుగా నియమించుకుని మంత్రి కేటీఆర్ దోపిడీకి పాల్పడుతున్నాడని ధ్వజమెత్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ నేతలు గుండాలుగా మారిపోయారని అన్నారు. ప్రజల ఆస్తులకు, భూములకు రక్షణ లేకుండాపోయిందని అన్నారు.
విచారణకు కేటీఆర్ సిద్ధమా?
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర గండ్ర వెంకట రమణారెడ్డి భూముల ఆక్రమణలపై విచారణకు డ్రామారావు సిద్ధమా? అంటూ మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి సవాల్ విసిరారు. ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి చేస్తున్న దందాలు, అక్రమాలు, భూ ఆక్రమణల్లో కేటీఆర్‌కు వాటాలు లేకుంటే.. విచారణకు అదేశించాలని అన్నారు.
LIVE: YATRA FOR CHANGE || DAY= 14 || REVANTH REDDY https://t.co/0BRbRTmVax
— Revanth Reddy (@revanth_anumula) February 22, 2023
అక్రమాల్లో కేటీఆర్‌కు వాటా
గండ్ర రమణారెడ్డి చేస్తున్న దందాల్లో, అక్రమాల్లో కేటీఆర్‌కు భాగస్వామ్యం ఉందని నిరూపించడానికి మా నాయకులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాను బీఆర్ఎస్ గుండాలు ఆక్రమించు కున్నారన్నారు. పార్టీ ఫిరాయించిన డర్టీ డజన్ ఎమ్మెల్యేలను వదిలిపెట్టేది లేదని, సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
కాంట్రాక్టుల కోసం పార్టీ మారి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి దివాలకోరు రాజకీయాలు చేస్తున్నాడని అన్నారు. అనంతరం చిట్యాల మండలం చల్లగరిగేకు వాహనంలో చేరుకున్న రేవంత్ రెడ్డి సమక్షంలో గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్‌కు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఇదే మండలంలోని తిరుమలాపూర్ నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించారు.