Bandi Sanjay | మేడిగడ్డపై కాంగ్రెస్-బీఆరెస్‌ల ఉమ్మడి డ్రామా
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై కాంగ్రెస్-బీఆరెస్‌లు కలిసి డ్రామా చేస్తూ బీజేపీని బద్నాం చేయాలని చూస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు

- చేరికలను అడ్డుకునేందుకు మాతో పొత్తు అని కేసీఆర్ దుష్ప్రచారం
- ఎంపీ బండి సంజయ్ విమర్శలు
విధాత, హైదరాబాద్ : మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై కాంగ్రెస్-బీఆరెస్‌లు కలిసి డ్రామా చేస్తూ బీజేపీని బద్నాం చేయాలని చూస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ మేడిగడ్డ ప్రాజెక్టుపై కేంద్ర డ్యాం సేఫ్టీ అథార్టీ నివేదిక ఇచ్చాకా, విజిలెన్స్, జ్యూడిషియల్ విచారణలకు ఆదేశించాకా ఎమ్మెల్యేలను తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు.
మీ ఇష్టానికి మేడిగడ్డకు వెళ్లి బీజేపీ ఎమ్మెల్యేలు రాలేదంటూ బీఆరెస్‌తో కుమ్మక్కు అంటూ బద్నామ్ చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. మేడిగడ్డ దుస్థితికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తమ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. కాళేశ్వరంలో అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపాలన్నారు. గతంలో సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన కాంగ్రెస్ ఇప్పుడెందుకు వెనక్కి వెళ్లిందని ప్రశ్నించారు.
ఎన్నికలు రాగానే.. బీఆరెస్, బీజేపీ ఒకటే అని ప్రతిసారి కాంగ్రెస్, బీఆరెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆరెస్ మునిగిపోయే నావ కాదని, అల్‌రెడీ మునిగిన నావ అని సంజయ్ అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆరెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. బీఆరెస్ నేతలు కొందరు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీలో చేరేందుకు సిద్ధమైన వారిని అడ్డుకునేందుకు కేసీఆర్ నానా తంటాలు పడుతున్నారని అని కూడా ఫలించక కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ క్రమంలోనే రాజకీయంగా లబ్ది పొందేందుకు బీఆరెస్-బీజేపీలు ఒక్కటని, భవిష్యత్తులో పొత్తు పెట్టుకుంటాయని కేసీఆర్ లీకులు ఇప్పిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. రాజకీయ ఎత్తుగడలు తెలిసిన వారు ఎవరూ బీఆరెస్ పొత్తు పెట్టుకోరని ఎద్దేవా చేశారు.