Bandi Sanjay
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రధాని రేపటి బహిరంగ సభలో కొందరు బీఆర్ఎస్ నేతలు పెయిడ్ ఆర్టిస్టులను ప్రత్యేకంగా పెట్టి జై జై అంటూ నినాదాలు చేయించుకుంటూ ప్రచారం చేసుకునే అవకాశం ఉందని అలాంటి వారితో అప్రమత్తంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కార్యకర్తలకు సూచించారు.
బీజేపీ హన్మకొండ జిల్లా ముఖ్య నాయకులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు రావు పద్మ, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, జిల్లా ఇంఛార్జ్ మురళీధర్ గౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో బండి సంజయ్ ఏమన్నారంటే
బీఆర్ఎస్ వాళ్లు ఓ వెయ్యి మంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి జై జై అన్పించేలా ప్లాన్ చేస్తున్నారు. అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. రేపు ఎలాంటి స్లోగన్స్ లేకుండా మోదీ సభ సక్సెస్ చేసేలా చూడాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు.
తెలంగాణలో బీజేపీ యాడ ఉందని మొరిగే వాళ్లకు మోదీ సభ సక్సెస్ తోనే సమాధానం చెప్పాలి. దీంతోపాటు బీఆర్ఎస్ తో బీజేపీ కుమ్మక్కైందనే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. హనుమకొండ వేదికగా జరగబోయే ప్రధాని మోదీ బహిరంగ సభకు కనివినీ ఎరగని రీతిలో ప్రజలను సమీకరించాలి. నిర్ణీత సమయానికంటే ముందే వచ్చి సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు.