చదువుల తల్లికి అండగా ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి

ఉన్నత చదువులకు ఆటంకంగా నిలిచిన ఆర్థిక పరిస్థితితో దిక్కుతోచని స్థితిలో ఉన్న గిరిజన నిరుపేద విద్యార్థినికి మజీ మంత్రి, శాసన సభ్యులు జగదీశ్ రెడ్డి అండ‌గా నిలిచారు

  • By: Somu    latest    Dec 11, 2023 11:58 AM IST
చదువుల తల్లికి అండగా ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
  • గిరిజన పుత్రిక పట్ల ఔదార్యం
  • ఆర్థిక సహాయం అందజేసి అక్కున చేర్చుకున్న మాజీ మంత్రి


విధాత, సూర్యాపేట: ఉన్నత చదువులకు ఆటంకంగా నిలిచిన ఆర్థిక పరిస్థితితో దిక్కుతోచని స్థితిలో ఉన్న గిరిజన నిరుపేద విద్యార్థినికి మజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అండ‌గా నిలిచారు. ఆమె విద్యాభ్యాసం పూర్తి అయ్యే వరకు అండగా ఉంటానని భ‌రోసానిచ్చారు. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం లాల్ సింగ్ తండాకు చెందిన బానోతు ఐశ్వర్య చిన్ననాటి నుంచి చదువులో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తూ వస్తుంది.


ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో బీఎస్పీ నర్సింగ్ సీటు సాధించింది. వ్య‌వ‌సాయ కూలీ కుటుంబం కావడంతో ఇతర ఖర్చులు కూడా భరించలేని స్థితిలో ఉంది. స్థానిక నాయకుల ద్వారా వారి ప‌రిస్థితి జగదీశ్ రెడ్డి దృష్టికి వ‌చ్చింది. వెంటనే స్పందించి ఐశ్వర్యతో పాటు ఆమె తల్లిని సూర్యాపేటకు పిలిపించారు. ఐశ్వర్య విద్య పూర్త‌య్యే వ‌ర‌కు అండ‌గా ఉంటాన‌ని హామీ ఇచ్చారు.


తోటి విద్యార్థుల‌కు ఐశ్వర్య స్ఫూర్తి


అత్యంత నిరుపేద పరిస్థితుల్లో అనేక సవాళ్లు దాటుకొని చదువులో రాణిస్తున్న ఐశ్వర్య తోటి విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుందని సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. ప్రజ్ఞాపాటవాలు ఎవరి సొత్తూ కాదని, కృషితో ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చనే విషయాన్ని ఐశ్వర్య నిరూపించిందని అన్నారు.


ఐశర్వ్య లాంటి ఒక అద్భుతమైన టాలెంట్ ఉన్న ఆడబిడ్డకి అండగా నిలవడం తనకు అత్యంత సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తున్నదని అన్నారు. వైద్య రంగంలో భవిష్యత్ లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కాగా త‌న నర్సింగ్ విద్య‌కు సాయ‌మందించిన జగదీశ్ రెడ్డి కి ఐశ్వర్య, ఆమె కుటుంబ సభ్యులు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు.