రామాల‌యానికి చేరిన‌ అతిపెద్ద ఘంట‌

అయోధ్య‌లోని రామాల‌యానికి దేశంలోని అతిపెద్ద గుడిఘంట చేరింది

  • Publish Date - January 11, 2024 / 09:02 AM IST
  • ఎనిమిది లోహాల‌తో త‌యారైన‌ 2,400 కిలోల బెల్
  • 6 అడుగుల ఎత్తు, 5 అడుగుల వెడల్పుతో ఘంట‌
  • రెండు కిలోమీట‌ర్ల వ‌ర‌కు వినిపించ‌నున్న ధ్వని
  • ధ‌ర రూ.25 లక్షలు.. వికాస్ మిట్టల్ విత‌ర‌ణ

విధాత‌: అయోధ్య‌లోని రామాల‌యానికి దేశంలోని అతిపెద్ద గుడిఘంట చేరింది. దీని బ‌రువే 2,400 కిలోలు ఉంటుంది. ఆరు అడుగుల ఎత్తు, ఐదు అడుగుల వెడల్పుతో ఆక‌ర్ష‌ణీయంగా ఎనిమిది లోహాల‌తో త‌యారుచేశారు. ఘంట శ‌బ్ధం రెండు కిలోమీట‌ర్ల దూరం వ‌ర‌కు వినిపిస్తుంది. దీని ధ‌ర రూ.25 ల‌క్ష‌లు. వ్యాపారి వికాస్‌ మిట్టల్ దీనిని ప్ర‌త్యేకంగా త‌యారుచేయించి రామాల‌యానికి విత‌ర‌ణ‌గా ఇచ్చారు. ఇటాహ్ జిల్లాలో త‌యారైన ఘంట.. రైలు ద్వారా మంగళవారం అయోధ్యకు చేరుకున్న‌ది.


దాదాపు 30 మంది నైపుణ్యం కలిగిన కార్మికులతో కూడిన విభిన్న బృందాలు గుడిఘంట త‌యారీలో పాలుపంచుకున్నాయి. బంగారం, వెండి, రాగి, జింక్, సీసం, టిన్, ఇనుము, పాదరసం వంటి ఎనిమిది లోహాలు ఘంట‌ను రూపొందించారు. దేశంలోని అతిపెద్ద ఘంటల్లో ఇది ఒకటి.


జలేసర్ నగర్ పంచాయతీ మాజీ ఛైర్మన్ వికాస్ మిట్టల్ 2022లో గుండెపోటుతో మరణించే ముందు ఈ గంటను రామాల‌యానికి విరాళంగా ఇవ్వాలని కోరుకున్నారు. ఆయ‌న సోద‌రులు లోహపు వ్యాపారులు ఆదిత్య మిట్టల్, ప్రశాంత్ మిట్టల్‌తో కలిసి వికాస్ కోరికను గౌరవించాలని ఆలయానికి గంటను విరాళంగా ఇచ్చారు.


” రామాలయానికి ఘంట‌ను విరాళంగా ఇచ్చే అవ‌కాశం రావడం దైవిక కారణం ఉందని మేము నమ్ముతున్నాము. కాబట్టి, మేము దానిని ఆలయానికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాము” అని మిస్టర్ ఆదిత్య చెప్పారు. ఇటాహ్ జిల్లాలో ఆలయ గంటలను సృష్టించే క‌ళాకారుల‌తో దానిని త‌యారుచేయించిన‌ట్టు తెలిపారు.