Lok Sabha | పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే రూ.కోటి జరిమానా..

ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. దేశవ్యాప్తంగా ఇబ్బందికరంగా మారిన పోటీ పరీక్షల లీకేజీని అడ్డుకునేందుకు చట్టం తీసుకురాబోతున్నది

Lok Sabha | పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే రూ.కోటి జరిమానా..
  • పదేళ్ల జైలు..! నేడు పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం..!

Lok Sabha | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. దేశవ్యాప్తంగా ఇబ్బందికరంగా మారిన పోటీ పరీక్షల లీకేజీని అడ్డుకునేందుకు చట్టం తీసుకురాబోతున్నది. కాపీయింగ్‌ను ప్రోత్సహించే మాఫియా, విద్యా సంస్థలు, నిందితులపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. లీకేజీలకు పాల్పడినట్టు రుజువైతే చట్టం మేరకు పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.కోటి వరకు జరిమానా విధించనున్నారు. చట్టం కాపీయింగ్‌ మాఫియాను కట్టడి చేసేందుకు దోహదపడుతుందని భావిస్తున్నారు.


పబ్లిక్ ఎగ్జామినేషన్ అన్‌ఫెయిర్ మీన్స్ ప్రివెన్షన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. బిల్లు మేరకు పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారికి గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు విధిస్తారు. దాంతో పాటు రూ.కోటి వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. పరీక్షల పేరుతో అక్రమాలకు పాల్పడే మాఫియాతో పాటు వారితో కుమ్మక్కయ్యే సిబ్బంది, సంస్థలే లక్ష్యంగా చేసుకొని చట్టం తీసుకురాబోతున్నట్లుగా అధికార వర్గాలు పేర్కొన్నాయి. అయితే, చట్టంపై అధ్యయనం చేసిన అత్యున్నత స్థాయి సాంకేతిక కమిటీ కంప్యూటర్‌ ఆధారిత పరీక్షా విధానమని సురక్షితమని సిఫారసు చేసింది.


జేఈఈతో పాటు కేంద్ర యూనివర్సిటీలతో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షలలో అక్రమాల నిరోధానికి బిల్లును కేంద్రం తీసుకురాబోతున్నది. పేపర్ లీక్ చేసినా, వేరొకరి స్థానంలో పరీక్ష రాసినా, ఎవరికైనా సహాయం చేసేలా చర్యలు తీసుకోనున్నారు. కంప్యూటర్ ఆధారిత కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించే సమయంలో అవకతవకలు జరిగినట్లు రుజువైతే రూ.కోటి వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. అక్రమాలకు పాల్పడ్డట్లు రుజువైతే దోషులుగా తేలిన సర్వీస్‌ ప్రొవైడర్లు, సంస్థలే ఖర్చులు భరించాల్సి ఉంటుంది. అగ్రశ్రేణి పోటీ పరీక్షలకు జాతీయ ప్రమాణాలను కూడా సిద్ధం చేయనున్నట్లు సమాచారం. ఇంకా బిల్లుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.