ప్రొటెం స్పీకర్ ఎంపికపై గవర్నర్‌కు బీజేపీ ఫిర్యాదు
అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధిన్‌ను ఎంపిక చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గవర్నర్ తమిళిసైకి బీజేపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు

విధాత: అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధిన్‌ను ఎంపిక చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గవర్నర్ తమిళిసైకి బీజేపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. సీనియర్ ఎమ్మెల్యేలను ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేయాల్సివున్న సాంప్రదాయాలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కి, స్వీయ రాజకీయాల కోసం ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్ధిన్‌ను ఎంపిక చేశారంటూ వారు ఫిర్యాదు చేశారు.
ప్రొటెం స్పీకర్ ఎంపికలో శాసన సభ సాంప్రదాయాల ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని కోరారు. గవర్నర్‌ను కలిసిన వారిలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సహా బీజేపీకి చెందిన 8మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంతకుముందు వారు ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్ధిన్‌ను ఎంపిక చేయడం పట్ల తమ నిరసన వ్యక్తం చేస్తూ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి శాసన సభ్యులుగా ప్రమాణానికి దూరంగా ఉన్నారు.
ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్ధిన్‌ను ఎంపిక చేయడం పట్ల కిషన్‌రెడ్డి స్పందిస్తూ తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం ఎంఐఎంతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని ప్రభుత్వం సాంప్రదాయ ఉల్లంఘనలకు పాల్పడిందని అక్బరుద్ధిన్‌ను ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేశారంటూ విమర్శించారు.