శివ‌సేన‌ నాయ‌కుడిపై బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు

శివ‌సేన‌(సీఎం ఏక్‌నాథ్ షిండే వ‌ర్గం) పార్టీకి చెందిన నాయ‌కుడిపై బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని ఉల్హాస్‌న‌గ‌ర్‌లో శుక్ర‌వారం చోటు

శివ‌సేన‌ నాయ‌కుడిపై బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు

ముంబై : శివ‌సేన‌(సీఎం ఏక్‌నాథ్ షిండే వ‌ర్గం) పార్టీకి చెందిన నాయ‌కుడిపై బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని ఉల్హాస్‌న‌గ‌ర్‌లో శుక్ర‌వారం చోటు చేసుకోగా, ఆల‌స్యంగా వెలుగు చూసింది. థానే జిల్లా క‌ల్యాణ్ శివ‌సేన చీఫ్ మ‌హేశ్ గైక్వాడ్‌కు, క‌ల్యాణ్ ఈస్ట్ బీజేపీ ఎమ్మెల్యే గ‌ణ‌ప‌తి గైక్వాడ్‌కు మ‌ధ్య గ‌త కొద్ది రోజుల నుంచి భూవివాదం కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో గ‌ణ‌ప‌తి గైక్వాడ్ కుమారుడు వైభ‌వ్ గైక్వాడ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసేందుకు శుక్ర‌వారం పోలీసు స్టేష‌న్‌కు వెళ్లారు. కుమారుడు వెళ్లిన కాసేప‌టికే గ‌ణ‌ప‌తి గైక్వాడ్ కూడా పీఎస్‌కు వెళ్లారు. మ‌హేశ్ గైక్వాడ్ కూడా త‌న అనుచ‌రుల‌తో పీఎస్ చేరుకున్నారు.

ఇక పీఎస్‌లోని ఓ గ‌దిలో ఇరువురు నేత‌లు కూర్చుని భూ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు చ‌ర్య‌లు ప్రారంభించారు. అయితే ఇరువురికి సంబంధించిన మ‌ద్ద‌తుదారులు పీఎస్ ఎదుట ఆందోళ‌న‌కు దిగారు. వారిని నిలువ‌రించేందుకు పోలీసులు బ‌య‌ట‌కు వెళ్లగా, ఒక్క‌సారి గ‌ణ‌ప‌తి గైక్వాడ్.. మ‌హేశ్‌తో పాటు అత‌ని అనుచ‌రుడు రాహుల్‌పై తుపాకీతో కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల్లో మహేష్‌ గైక్వాడ్‌, రాహుల్‌ తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరుపుతున్న సమయంలో గణపతి గైక్వాడ్‌ చేతికి తీవ్రంగా గాయం అయ్యింది. దీంతో మహేష్‌ గైక్వాడ్‌, రాహుల్‌ను థానేలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మహేష్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

బీజేపీ ఎమ్మెల్యే గణపతి గైక్వాడ్‌ తో పాటు మరో ఇద్దరిని పోలీసు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం కోర్టు ఎదుట హాజరు ప‌రిచి రిమాండ్‌కు త‌ర‌లించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో థాక‌రే వర్గం దుమ్మెత్తిపోస్తుంది. ఈ ఘ‌ట‌న‌కు బాధ్య‌త వ‌హిస్తూ ఏక్‌నాథ్ షిండే సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తోంది. చ‌ర్చ‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో త‌న కుమారుడి మీద దాడి చేసేందుకు మహేశ్ వ‌ర్గం య‌త్నించ‌డంతో, ఆత్మ‌ర‌క్ష‌ణ కోస‌మే కాల్పులు జ‌రిపిన‌ట్లు గ‌ణ‌ప‌తి గైక్వాడ్ పేర్కొన్నారు. ఈ విష‌యం గురించి బాధ‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న తెలిపారు.