మిత్రపక్షాన్ని చీల్చి.. హర్యానాలో బీజేపీ సొంత ప్రభుత్వం!

లోక్‌సభ ఎన్నికల వేళ హర్యానా బీజేపీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్షాలనే కాదు.. మిత్రపక్షాలను సైతం ముంచేయగలనని మరోమారు బీజేపీ రుజువు చేసుకున్నది

  • Publish Date - March 12, 2024 / 12:48 PM IST

  • జేజేపీలోని నలుగురు ఎమ్మెల్యేల మద్దతు
  • కొత్త ముఖ్యమంత్రి సైని ప్రమాణ కార్యక్రమానికి హాజరు
  • జేజేపీ చీలికపై బలపడుతున్న అనుమానాలు

చండీగఢ్‌: లోక్‌సభ ఎన్నికల వేళ హర్యానా బీజేపీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్షాలనే కాదు.. మిత్రపక్షాలను సైతం ముంచేయగలనని మరోమారు బీజేపీ రుజువు చేసుకున్నది. ఇన్నాళ్లూ హర్యానాలోని తమ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జననాయక్‌ జనతా పార్టీ (జేజేపీ)తో తెగతెంపులు చేసుకున్న బీజేపీ.. సొంతగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నది. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, జేజేపీతో సీట్ల సర్దుబాటులో ఇబ్బందుల నేపథ్యంలో ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ప్రభుత్వం రాజీనామా చేసింది. కొత్త ముఖ్యమంత్రిగా ఆరెస్సెస్‌ మూలాలున్న నాయబ్‌సింగ్‌ సైనిని బీజేపీ అధిష్ఠానం ఎంపిక చేసింది. రాజ్‌భవన్‌లో సాయంత్రం ఐదు గంటలకు జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఆయనతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ఖట్టర్‌ రాజీనామా చేసిన కొద్దిసేపటికే నాయబ్‌సింగ్‌ సైనిని ఖట్టర్‌, హర్యానా బీజేపీ ఇన్‌చార్జ్‌ బిప్లవ్‌దేవ్‌ సమక్షంలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పాత మంత్రివర్గంలో ఖట్టర్‌ సహా 14 మంది బీజేపీ నుంచి ఉండగా, ఉప ముఖ్యమంత్రి దుష్యంత్‌ చౌతాలా నేతృత్వంలోని జేజేపీ నుంచి ముగ్గురు మంత్రులుగా ఉన్నారు. వారంతా రాజీనామాలు సమర్పించారు.

పొత్తు చెడి..

2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి మొత్తం పది లోక్‌సభ స్థానాలను బీజేపీ గెలుచుకున్నది. ఈసారి కూడా అన్ని సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించింది. అయితే.. ఈ వైఖరి మిత్రపక్షం జేజేపీని ఇబ్బందికి గురి చేసింది. తాము రెండు సీట్లలో పోటీ చేస్తామని చెప్పినా.. అన్నింటిలోనూ బీజేపీయే పోటీ చేస్తుందని ఆ పార్టీ నేతలు తెగేసి చెప్పడంతో హర్యానా రాజకీయాలు మలుపు తిరిగాయి.

జేజేపీని చీల్చారా?

90 మంది సభ్యులు ఉన్న హర్యానా అసెంబ్లీలో బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జేజేపీకి పది మంది ఉన్నారు. ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉండగా వారిలో ఆరుగురు ప్రభుత్వానికి మద్దతు పలికారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌, హర్యానా లోక్‌హిత్‌ పార్టీకి చెరొక సభ్యడు ఉన్నారు. మెజార్టీ మార్కు 46 సీట్లు. అయితే.. 41 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీకి ఇంకా నలుగురు సభ్యుల మద్దతు అవసరం. ఇప్పటికే ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు కూటమికి మద్దతుగా ఉన్నారు. వీరిలో ఐదుగురు ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే.. ఏ ఇబ్బందీ లేకుండా నలుగురు జేజేపీ సభ్యులను బీజేపీ తన వైపు తిప్పుకొన్నదన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నలుగురు ఎమ్మెల్యేలు కొత్త ముఖ్యమంత్రి పదవీ ప్రమాణ కార్యక్రమం సందర్భంగా రాజ్‌భవన్‌లో కనిపించడం ఈ అనుమానాలకు బలం చేకూర్చింది.

ఎవరీ నాయబ్‌ సింగ్‌?

హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన నాయబ్‌సింగ్‌ సైని (54) కురుక్షేత్ర లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. ఓబీసీ క్యాటగిరీకి చెందిన సైని.. గత ఏడాది అక్టోబర్‌లో బీజేపీ హర్యానా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆరెస్సెస్‌లో పనిచేస్తూ.. బీజేపీతో 1996లో రాజకీయ కెరీర్‌ను ప్రారంభించిన నాయబ్‌సింగ్‌ సైని.. హర్యానా బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగారు. 2002లో అంబాలా జిల్లా బీజేపీ యూత్‌ వింగ్‌ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2005లో జిల్లా అధ్యక్షుడు అయ్యారు. నారాయణ్‌గఢ్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా 2014లో గెలుపొందారు. 2016లో హర్యానా మంత్రిమండలిలో చోటు దక్కించుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కురుక్షేత్ర స్థానం నుంచి తన సమీప కాంగ్రెస్‌ ప్రత్యర్థిపై 3.83 లక్షల భారీ మెజార్టీతో విజయం సాధించారు. మనోహర్‌లాల్‌ ఖట్టర్‌కు అత్యంత నమ్మకస్తుడిగా భావించే సైని.. 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికైన దగ్గర నుంచి హర్యానా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నారు. యువకుడిగా ఉన్నప్పుడు ఆరెస్సెస్‌లో పనిచేశారు.

ప్రజలు మార్పుకోరుకున్నందునే..

ఖట్టర్‌ రాజీనామాపై కాంగ్రెస్‌ ఎంపీ దీపేందర్‌ హుడా మాట్లాడుతూ.. ప్రజలు మార్పు తేవాలని నిర్ణయించుకున్నందునే హర్యానాలో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు.

Latest News