BJP
విధాత: బీజేపీ పేరుకే జాతీయ పార్టీ. కానీ ఆ పార్టీ విధానాలు రాష్ట్రానికో విధంగా ఉంటాయి. ముఖ్యంగా దేశ ప్రజలు ఆ పార్టీకి వరుసగా రెండుసార్లు సంపూర్ణ మెజారిటీ కట్టబెట్టినా.. ఆ పార్టీ అగ్రనాయకులు తమ సంకుచిత మనస్తతత్వాన్ని వీడటం లేదు. తొమ్మిదేళ్లు బీజేపీ(BJP) హయాంలో సాధించిన ప్రగతి చెప్పకుండా ఇప్పటికీ మతం పేరుతో.. కులాల పేరుతోనే రాజకీయాలు చేస్తున్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంఐఎం పేరు లేకుండా బీజేపీ ఏ నేత కూడా ప్రచారం చేయలేడు అంటే అతిశయోక్తి కాదు. మతం పేరు చెప్పకుంటే తమకు రాజకీయ మనుగడ ఉండదు అన్నట్టు బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారు.
చేవెళ్లలో ఆదివారం జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో కేంద్ర హోంమంత్రి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడితే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడటమే ఆక్షేపణీయం. ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని, వీటిని రద్దు చేసి ఆ ఫలాల్ని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు అందిస్తామన్నారు. ఇక్కడ అధికారంలోకి రావడానికి మతం పేరుతో రాజకీయాలు చేయడం మినహా బీజేపీ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు.
అంతెందుకు కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్కడ కూడా ముస్లిం రిజర్వేషన్ల రద్దు చేసిన బీజేపీ సర్కార్ అక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఎందుకు సర్దుబాటు చేయలేదు? అక్కడ రాజకీయ ప్రాబల్యవర్గాలైన వొక్కలిగ, లింగాయత్‌ల రిజర్వేషన్లు ఎందుకు పెంచిందో సమాధానం చెప్పాలి. ఇలా రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రానికో ఒక విధానాన్నిఅమలుచేస్తూ.. దేశం కోసం ధర్మం కోసం అనడం బీజేపీ నేతలకే చెల్లింది.
అలాగే తెలంగాణ ప్రభుత్వం ఎస్టీ రిజర్వేషన్లు 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుకుంటామని దానికి అనుమతించాలని కేంద్రానికి అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని పంపింది. దీనిపై ఇప్పటికీ ఏ నిర్ణయం తీసుకోలేదు. అలాగే విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు గిరిజన యూనివర్సిటీని ఎందుకు ఇప్పటివరకు ఏర్పాటు చేయలేకపోయిందో అమిత్ షా జవాబు చెప్పాలని ఇక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
అంతేకాదు కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించాలని విపక్ష పార్టీలు చాలాకాలంగా కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయినా దీనిపై కేంద్రం స్పందించడం లేదు. అందుకే బీజేపీ(BJP) రిజర్వేషన్లపై రాష్ట్రానికో విధంగా వ్యవహరిస్తున్నదనే విమర్శలు ఉన్నాయి.
కేసీఆర్ ఎన్నికల గుర్తు కారు స్టీరింగ్.. ఓవైసీ వద్ద ఉన్నదని అందుకే సక్రమంగా నడవటం లేదన్నారు. కమలానికి ఓటు వేస్తే కమలంపై కూర్చున్న మహాలక్ష్మి వైభవం తెలంగాణకు వస్తుందని అమిత్ షా అన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గమనిస్తే అక్కడ కొన్నినియోజకవర్గాల్లో ఎంఐఎం పార్టీ ఎస్పీ ఓట్లకు ఎలా గండి కొట్టిందో? బీజేపీ(BJP) గెలుపునకు ఎలా దోహదపడిందో తెలుస్తుంది.
తెలంగాణలో రాజకీయాలు చేయడానికే ఓవైసీల పేరు చెప్పుకోవడం కానీ ఆ పార్టీ ఇతర రాష్ట్రాల్లో బీజేపీకి బీ టీం అనే విపక్షాల విమర్శలు వాస్తవాలు కావా? గంగా జమునా తెహజీబ్ లాంటి సంస్కృతి ఉన్న హైదరాబాద్ మినీ ఇండియా. ఇక్కడ అన్నిమతాల, అన్ని కులాల, అన్ని రాష్ట్రాల ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నారు.
ఇక్కడ మత ఘర్షణలకు, మత విద్వేషాలకు తావు లేదు. అందుకే మీరు ప్రజలు ఆశీర్వదిస్తే అధికారంలోకి రావొచ్చు. కానీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి తెచ్చే వైభవాన్ని ఏ ప్రజలు కోరుకోవడం లేదన్న విషయాన్ని అమిత్ షా గుర్తిస్తే మంచిది అంటున్నారు.