విధాత: రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మోదీ బీజేపీకి అగ్నిపరీక్షగా నిలువనున్నాయి. ఆ ఎన్నికల తదుపరి వచ్చే లోక్‌సభ ఎన్నికల ఫలితాలను ఇవి ప్రభావితం చేయనున్నాయి. ఇక్కడ దెబ్బతింటే ప్రజానాడి ఎలా ఉన్నదనేది యావత్ దేశానికి తెలిసిపోతుంది. అదే జరిగితే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బొక్కబోర్లా పడటం ఖాయమనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఐదు రాష్ట్రాలపై బీజేపీ దృష్టి సారించిందని చెబుతున్నారు.
బరిలో కేంద్రమంత్రులు, ఎంపీలు
మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎదురవుతున్న గట్టి పోటీని ఎదుర్కోవడానికి అధికార బీజేపీ పెద్ద ఎత్తున కేంద్రమంత్రులు, ఎంపీలను బరిలో దింపుతున్నదని అర్థమవుతున్నది. సోమవారం విడు దల చేసిన రెండో జాబితాను పరిశీలిస్తే.. కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, ఫగ్గన్ సింగ్ కులస్తేలతో పాటు రాకేశ్ సింగ్, గణేశ్ సింగ్, రితిపాఠక్, ఉదయ్ ప్రతాప్ సింగ్‌లను అసెంబ్లీ బరిలో దింపింది.
ఈ రెండు జాబితాల్లోనూ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ పేరు లేకపోవడం గమనార్హం. దీనిపై రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమౌతున్నది. ఆయన పోటీకి దూరంగా ఉంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మధ్య ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు ఒక గిరిజన వ్యక్తిపై మూత్రం పోసిన ఉదంతంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. దళిత, గిరిజనుల పట్ల బీజేపీ భావజాలం ఏమిటో ఈ సంఘటనతో తేటతెల్లమైందని విపక్ష పార్టీల నేతలు విమర్శించారు.
నష్టనివారణ కోసం సీఎం శివరాజ్ సింగ్ ఆ బాధితుడిని ఇంటికి పిలిపించుకుని కాళ్లు కడిగారని ప్రచారం చేసుకున్నారు. అయితే అసలు బాధితుడు ఆయన కాదని తేలడంతో బీజేపీ అబద్ధాలు మరోసారి బహిర్గతమయ్యాయి. శివరాజ్ నేతృత్వంలో గత ఎన్నికల్లోనే ఓడిపోవడం ఈసారి ఆయనను ముందు పెడితే గెలుపు కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని పార్టీ పెద్దల ఆలోచనని, అందుకే ఆయనను ఈసారి పోటీ నుంచి దూరం పెట్టారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కర్ణాటకలో యడ్యూరప్ప వలె ఆయన కూడా ప్రచారానికే పరిమితమైనా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదంటున్నారు. ఆ మూడూ టార్గెట్ సార్వత్రిక ఎన్నిలకు ముందు అగ్నిపరీక్ష లాంటి ఐదు రాష్ట్రాల్లో ముఖ్యంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో గెలుచుకుంటేనే కేంద్రంలో తిరిగి అధికారంలోకి వస్తామన్న ఆశలు కలుగుతాయని అనుకుంటున్నది.
ఇండియా కూటమి రోజురోజుకూ బలపడుతుండటం కమలనాథులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. వచ్చే ఎన్నికలకు ముందే ఈ ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే ఇండియా కూటమికి అడ్డుకట్ట వేయగలమని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అందుకే ముందు రాష్ట్రాలు, తర్వాత లోక్‌సభ ఎన్నికలు అన్నట్టు ఆ పార్టీ అగ్రనాయకత్వం యోచిస్తున్నదని చెబుతున్నారు.
ఎంపీలో గెలుపే ముఖ్యం
ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో తెలంగాణలో బీఆరెస్ అధికారంలో ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్, బీఆరెస్ మధ్యే పోరు నెలకొని ఉన్నది. ఇక్కడ సీట్లు గెలుస్తామన్న ఆశ ఎలానూ బీజేపీకి పెద్దగా లేదు. మరోవైపు ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కే విజయావకాశాలు ఉన్నాయని సర్వేలు పేర్కొంటున్నాయి. మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్నా.. అక్కడ ప్రజా వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మిజోరంలో స్థానిక మిజో నేషనల్ ఫ్రంట్‌తో కలిసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
నిజానికి మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. 230 స్థానాలున్న ఆ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 114 సీట్లు రాగా, బీజేపీ 109 స్థానాలకే పరిమితమైంది. అప్పట్లో కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియాను తమ పార్టీలో చేర్చుకుని, అధికార పార్టీలో చీలిక సృష్టించిన బీజేపీ.. ఆ రాష్ట్రాన్ని దొడ్డిదోవన తన ఖాతాలో వేసుకున్నది. అయితే 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 29 స్థానాలకు గాను ఏకంగా 27 స్థానాలను కైవసం చేసుకున్నది.
రాజ్యసభలో వీక్
లోక్‌సభ స్థానాలు పెంచుకున్నప్పటికీ.. రాజ్యసభలో మాత్రం ఆ పార్టీకి తగినంత సంఖ్యాబలం మొదటి నుంచీ లేకపోయింది. దీంతో కీలక బిల్లులు లోక్‌సభలో తేలిగ్గా ఆమోదం పొందినా, రాజ్యసభలో మాత్రం ఎన్డీఏలో లేని ఇతర ప్రాంతీయపార్టీల మద్దతుపై ఆధారపడేది. ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ బిల్లు, మూడు వ్యవసాయ బిల్లుల ఆమోదానికి నానా ఇబ్బంది పడ్డారు.
అందుకే విపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడం ద్వారా రాజ్యసభలో సంఖ్యను పెంచుకునే ప్రయత్నం చేశారని, ఈ క్రమంలోనే బీజేపీ యేతర 9 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిందనే ఆరోపణలున్నాయి. 2013లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గోవా వంటి రాష్ట్రాలకే పరిమితమైన బీజేపీ.. 2018 నాటికి 20 రాష్ట్రాలకు విస్తరించింది.
ఇందులో సొంతంగా గెలిచిన యూపీ, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అస్సాం, త్రిపురను పక్కనపెడితే.. మహారాష్ట్ర, ఏపీ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో భాగస్వామ్య పార్టీలతో కలిపి అధికారాన్ని పంచుకున్నది. ఇంతచేసినా లోక్‌సభలో ఆమోదం పొందిన బిల్లులు, రాజ్యసభలోకి వచ్చేసరికి ప్రాంతీయపార్టీల మద్దతు లేకపోతే పాస్ అయ్యే పరిస్థితే లేకుండే.
అందుకే 2014 అధికారంలోకి వచ్చిన నాటి నుంచే బీజేపీ యేతర రాష్ట్రాల ప్రభుత్వాలను అస్థిరపరిచే, ప్రాంతీయపార్టీలను చీల్చే ప్రక్రియ మొదలుపెట్టింది. అధికారం కోసం భాగస్వామ్య పక్షాలను కూడా చీల్చడానికి వెనుకాడలేదు. అందుకే పంజాబ్‌లో అకాలీదళ్, మహారాష్ట్రలో శివసేన, అంతకుముందు జేడీయూ వంటి పార్టీలు ఎన్డీఏ నుంచి వైదొలిగాయి.
ఫలితంగా 2022 మార్చి నాటికి యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, గోవా, త్రిపుర, అసోం వంటి రాష్ట్రాలతోపాటు మరో నాలుగైదు రాష్ట్రాల్లో అక్కడి ప్రాంతీయ పార్టీలతో భాగస్వామ్య పార్టీలతో కలిసి అధికారంలో కొనసాగింది. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజార్టీ సాధించడమే కాకుండా.. హిమాచల్ ప్రదేశ్‌లోనూ గెలిచింది.
అదే ఉత్సాహంతో రానున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో గెలిచి తీరాలనే వ్యూహాలతో ముందుకు వెళ్తున్నది. దీనికి చెక్‌పెట్టకపోతే 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రమాద ఘంటికలు మోగే అవకాశం ఉండటంతో ప్రత్యేకించి మధ్యప్రదేశ్ ఎన్నికల్లో గెలిచి తీరాలనే వ్యూహంతో బీజేపీ నాయకత్వం కదులుతున్నదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆ రాష్ట్రంలో కేంద్రమంత్రులను మోహరిస్తున్నదని సమాచారం.