విధాత: పొరుగు రాష్ట్రం ఏపీ నుండి మిర్యాలగూడ రైస్ మిల్లర్లకు అమ్మకానికి వస్తున్న సన్నరకం ధాన్యం దిగుబడుల లారీలను జిల్లా అధికారులు అడ్డుకోవడంతో రెండు రాష్ట్రాల సరిహద్దు చెక్ పొస్ట్ నల్గొండ జిల్లా అలగడప-చిల్లేపల్లి టోల్గేట్ వద్ద ఉద్రిక్తతకు దారితీసింది. రాత్రి నుండి అక్కడ 150 పైగా ధాన్యం లారీలను పోలీసులు అడ్డుకున్నారు.
లారీలోనే ధాన్యం నిల్వ ఉండిపోవడంతో కుళ్లీ రంగు మారుతుందని వెంటనే తమ లారీలను వదలాలని లారీల సిబ్బంది వాటి ధాన్యం వ్యాపారులు, రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా పోలీసులకు, వారికి మధ్య కొంత ఉద్రిక్తత ఏర్పడింది. ముందస్తు సమాచారం లేకుండా తమ ధాన్యం లారీలను అడ్డుకోవడం అన్యాయమని లారీలను అన్‌లోడింగ్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులను ప్రాధేయపడ్డారు.
పక్క రాష్ట్రం సన్నధాన్యం రాకతో మిర్యాలగూడ డివిజన్ ప్రాంతంలో తాము పండించిన సన్న రకం ధాన్యాన్ని సరైన ధరకు మిల్లర్లు కొనుగోలు చేయడం లేదని, దీంతో తాము నష్టపోతున్నామని ఇక్కడి రైతులు ఆందోళన చేశారు దీంతో పొరుగు రాష్ట్రాల ధాన్యం లారీలను జిల్లాలోకి రానివ్వకుండా అధికారులు అడ్డుకుంటున్నారు. అయితే తమ ధాన్యం అమ్ముకోనివ్వకుండా అడ్డుకోవడంతో తాము తీవ్రంగా నష్టపోయే ప్రమాదమున్నందున తమ లారీలను అనుమతించాలని ఏపీ వ్యాపారులు, రైతులు కోరుతున్నారు.
ప్రభుత్వం ఏ గ్రేడ్ రకం ధాన్యానికి క్వింటాల్‌కు 2060 రూపాయలు, బి గ్రేడ్ రకం ధాన్యానికి 2040 రూపాయలను మద్దతు ధరగా నిర్ణయించింది. సన్న బియ్యానికి ఉన్న డిమాండ్ నేపథ్యంలో మిర్యాలగూడ మిల్లర్లు నిర్ణీత మద్దతు ధర కంటే ఎక్కువగా క్వింటాల్ కు 2300 వరకు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. దీనిని సొమ్ము చేసుకునేందుకు ఏపీకి చెందిన సరిహద్దు జిల్లాల వ్యాపారులు అక్కడి రైతుల నుండి తక్కువ ధరకు సన్నధాన్యం కొనుగోలు చేసి మిర్యాలగూడ మిల్లర్లకు ఎక్కువ ధరకు అమ్ముకునేందుకు ధాన్యం తీసుకొస్తున్నారు.
దీంతో మిర్యాలగూడ ప్రాంతం సన్నాలు పండించిన రైతుల ధాన్యానికి క్వింటాలుకు మిల్లర్లు 2100 వరకు మాత్రమే ధర ఇస్తుండడంతో ఇక్కడి రైతుల్లో ఆందోళనకు కారణమైంది. రైతుల ఆందోళన అర్థం చేసుకున్న అధికారులు పొరుగు రాష్ట్రం సన్నధాన్యం నల్గొండ జిల్లా పరిధిలోకి ప్రవేశించకుండా చెక్ పోస్ట్లు కట్టుదిట్టం చేసి అక్కడి ధాన్యం లారీలను అడ్డుకొని తిప్పి పంపిస్తున్నారు.