BRS | బీఆర్‌ఎస్‌లో.. నేతలు VS అసమ్మతి నేతలు
BRS | విధాత: ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్ష నేతలు బైట ఉంటే ఇబ్బంది అని భావించి అధికార పార్టీలోకి ఆహ్వానించారు. వారిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ద్వితీయశ్రేణి నాయకులు కూడా ఉన్నారు. పదవులు ఆశిస్తున్న వారందరిలో కొందరికి కార్పొరేషన్ చైర్మన్‌గిరీలు అప్పగించారు. కొంతమంది మందికి మండలిలో స్థానం కల్పించారు. ఇంకా చాలామంది ఆ జాబితాలో ఉన్నారు. వీరికి తోడు ఉద్యమకాలం నుంచి కేసీఆర్ వెంట నడిచిన అనేకమంది ఉన్నారు. అలాంటి వారందరికీ కేసీఆరే ఒక సందర్భంలో చెప్పినట్టు […]

BRS |
విధాత: ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్ష నేతలు బైట ఉంటే ఇబ్బంది అని భావించి అధికార పార్టీలోకి ఆహ్వానించారు. వారిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ద్వితీయశ్రేణి నాయకులు కూడా ఉన్నారు. పదవులు ఆశిస్తున్న వారందరిలో కొందరికి కార్పొరేషన్ చైర్మన్‌గిరీలు అప్పగించారు. కొంతమంది మందికి మండలిలో స్థానం కల్పించారు. ఇంకా చాలామంది ఆ జాబితాలో ఉన్నారు. వీరికి తోడు ఉద్యమకాలం నుంచి కేసీఆర్ వెంట నడిచిన అనేకమంది ఉన్నారు. అలాంటి వారందరికీ కేసీఆరే ఒక సందర్భంలో చెప్పినట్టు పెళ్లికి, పిండానికి ఒకే మంత్రం అన్నట్టు విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాలు పెరుగుతాయని చెప్పారు.
అప్పుడు అందరికీ అవకాశాలు వస్తాయన్నారు. నియోజకవర్గాల పెంపు అంశం తొమ్మిదేళ్లుగా అమల్లోకి రాలేదు. కేంద్రం కూడా 2026 వరకు యథాతథ స్థితే కొనసాగుతుందని స్పష్టం చేసింది. దీంతో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి టికెట్లు ఆశిస్తున్న ఆశావహుల్లో ఆందోళన మొదలైంది. అయితే గత ఎన్నికల్లో 88 సీట్లు గెలువడం, మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా చేరడం, కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది ఫిరాయించడంతో అధికార పార్టీ సంఖ్యా బలం 100 దాటింది. దీంతో అసంతృప్త నేతలు కూడా ధిక్కార స్వరం వినిపించే అవకాశం లేకుండా పోయింది.
ఇలా అనేక నియోజకవర్గాల్లో అధికార పార్టీలోనే టికెట్ కోసం పోటీ పడే వారి సంఖ్య పెరిగిపోయింది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఇప్పటికే నిర్మల్ జల్లాలో శ్రీహరిరావు లాంటి వాళ్లు బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పగా.. బీఆర్ఎస్‌లో అసమ్మతి గళాన్ని వినిపించి వేటు గురైన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులు హస్తం గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో మాజీ డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది.
మరికొన్ని నెల్లలో ఎన్నికలు జరగనున్న సమయంలో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. ప్రధాన పార్టీలు ఎత్తులకు పై ఎత్తు వేస్తుండటంతో ఆరు నెలల ముందుగా ఎన్నికల వేడి మొదలైంది. ముఖ్యంగా అధికార బీఆర్‌ఎస్‌కు షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ చేరిపోగా.. తాజాగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధమైనట్టు సమాచారం. ఆయన ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో తనదే గెలుపు అని ప్రకటించారు. దానికి అనుగుణంగానే ఆయన అడుగులు వేస్తున్నారు.
జాతీయ రాజకీయాలపై దృష్టి సారించి ఇతర రాష్ట్రాల్లో పార్టీ నిర్మాణం, చేరికలను ప్రోత్సహిస్తున్న కేసీఆర్‌కు సొంత రాష్ట్రంలోనే ప్రతికూలతలు ఎదురవుతున్నాయి. మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి నేతలు బీఆర్‌ఎస్‌లో చేరుతున్న సమయంలోనే ఇక్కడ పార్టీలో అసమ్మతి స్వరాలు, గ్రూపు రాజకీయాలతో అనేక నియోజకవర్గాల్లో అధికార పార్టీకి సొంతపార్టీ నేతలే సవాల్ చేసే పరిస్థితులు నెలకొన్నాయి.
ఇందతా బీఆర్‌ఎస్ అధినేత స్వయంకృతం అంటున్నారు. పోరాటాలు, ఉద్యమాలతో సాధించుకున్న స్వరాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు, ప్రజాసంఘాల నేతలు ప్రశ్నించకూడదు. నిరసన తెలుపకూడదు అన్నట్టు వ్యవహరించింది. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి హైదరాబాద్‌లో కేంద్రబిందువుగా ఉన్న ధర్నాచౌక్ ప్రభుత్వ ఆంక్షలతో నిత్యం పోలీసు నిర్బంధంలో ఉన్నది. వాస్తవాలను విస్మరించన ఫలితమే ప్రస్తుతం అధికార పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలని ఉద్యమకారులు అంటున్నారు.
ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నా ప్రశ్నించకూడదనే వైఖరి వల్లే అధికార పార్టీలో ముసలానికి కారణమౌతున్నాయి. ఇప్పటికే కొంతమంది మంది పార్టీ వీడగా.. మరికొంతమంది అదే బాటలో ఉన్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నేతలు వర్సెస్ బీఆర్‌ఎస్ అసమ్మతి నేతలు అనే విధంగా రాజకీయాలు ఉంటాయనే వాదలనలు వినిపిస్తున్నాయి.