విధాత: భారత్ రాష్ట్ర సమితి పార్టీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. దమ్ముంటే నీ ఎమ్మెస్సీ పొలిటికల్ సైన్స్ సర్టిఫకేట్ బయటపెట్టు అంటూ సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమాజాన్ని చదివి దేశాన్ని అగ్రపథంలోకి తీసుకెళుతుంటే… కేసీఆర్ కుటుంబం చదువుకున్న చదువును డ్రగ్స్, పత్తాలు, దొంగ సారా దందాకు ఉపయోగిస్తూ వేల కోట్లు దోచుకుంటోందని మండిపడ్డారు.
బీఆర్ఎస్ అంటే బీరు…రమ్… స్కాచ్ పార్టీ అని, కేసీఆర్ కుటుంబం మీరంతా అంతర్జాతీయ దొంగల ముఠాకు నాయకులని ఎద్దేవా చేశారు. 8 ఏండ్ల క్రితం ఇల్లు తప్ప ఏమీలేని కేసీఆర్ నేడు వేల కోట్లతో ప్రతిపక్ష పార్టీలకు డబ్బులిచ్చే స్థాయికి ఎట్లా ఎదిగారని ప్రశ్నించారు.
ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో సభ నిర్వహించనున్నారు. ఈ సభా ఏర్పాట్లను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ తదితురులతో కలిసి బండి సంజయ్ పరిశీలించారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఈ నెల 8న వందేభారత్ రైలు ప్రారంభోత్సం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రానికి వస్తున్నారు. ఆ ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చాం. ఈ ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున తరలిరావాలని కోరుతున్నానని తెలిపారు. 80 వేల పుస్తకాలు చదువుకున్న మీ అయ్య చదువు ఏమైంది? ఎమ్మెస్సీ పొలిటికల్ సైన్స్ చదివినని మీ అయ్య చెప్పిండు.. నీకు చేతనైతే ముందు ఆ సర్టిఫికేట్‌ను బయట పెట్టు.
కేసీఆర్ దొంగ పాస్ పోర్ట్, దొంగ సర్టిఫికెట్స్ తయారు చేయడంలో మాస్టర్ డిగ్రీ చేసినట్లున్నడు అని ఎద్దెవా చేశారు. మిగులు రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల పాల్జేసిండు.. బీఆర్ఎస్ అంటేనే అంతర్జాతీయ దొంగల ముఠా. స్కీంల ద్వారా ఏ విధంగా స్కాంలు చేయాలో ట్రైనింగ్ ఇచ్చే సంస్థ బీఆర్ఎస్ భవన్. బీఆర్ఎస్ అంటేనే బీరు, రమ్ము, స్కాచ్ పార్టీ అని విమర్శించారు.