నాగార్జున సాగర్ మున్సిపాల్టీలో నెగ్గిన అవిశ్వాసం
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్(నందికొండ) మున్సిపాల్టీలో బీఆరెస్‌కు చెందిన చైర్ పర్సన్ కర్నా అనూషారెడ్డి, వైస్ చైర్మన్ మంద రఘువీర్లపై పెట్టిన పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది

విధాత : నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్(నందికొండ) మున్సిపాల్టీలో బీఆరెస్‌కు చెందిన చైర్ పర్సన్ కర్నా అనూషారెడ్డి, వైస్ చైర్మన్ మంద రఘువీర్లపై పెట్టిన పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. గురువారం ఉదయం 11:30 లకు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో అవిశ్వాస తీర్మానాన్ని మెజార్టీ కౌన్సిలర్లు బలపరచడంతో అవిశ్వాసం నెగ్గినట్టుగా మిర్యాలగూడ ఆర్టీవో చెన్నయ్య ప్రకటించారు.
మొత్తం 12మంది కౌన్సిలర్లు ఉండగా, గతంలో ఒక కౌన్సిలర్ చనిపోయారు. మిగిలిన 11మందిలో చైర్ పర్సన్, వైస్ చైర్మన్లు గైర్హాజరవ్వగా, మిగతా 9మంది కౌన్సిలర్లు అవిశ్వాసాన్ని బలపరిచారు. దీంతో చైర్ పర్సన్, వైస్ చైర్మన్లు తమ పదవులు కోల్పోయారు. త్వరలో నూతన చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకునేందుకు సమావేశం నిర్వహించనున్నారు. బీఆరెస్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాసం నెగ్గడంతో ఈ మున్సిపాల్టీ కాంగ్రెస్ ఖాతాలో చేరనుంది.