విధాత : అల్జీరియాలోని ఒక మసీదులో రంజాన్ (Ramadan) సందర్భంగా ప్రార్థనలు జరుగుతున్న సమయంలో వచ్చిన పిల్లి.. ఇప్పుడు నెట్టింట నవ్వులు పూయిస్తున్నది. ఒకవైపు ప్రార్థన చేస్తూనే ఆప్యాయంగా ఆ పిల్లిని తన భుజాలపైకి ఎక్కించుకున్న ఇమామ్.. నిరాటంకంగా ప్రార్థనలు ముగించడం పలువురి హృదయాలను తాకింది. షేక్ వాలిద్ మెహ్‌సాస్ అధికారిక ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు పవిత్ర రంజాన్ మాసాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొంటున్నారు. ప్రత్యేక తరావీ ప్రార్థనల సమయంలో అల్జీరియాలోని ఒక మసీదులో ఆసక్తికర ఘటన చోటు చేసుకున్నది. ఇమామ్ ప్రార్థనలకు సిద్ధం కాగానే ఒక మార్జాలం కొన్ని క్షణాలపాటు ఇమామ్ వద్ద తచ్చాడింది. కాసేపటికి ఆయన పైకి ఎక్కేందుకు ప్రయత్నించింది. ఆ పిల్లి ప్రయత్నాలకు సహకరించిన ఇమామ్.. కళ్లుమూసుకుని తన ప్రార్థనలు కొనసాగిస్తూనే దానిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని.. భుజం మీదకు ఎక్కించుకున్నారు.
పిల్లి కూడా ఆ ఇమామ్‌ను ఏ మాత్రం ఇబ్బంది పెట్టకుండా భుజాలపై కూర్చొని.. ఆయనకు ముద్దు పెడుతున్నట్టు తన తలను ఆయన చెంపల దగ్గర ఉంచింది. ఇదేమీ ఇమామ్‌ను ఇబ్బంది పెట్టలేదు. ప్రార్థన ముగించే వరకూ ఆయన కళ్లు మూసుకునే ఉన్నారు. కొద్ది సేపటికి భుజంపై నుంచి కిందికి దూకి.. ఎటో వెళ్లిపోయింది. దీనిపై ఒక నెటిజన్ స్పందిస్తూ.. ఈ దృశ్యం ఎంతో మధురంగా ఉన్నదని, తన కళ్లలో నీళ్లు వచ్చాయని కామెంట్ చేశారు.
పవిత్ర ఖురాన్‌ను ఆలపిస్తున్నందుకు ఇమామ్‌కు కృతజ్ఞతలు చెప్పేందుకు వచ్చిందేమో అని మరొకరు రాశారు. మా షేక్‌ను దేవుడు చల్లగా చూడాలి అని పేర్కొన్నారు. ‘ఆయన స్పందించిన తీరు అద్భుతం. ఆ పిల్లిని నిమురుతూ కూడా ఆయన తన ప్రార్థన శృతి తప్పనీయలేదు’ అని మరొకరు కామెంట్ చేశారు. తన ఏకాగ్రతను కోల్పోకుండానే ఆ మార్జాలాన్ని ఆహ్వానించిన తీరు నాకు నచ్చింది’ అని మరొకరు రాశారు. ఈ వీడియో ఎంతో హృద్యంగా ఉన్నదని ఒకరు స్పందించారు.