కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కరువు భత్యాన్ని 4 శాతం పెంచుతూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కరువు భత్యాన్ని 4 శాతం పెంచుతూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఇది ఈ ఏడాది జూలై ఒకటి నుంచి వర్తిస్తుందని తెలిపింది. బుధవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశమైంది. నిర్ణయాలను అనంతరం కేంద్ర
సమాచార ప్రసారశాఖల మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రస్తుతం కరువు భత్యం 42 శాతంగా ఉన్నది. తాజా పెంపుదలతో అది 46 శాతానికి చేరుతుంది. ఈ నిర్ణయంతో దేశంలోని 48.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 67.95 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుంది. ఏడవ వేతన సంఘం సిఫారసుల ప్రాతిపదికన డీఏ పెంచారు. ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఏటా 12,857 కోట్ల మేరకు వ్యయం కానున్నది. అంతకు ముందు కేంద్రం పారామిలిటరీ దళాలు సహా గ్రూప్-సీ, నాన్‌గెజిటెడ్ గ్రూప్ బీ స్థాయి అధికారులకు దీపావళి బోనస్‌ను ప్రకటించింది.