విధాత: భువనగిరి ప్రాంతానికి చైతన్య పతాక జైనిమల్లయ్య గుప్త. లౌకిక, ప్రజాస్వామిక విలువల ప్రతీక. సాహిత్య, సామాజిక జీవి. ఉర్దూ భాషా ప్రేమికడు. ఈ ప్రాంతంలో జరిగిన అన్నిసామాజిక ఉద్యమాల్లో ముందు భాగాన నడిచిన నిత్య పోరాట శీలి ఆయన. 97 ఏండ్ల వయస్సులోనూ లౌకిక, ప్రజాస్వామిక విలువల పరిరక్షణ కోసం పరితపిస్తూ.., నేడు దేశంలో నెలకొన్న పరిస్థతుల పట్ల తీవ్ర ఆవేదనతో ప్రతిస్పందిస్తాడు. ఈ నేపథ్యంలోనే.. భువనగిరిలో జైనిమల్లయ్య గుప్త మిత్రుల ఆత్మీయ సమావేశం జరిగింది.
ఈ సామావేశానికి భువనగిరిలోని ప్రజాస్వామిక వాదులే కాకుండా, పుర ప్రముఖులు, ప్రముఖ సాహితీ కారులు హాజరయ్యారు. నందిని సిధారెడ్డి, డాక్టర్ తూర్పు మల్లారెడ్డి, వేణు సంకోజు, కూరెళ్ల విఠలాచార్య, రామ మూర్తి లాంటి కవులూ, రచయితలే కాకుండా జిట్టా బాలకృష్ణారెడ్డి, కొలుపుల అమరేందర్, శ్రీనివాసాచార్య, పొన్నాల జహంగీర్, హమీద్ పాషాతో పాటు పట్ణణంలోని ప్రముఖులు డాక్టర్ రంగయ్య, సితారాములు, ఉర్దూ భాషా పరిరక్షణ సంస్థ అధ్యక్షుడు, వర్తక సంఘం ప్రముఖులు పాల్గొన్నారు.
దేశ సార్వభౌమాధికారాన్నీ, ప్రజాస్వామిక విలువలను పరిరక్షించుకోవటం కోసం మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని నందిని సిధారెడ్డి పిలుపునిచ్చారు. చాలా మంది చాలా కాలం జీవిస్తారు. కానీ గుప్తా గారి లాగా విలువల కోసం జీవించే వారే సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తారన్నారు. అందుకోసమే నేడు ఇంత మందిమి ఆయన మిత్రులుగా, సహచరులుగా గుమికూడి మాట్లాడుకొంటున్నామని అన్నారు.
ఇవ్వాళ.. మనం మాట్లాడుకొంటున్నది మన సొంత సమస్య కాదు, స్వ విషయం అంతకన్నాకాదు. మొత్తంగా ఈ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల గురించి, వాటి పరిష్కారాల గురించి మాట్లాడుకుంటున్నామని, దానికి స్ఫూర్తి జైని మల్లయ్య గుప్తాగారే నని అన్నారు.
నేటి తరం యువతీ యువకులంతా.. జైని మల్లయ్య గుప్త జీవితం, ఆచరణను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరమున్నదని పిలుపునిచ్చారు. నేడు దేశ భద్రతకు, సమగ్రతకు ప్రమాద కరంగా పరిణమించిన మత తత్వాన్ని పారదోలాల్సిన ఆవశ్యకత ఉన్నదన్నారు. చివరగా.. జైని మల్లయ్య గుప్త గారు మాట్లాడుతూ… మతోన్మాదాన్ని ఓడించి నిర్మూలించిన నాడే ప్రజాస్వామ్యం మనగలుగుతుందని తెలిపారు. అందరూ మతోన్మాద ఫాసిజానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.