Chandrababu: ప్రజాసంక్షేమం..సంస్కరణలు..అభివృద్ధిలో టీడీపీ ట్రెండ్ సెట్టర్ : సీఎం చంద్రబాబు

కడప మహానాడు రాష్ట్రానికి దశా..దిశ
అన్ని పార్టీల్లోనూ టీడీపీ వర్సిటీ విద్యార్థులే
వైసీపీ విధ్వంస పాలనతో రాష్ట్రం సర్వనాశనం
టీడీపీ ఆలోచనలు దేశంలోనే ప్రత్యేకంగా నిలిచాయని
గర్వపడే పాలన అందిస్తాం
అవినీతి కట్టడికి పెద్దనోట్లను రద్దు చేయాలని ప్రధానికి సూచన
అమరావతి : ప్రజాసంక్షేమం..సంస్కరణలు, అభివృద్ధిలో టీడీపీ దేశానికే ట్రెండ్ సెట్టర్ అని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కడపలో ప్రారంభమైన పార్టీ మహానాడు ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన చేసి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మహానాడు ప్రాంగణంలో టీడీపీ జెండా ఎగురవేశారు. అనంతరం వేదికపై చంద్రబాబు ప్రసంగించారు. తెలుగుదేశం పరీక్షలు ఎదుర్కొన్న ప్రతిసారి విజేత గానే నిలిచిందని.. గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విశ్వరూప సందర్శనం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. మన పార్టీ చరిత్ర చెరిపేస్తే పోయేది కాదని..మన పార్టీ విధానాలు..ఆలోచనలు దేశంలోనే ప్రత్యేకంగా నిలిచాయని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉండగా అవినీతి వ్యతిరేక పోరాటాలు చేశామని..అధికారంలో ఉంటే అవినీతి రహిత పాలన అందించామన్నారు. ప్రజల ఆస్తులు హక్కులకు రక్షణ కల్పించామమన్నారు. పాజిటివ్ పాలిటిక్స్ తో రాజకీయాల్లో విలువలు తెచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు పేర్కొన్నారు. 43 ఏళ్ల తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కొనటువంటి సంక్షోభాలు ఎదుర్కొందని.. అయినా ఎక్కడా తిరిగి చూడలేదు.. టీడీపీ జెండా రెపరెపలాడుతూనే ఉంటుందన్నారు. పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ల పనే అయిపోయిందన్నారు.
అన్ని పార్టీల్లోనూ టీడీపీ వర్సిటీ విద్యార్థులే
తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీలో చూసినా టీడీపీ వర్సిటీలో చదివిన విద్యార్థులే ఉన్నారన్నారు. దేశంలో నిరుద్యోగులను ఐటి ఉద్యోగులుగా మార్చి సత్తా చాటామని.. బడుగు బలహీన వర్గాలకు అధికారాన్ని అందించిన తొలి పార్టీ తెలుగుదేశం అని గుర్తు చేశారు. అడిగే పరిస్థితి నుంచి శాసించే స్థాయికి బీసీలను టీడీపీ తీసుకొచ్చిందన్నారు. టీడీపీ అంటే ఒక బ్రాండ్ నీటి నిజాయితీతో రాజకీయాలు చేస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుగుతున్న తొలి మహానాడు ను కడపలో నిర్వహిస్తున్నామని.. ఈ మహానాడు చరిత్ర సృష్టిస్తుందని తెలిపారు. ఈ మహానాడు రాష్ట్రానికి దశా దిశ నిర్దేశిస్తుందని తెలిపారు. ఉమ్మడి కడప జిల్లాలో పదింటికి ఏడు స్థానాలు గెలిచామని.. ఈసారి ఇంకొంచెం కష్టపడి పదికి పది గెలవాలన్నారు. 2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసమాన్యమని.. 93% స్ట్రైక్ రేట్ సాధించి అద్భుత విజయాన్ని అందుకున్నామన్నారు. పార్టీ ఇంతటి విజయాన్ని సాధించింది అంటే పసుపు సైనికులే కారణమని తెలిపారు. జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని.. ఏమి ఆశించకుండా పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తలతోనే విజయం సాధ్యమైందన్నారు. మహానాడు సందర్భంగా ప్రజాసేవకు పునరాంకితమవుతున్నామని ప్రకటించారు.
వైసీపీ విధ్వంస పాలనతో రాష్ట్రం సర్వనాశనం
పాలన అంటే వేధింపులు, తప్పుడు కేసులని మార్చేసింది గత వైసీపీ ప్రభుత్వం.. విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని చంద్రబాబు విమర్శించారు.. ప్రశ్నించిన నాయకులను వెంటాడి ప్రాణాలు తీశారు. అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి వేధించారు. ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేశారని మిమ్మల్ని అభినందిస్తున్నామన్నారు. మన పసుపు సింహం కార్యకర్త చంద్రయ్యను పీక కోస్తుంటే కూడా జై తెలుగుదేశం అని ప్రాణం వదిలాడని.. ఆయనే మనకు స్ఫూర్తి అని.. ఆ స్ఫూర్తినే నడిపిస్తుంది చంద్రబాబు పేర్కొన్నారు. చైతన్యరథం నుంచి వస్తున్నా మీకోసం, యువగళం వరకు పార్టీ కార్యకర్తల్లో అదే స్ఫూర్తి అన్నారు. ఆశయ సాధన కోసం రాజీలేని పోరాటాలు చేసిన వారిని ఎప్పటికీ గుర్తుంచుకోవాలని.. కార్యకర్తల కష్టానికి గౌరవం, గుర్తింపు ఇచ్చి సంక్షేమం అందిస్తామని చంద్రబాబు తెలిపారు.
ఆగస్టు 15నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం
ప్రతి కార్యకర్త గర్వపడే పాలన అందిస్తున్నామని హామీలని అమలు చేసే బాధ్యత నాది అని చంద్రబాబు ప్రకటించారు. సూపర్ సిక్స్ పథకాలను పూర్తి చేసి ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతామని తెలిపారు. సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేసి రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ టీడీపీ అని చెప్పారు. పోలవరం పూర్తిచేసి జలహారతి ద్వారా ప్రతి ఎకరాకు నీరిస్తాం. ఐటి మంత్రి ఆధ్వర్యంలో తెచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ ఒక గేమ్ చేంజర్. కూటమిగా మూడు పార్టీలు కలిసి నడవాలి..కలిసి గెలవాలన్నారు. ఏడాదిలో మూడు విడతలు అన్నదాత సుఖీభవ ఇస్తామని.. కేంద్రం ఇచ్చిన 6000 తో కలుపుకొని మూడు విడతల్లో 20,000 ఇస్తమన్నారు. ఈ ఏడాది కేంద్రం తొలివిడత ఎప్పుడు ఇస్తే అప్పుడు రాష్ట్రం వాటా ఇస్తామని చెప్పారు. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో ఐదు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లు ప్రారంభిస్తున్నామని తెలిపారు. డిజిటల్ కరెన్సీ వచ్చాక పెద్ద నోట్ల అవసరం లేదన్నారు. డిజిటల్ కరెన్సీ తేవాలని ప్రధానిని కోరానని..500, 1000, 2000 నోట్లను రద్దు చేస్తే దేశంలో పూర్తిగా అవినీతి తగ్గిపోతుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.