Chandrababu Selfie Challenge |
విధాత: చంద్రబాబు మళ్ళీ ఫామ్‌లోకి వచ్చినట్లున్నారు. ఆర్నెల్ల క్రిందట పూర్తిగా డిఫెండింగ్ మోడ్లో ఉన్న చంద్రబాబు (Chandra Babu) ఈ మధ్య, మొన్నటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఊహించని విజయాలు నమోదు చేయడంతో బాబులో జోరు పెరిగింది. క్యాడర్లో ఉత్తేజం పెరిగింది. మళ్ళీ గెలుస్తాం అనే నమ్మకం పెరిగింది. ఈ తరుణంలో సరికొత్త ప్రోగ్రాముకు శ్రీకారం చుట్టారు.
జగన్ ప్రభుత్వ హయాంలో ఇంటింటికి పథకాల పేరిట డబ్బు పంపిణీ తప్ప అభివృద్ధి లేదని టీడీపీ ఆరోపిస్తోంది. ఎక్కడ చూసినా టీడీపీ, చంద్రబాబు జమానాలో చేపట్టిన ప్రగతి, నిర్మాణాలు మినహా జగన్ ఏమీ చేయలేదని చెబుతూ తెలుగుదేశం గట్టిగా ఆరోపిస్తూ ప్రజల్లోకి వెళ్తోంది.
ఈ క్రమంలో చంద్రబాబు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తూ అప్పట్లో తాను నిర్మించిన టైడ్కో ఇళ్ల సమూహం వద్ద సెల్ఫీ ఫోటో దిగిన చంద్రబాబు జగన్ కు సవాల్ విసిరారు. జగన్ మేం ఇదిగో వేలకొద్దీ ఇల్లు నిర్మించాము.. మీరు ఈ నాలుగేళ్లలో ఎన్ని ఇళ్ళు నిర్మించారు. మీరు ఏమైనా చేసారా? అంటూ జగన్ను ప్రశ్నిస్తున్నారు. లోకేష్ కూడా పాదయాత్రలో ఇదే విధంగా అప్పటి అభివృద్ధి పనులు, పథకాలు భవనాల వద్ద సెల్ఫీ ఫోటోలు దిగుతూ జగన్ను సవాల్ చేస్తున్నారు.