మారుతున్న రామగుండం రాజకీయం.. సోమారపు రాజీనామా వెనుక BRS హస్తం?

మారుతున్న రామగుండం రాజకీయం.. సోమారపు రాజీనామా వెనుక BRS హస్తం?

  • స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దింపే వ్యూహం
  • పలుచోట్ల అధికార పార్టీ అభ్యర్థులకు అసమ్మతి సెగ
  • అధినేత నిర్ణయంపై బహిరంగంగా నిరసన

విధాత: ఎన్నికల ముంగిట రామగుండం నియోజకవర్గ రాజకీయం రక్తి కట్టిస్తోంది. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 115 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఆ ప్రకటన వెలువడిన నాటి నుంచి కొంతమంది ఆశావహులు, అసంతృప్తులు అధినేత నిర్ణయంపై నిరసనను బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కొంతమంది అయితే మా ఎమ్మెల్యేకు టికెట్‌ ఇవ్వొద్దని పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. అలాంటి నిరసనలు, విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోకుండా ప్రకటించిన ఎమ్మెల్యేల అభ్యర్థులలో కొంతమందిని మార్చాల్సిందేనని పట్టుబడుతున్నారు.



అలాంటి నియోజకవర్గాల్లో రామగుండం నియోజకవర్గం ఒకటి. అక్కడ గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోమారపు సత్యనారాయణపై స్వతంత్ర అభ్యర్థిగా కోరుకుంటి చందర్‌ గెలిచారు. అనంతరం ఆయన బీఆర్‌ఎస్‌లో చేరారు. అక్కడ ఎమ్మెల్యే వర్సెస్‌ మాజీ ఎమ్మెల్యే వర్గాల మధ్య రాజకీయ కొట్లాట చాలాకాలం జరిగింది. అనంతరం సోమారపు కారు దిగి కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈసారి ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దాదాపు ఆయన పేరే ఖరారవుతుందని అనుకున్నారు. అంతలోనే రాజకీయ వేడి రాజుకుంది.



బీఆరెస్ కు ఎదురుగాలి తప్పదా?


రాష్ట్రంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనన్నఅభిప్రాయం ప్రజలు వ్యక్తం చేస్తున్నారని, అందుకే తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు సోమారపు సత్యనారాయణ ప్రకటించారు. రామగుండం ప్రాంత ప్రజల అభిప్రాయం, అభివృద్ధి దృష్ట్యా తాను వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామంతోనే గులాబీ వ్యూహంపై చర్చ సాగుతోంది. బీఆర్‌ఎస్‌ ప్రకటించిన అభ్యర్థులందరికీ బీ ఫామ్స్‌ దక్కకపోవచ్చనే ప్రచారం చాలా కాలంగా జరుగుతున్నది.



అలాగే ఈసారి ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఎదురుగాలి వీస్తున్నదని, గెలుపు అంత తేలిక కాదని సర్వేలు కూడా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రామగుండం నియోజకవర్గంలో చందర్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన ఆ పార్టీ నేతల్లో ఇటీవల ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడిగా కొంకటి లక్ష్మీనారాయణకు అవకాశం ఇవ్వగా, జడ్పీటీసీ కందుల సంధ్యారాణి మాత్రం తాను వెనక్కి తగ్గేది లేదని, కచ్చితంగా పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఆమెకు ఎమ్మెల్సీ కవిత అండదండలు ఉన్నాయనే ప్రచారం నియోజకవర్గంలో జరుగుతున్నది.


అధికార పార్టీ ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత


బీఆరెస్ లో సొంతపార్టీలోనే అభ్యర్థి వర్సెస్‌ రెబల్‌ అభ్యర్థికి తోడు తాజాగా సోమారపు సత్యనారాయణ కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. దీని వెనుక కూడా బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఉన్నదని అనుమానిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుత అధికారపార్టీ ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత ఉన్నది. అందుకే ముందస్తుగా సోమారపును ఆ పార్టీనే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దించుతున్నదని సమాచారం.



బీఆర్‌ఎస్‌లో టికెట్లు దక్కని అభ్యర్థులను బుజ్జగిస్తున్నారు. ఇతర అవకాశాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. అప్పటికీ వినకుండా ఉండే నేతల్లో ఆయా నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశం ఉంటే వారందరినీ స్వతంత్ర అభ్యర్థులుగా లేదా ఇతర పార్టీల గుర్తులతో పోటీ చేయిస్తారనే టాక్‌ కూడా వినిపిస్తున్నది. సోమారపు ప్రకటన కూడా ఇందులో భాగమే అంటున్నారు.