క్లాసిక్స్‌: స్వాతికిరణం.. ఏ పాట గొప్పది!

జీవిత భావావేశపు లయ విన్యాసమే కళ.. కళలో ఒక శాసనం ఉంది. ఎంత దాచాలన్నా, ఎన్ని మెలికలు తిప్పినా రచయిత ఆత్మ, సబ్ కాన్షియస్ సెల్ఫ్ ప్రతిఫలించి తీరుతుంది. - చలం కళాకారుడి వ్యక్తిత్వాన్ని దాటి కళ ప్రదర్శించబడటం దాదాపు అసాధ్యం. మనసులో జనించే ప్రతీ భావానికి, ఉద్వేగానికి వ్యక్తికరణకు అనువైన రాగాలు సంగీతంలో ఉన్నాయి. గమనించుకుంటే హృదయ స్పందనే లయభరితం. పాడే వ్యక్తి వ్యక్తిత్వం, పాట కూర్చిన వ్యక్తి వ్యక్తిత్వం కూడా ఒక్కోసారి వ్యక్తం అవుతుంటాయి. […]

క్లాసిక్స్‌: స్వాతికిరణం.. ఏ పాట గొప్పది!

జీవిత భావావేశపు లయ విన్యాసమే కళ.. కళలో ఒక శాసనం ఉంది. ఎంత దాచాలన్నా, ఎన్ని మెలికలు తిప్పినా రచయిత ఆత్మ, సబ్ కాన్షియస్ సెల్ఫ్ ప్రతిఫలించి తీరుతుంది. – చలం

కళాకారుడి వ్యక్తిత్వాన్ని దాటి కళ ప్రదర్శించబడటం దాదాపు అసాధ్యం. మనసులో జనించే ప్రతీ భావానికి, ఉద్వేగానికి వ్యక్తికరణకు అనువైన రాగాలు సంగీతంలో ఉన్నాయి. గమనించుకుంటే హృదయ స్పందనే లయభరితం. పాడే వ్యక్తి వ్యక్తిత్వం, పాట కూర్చిన వ్యక్తి వ్యక్తిత్వం కూడా ఒక్కోసారి వ్యక్తం అవుతుంటాయి. కళాప్రదర్శ‌న కళాకారుడిలోని వ్యక్తికి ప్రతీకగా కూడా కనిపిస్తుంది. ఈ విషయాన్నే విశ్వనాథ్ గారు ” ప్రణతి ప్రణతి ప్రణతి ” అనే పాటలో రెండు పాత్రల వ్యక్తిత్వాలని వ్యక్తమయ్యేలా చూపారు.

పమప మగమ సరిస
ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవనాద జగతికి
మమప మమప మపని
ప్రణుతి ప్రణుతి ప్రణుతి ప్రథమ కళాసృష్టికి
ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవనాద జగతికి
పూల ఎదలలో పులకలు పొడిపించే భ్రమరరవం (ఓంకారమా)
సుప్రభాత వేదికపై శుకపికాది కలరవం (ఐంకారమా)
పూల ఎదలలో పులకలు పొడిపించే భ్రమరరవం (ఓంకారమా)
సుప్రభాత వేదికపై శుకపికాది కలరవం (సస సనిప పానిపమ ఐంకారమా)
పైరుపాపలకు జోలలు పాడే గాలుల సవ్వడి హ్రీంకారమా (హ్రీంకారమా)
గిరుల శిరసులను జారే ఝరుల నడల అలజడి శ్రీంకారమా (శ్రీంకారమా)
ఆ బీజాక్షర వితతికి అర్పించే జోతలివే

పూర్తి ప్రకృతికి చెప్పే ప్రణతి ఇది. ఇలా ప్రణతులిడుతూ … ప్రణవం ఎలా సమ్మిళితం ఈ ప్రకృతిలో, బీజాక్షరాల ధ్వని ఎంత అంతర్లీనంగా ఉందో వివరణ మొదటి చరణం. పూల ఎదను పులకరింప జేసే తుమ్మెద నాదం ఓంకారంగా, ఉదయపు పక్షుల కలకలం ఐంకారం, చిరుగాలి సవ్వడి హ్రింకారం, కొండల నుంచి జాలువారే నదుల సవ్వడి శ్రీంకారం. ఈ ప్రకృతిలోని బీజాక్షర వినతికి జ్యోతలు తెలియ చేసే సందర్భం.

కానీ సంగీత నిధి ఎంచుకున్నది గంభీర రాగ ధ్వని నాట రాగం. శాస్త్రీయ సంగీత ప్రపంచంలో నన్ను మించిన వాడు లేడన్న అహంతో చరించే అనంతరామ శర్మ స్వరంలో ఆయన అర్పించే జ్యోతలో సైతం ఒక అహం, ఒక నిర్లక్ష్యం ధ్వనిస్తుంటుంది. ప్రణమిల్లుతున్న విధానం కూడా నా అంతటి వాడు నీకు ప్రణమిల్లుతున్నాడు చూడు అన్నట్టుగా అనిపిస్తుంది. అది ఆ పాత్ర వ్యక్తిత్వం. అది అలా ఆవిష్కరించబడింది అతడి స్వరంలో.

పంచభూతాల సంగమంలో ప్రకృతి కలిగిన పారవశ్యం కవిత్వం అయితే, సర్వంగాల పారవశ్యం వల్ల మనసులో రేగిన అలజడి నటనగా, కంటి చివర ఆవిష్కృతమైన ఇంద్రధనసు రంగులు చిత్రలేఖనంగా, మౌన శిలలను సజీవం చేసింది శిల్పకళ కాగా ఆ లలిత కళా జగతికి అర్పించే జ్యోత మరో చరణం.

పంచభూతముల పరిష్వంగమున ప్రకృతి పొందిన పదస్పందన
అది కవనమా
మగమ పాప పప మపా పాప పప
నిపప నిపపప నిపా పాప పమ మప మపమగ
అంతరంగమున అలలెత్తిన సర్వాంగ సంచలనకేలన
అది నటనమా
అది నటనమా
కంటితుదల హరివింటి పొదల తళుకందిన సవర్ణలేఖన
అది చిత్రమా (అది చిత్రమా)
మౌన శిలల చైతన్య మూర్తులుగ మలచిన సజీవకల్పన
అది శిల్పమా
అది శిల్పమా
అది శిల్పమా
అది శిల్పమా
ఆ లలితకళా సృష్టికి అర్పించే జోతలివే

కింద నిలబడి అదే పాటను విన్న పిల్ల కళాకారుడు గంగాధరం మనసులో అదే సాహిత్యానికి స్వరం మరో రకమైన రాగంలో రూపొందింది. దానికి అతడు ఎంచుకున్నది సున్నితంగా ధ్వనించే భాగేశ్వరి. ఈ రాగంలో ఒక సమర్పణ ధ్వనిస్తుంది. ఒక సబ్మిసివ్నెస్ అతడి స్వరంలో. విధేయత, వినయం ధ్వనిస్తాయి. లలిత కళా జగతికి అతడు తనని తాను జ్యోతగా అర్పించుకుంటున్న భావన కలుగుతుంది.

ఇలా కళాకారుడి వ్యక్తిత్త్వం అతడి కళద్వారా ఎలా వ్యక్తం అవుతుందో ఈ పాట రెండు వెర్షన్లు మనకు తెలియ జేస్తాయి. అప్పటికే ఎస్టాబ్లిష్డ్ కళాకారుడు, తనను తాను సంగీత ద్రష్టగా భావించే వాడు రూపొందించిన స్వరానికి, తాను ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అని భావించే యువ కళకారుడు రూపొందించే పాటకు ఉండే తేడాను విశ్వనాథ్ ఈ పాట ద్వారా ప్రేక్షకులకు చూపించారు.

సినిమాలో ముందుగా ఇది సంగీత ద్రష్ట అనంతరామ శర్మ ఆలాపిస్తాడు. అది అతడి దగ్గర శిష్య‌రికం చెయ్యాలని వచ్చిన గంగాధరం వింటాడు. అదే పాటను తనదైన శైలిలో తిరిగి స్వరం రాసుకొని ప్రదర్శిస్తాడు. సందర్భానుసారం ఒకే పాటను రెండు రకాలుగా వ్యక్తీకరించడంలో మహదేవన్ సంగీత పటిమ మాటల్లో చెప్పలేనిది. ప్రకృతికి, కళామయమైన జగతికి సినారే కలం అర్పించిన జ్యోత తర్వాత, ఇక ఇంతకు మించి అర్పించేందుకు ఏమీ మిగలలేదేమో అనిపించేంత అద్భుతమై అక్షరాలు కూర్చి అందించారు.

ఇటువంటి సాహిత్యం నభూతో నభవిష్యతి. అలా ఆ ఇద్దరు కళాకారుల అంతరంగ ఆవిష్కరణ ఒకే పాటద్వారా చూపించాలన్న దార్శనికత విశ్వనాథ్ లో ఉన్న కళలోని సూక్ష్మ గ్రాహ్యతకు, సునిశిత పటిమకు నిదర్శనం. ఇందులో ఏ పాట గొప్పగా ఉంది అని చెప్పటం కొంచెం కష్టమే. ఈ పాట అనంతర సన్నివేశం లో సాక్షి రంగారావు చేత విశ్వనాథ్ ఈ మాటల ద్వారా చెప్పించారు ‘నువ్వు పాడింది వింటే నీకు నువ్వే సాటి అనిపిస్తుంది. అదే వాడు పాడింది విన్నామనుకో ఇంక తిరగులేదని అనిపించింది’ అని.
ఈ రెండు వేరియేషన్లలో ఈ పాటను మరోసారి విని మనం కూడా ప్రథమ కళా సృష్టికి ప్రణమిల్లుదాం.

– భవాని