CM Jagan | సీఎంగా మళ్లీ నేనే.. విశాఖలోనే ప్రమాణం

వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాతా నేను విశాఖలోనే ఉంటానని, ఈసారి సీఎంగా ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానని, ఇక్కడి నుంచే పాలన చేస్తానని ఏపీ సీఎం వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

  • By: Somu    latest    Mar 05, 2024 10:29 AM IST
CM Jagan | సీఎంగా మళ్లీ నేనే.. విశాఖలోనే ప్రమాణం
  • ఎన్నికల తర్వాతా విశాఖ నుంచే పాలన


విధాత : వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాతా నేను విశాఖలోనే ఉంటానని, ఈసారి సీఎంగా ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానని, ఇక్కడి నుంచే పాలన చేస్తానని ఏపీ సీఎం వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విజన్ వైజాగ్ పేరిట పారిశ్రామిక వేత్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతు విశాఖ నగర అభివృద్ధికి పదేళ్ల ప్రణాళిక అమలు చేయనున్నట్లుగా తెలిపారు. విశాఖ అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చేయలేదని, కేంద్రం సహకారం ఉండాలన్నారు.


అలాగే ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం నమునా అవసరమని, సమష్టిగా కృషి చేస్తేనే విశాఖ మహా నగరంగా మారుతుందన్నారు. అమరావతికి నేను వ్యతిరేకం కాదని, శాసన రాజధానిగా అది కొనసాగుతుందని వెల్లడించారు. కర్నూల్ న్యాయ రాజధానిగా ఉంటుందని మరోసారి మూడు రాజధానుల మాటనే జగన్ పునరుద్ఘాటించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి అక్కడ 50వేల ఎకరాల బీడు భూమి తప్ప ఏమీ లేదని, అమరావతిని అభివృద్ధి చేయాలంటే ఎకరానికి రూ.2 కోట్లు అవుతుందని డీపీఆర్ ఇచ్చారని గుర్తు చేశారు.


అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు లక్ష కోట్లు అవుతుందని టీడీపీ ప్రభుత్వమే చెప్పిందంటూ జగన్ చెప్పారు. తాను విశాఖ వచ్చేందుకు అనేకసార్లు ప్రయత్నించిన ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు రానివ్వలేదని, నాలుగుసార్లు ముహూర్తం పెట్టి వాయిదా వేయాల్సివచ్చిందని తెలిపారు. కోర్టు కేసులతో జాప్యం ఒకవైపు అడ్డం పడగా, కొన్ని మీడియా సంస్థలు భూ కబ్జాలు, అరాచకాలు అని విష ప్రచారం చేశాయని మండిపడ్డారు.


సీఎం వైజాగ్‌లో ఉంటే విశాఖ బాగా అభివృద్ధి చెందుతుందన్నారు. తాను ఒక్కడినే విశాఖను కార్యనిర్వహక రాజధానిగా చేయాలనుకున్నానని.. ప్రతిపక్షం మొత్తం వ్యతిరేకించిందని తెలిపారు. విశాఖలో రోడ్లు ఉన్నాయని… మంచి హోటల్స్ ఉన్నాయన్నారు. సెక్రటేరియట్ విశాఖలో అయితే ఐకానిక్ టవర్స్ కట్టవచ్చని చెప్పుకొచ్చారు. సీఎం వస్తే అందరూ వైజాగ్ వస్తారని… అప్పుడు దానంతట అదే విశాఖ అభివృద్ధి చెందుతుందని జగన్ అభిప్రాయపడ్డారు.