CM KCR | చివరికి ధర్మమే జయిస్తుంది.. BRS శ్రేణులకు CM KCR లేఖ

కొత్త పంథాలో సీఎం కేసీఆర్… కాంగ్రెస్, బీజేపీకి విజన్ లేదు బీజేపీ బరితెగించి దాడులు బీఆర్ఎస్ సిపాయి పార్టీ మీరే నా బలం బలగం పాలిటిక్స్ ఇతరులకు గేమ్ మనకు టాస్క్ పొత్తుల సద్ది మూట బీఆర్ఎస్ గులాబీ కేడర్‌కు ఆత్మీయ సందేశం పేరుతో బహిరంగ లేఖ CM KCR |  కొత్త పంథాలో గులాబీ కేడర్‌ను ఆకట్టుకుని, ఆత్మవిశ్వాసం పెంపొందించి, నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తాజా ప్రయత్నం […]

  • By: krs    latest    Mar 20, 2023 4:03 PM IST
CM KCR | చివరికి ధర్మమే జయిస్తుంది.. BRS శ్రేణులకు CM KCR లేఖ
  • కొత్త పంథాలో సీఎం కేసీఆర్…
  • కాంగ్రెస్, బీజేపీకి విజన్ లేదు
  • బీజేపీ బరితెగించి దాడులు
  • బీఆర్ఎస్ సిపాయి పార్టీ
  • మీరే నా బలం బలగం
  • పాలిటిక్స్ ఇతరులకు గేమ్ మనకు టాస్క్
  • పొత్తుల సద్ది మూట బీఆర్ఎస్
  • గులాబీ కేడర్‌కు ఆత్మీయ సందేశం పేరుతో బహిరంగ లేఖ

CM KCR | కొత్త పంథాలో గులాబీ కేడర్‌ను ఆకట్టుకుని, ఆత్మవిశ్వాసం పెంపొందించి, నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తాజా ప్రయత్నం ప్రారంభించారు. ఆత్మీయ సందేశం పేరుతో కేడర్ కు బహిరంగా లేఖ రాసి సంచలనం సృష్టించారు. భారీ సభలు సమావేశాలతో ఆకట్టుకునే కెసిఆర్ ఈ దఫా ఆత్మీయ సందేశం పేరుతో ప్రత్యేక కరపత్రాన్ని ముద్రించి పార్టీ శ్రేణులకు అందించే కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ కరపత్రంలో కేడర్ గొప్పతనాన్ని కీర్తిస్తూనే ఇతర రాజకీయ పార్టీలకు బి ఆర్ ఎస్ కు తేడా ఉందంటూ పేర్కొన్నారు. తెలంగాణ ఎంతో పురోభివృద్ధి సాధించింది అని పేర్కొన్నారు. దేశం దయనీయ పరిస్థితుల్లో ఉందని, బిజెపి కాంగ్రెస్‌కు విజన్ లేదంటూ విమర్శించారు. పనిలో పని ప్రతిపక్షాలపై బీజేపీ చేస్తున్న దాడులను ఇందులో లేవనెత్తారు.

ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ (BRS) అధినేత కేసీఆర్‌ పార్టీ శేణులకు లేఖ రాశారు. ఆత్మీయ సందేశం పేరిట పార్టీ లేఖను విడుదల చేసింది. ఈ సందర్భంగా లేఖలో కేసీఆర్‌ కీలక విషయాలను ప్రస్తావించారు. ఉద్యమం నుంచి పార్టీ ఎదిగిన తీరును గుర్తు చేశారు.

భారత రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులకు నమస్తే..!

బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు.. కేసీఆర్ గారి ఆత్మీయ సందేశం

కష్టాలు, కన్నీళ్లు, కరవుతో అల్లాడిన తెలంగాణ నేడు పచ్చని పంటలతో చిరునవ్వుతో కళకళలాడుతోందని తెలిపారు. వలస పార్టీల పాలనలో ఆగమైపోయిన తెలంగాణ నేడు కుదుటపడిందని, కడుపునిండా తిని, కంటి నిండా నిద్ర పోతోందన్నారు.

తాము అమలు చేస్తోన్న ఒక్కో పథకం ఒక్కో ఆణిముత్యమై దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని కేసీఆర్‌ పేర్కొన్నారు. కలలో కూడా ఊహించని కార్యాలను చేపట్టి.. అసాధ్యం అనుకున్న పనులను తెలంగాణ సుసాధ్యం చేసి చూపిందని సీఎం కేసీఆర్‌ (CM KCR)పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తెలంగాణను దేశానికి నమూనాగా నిలబెట్టిందని.. అడిగినవీ, అడగనివీ, చెప్పినవీ చెప్పనవీ ఎన్నో పనులు చేస్తూ అందరి బంధువుగా నిలిచామని, ఏ వర్గాన్ని కూడా చిన్నబుచ్చలేదని పేర్కొన్నారు. ఒక్క రాష్ట్రం బాగుంటే సరిపోదని.. దేశం కూడా బాగుపడాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు.

దేశాన్ని ఇన్నేళ్లుగా పాలించిన కాంగ్రెస్, బీజేపీలకు తెలివి లేదని, విజన్, సంకల్పం అసలు లేవని ధ్వజమెత్తారు. అందుకే దేశానికి కొత్త అజెండాను నిర్దేశించామని, జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయడానికి బీఆర్ఎస్‌ను ఏర్పాటు చేశామన్నారు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదాన్ని ఎత్తుకున్నామని తెలిపారు. తెలంగాణ ప్రగతిని అడుగడుగునా బీజేపీ అడ్డుకుంటోందంటూ కేసీఆర్(CM KCR) ఆగ్రహం వ్యక్తం చేశారు.

వేల దాడులు, లక్షల కుట్రలను తాము ఛేదించామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. నాడు భయపడి ఉంటే తెలంగాణ వచ్చేదా? అంటూ ప్రశ్నించారు. సాహసమే ఊపిరిగా తన ప్రయాణం సాగుతోందన్న ఆయన.. ఇందులో పార్టీ నాయకులు, కార్యకర్తలే తన బలం, బలగం అని కేసీఆర్ తెలిపారు.

తెలంగాణతో బీఆర్ఎస్‌ది పేగు బంధమని, పురిటి గడ్డపై మరోసారి గులాబీ పార్టీ బ్రహ్మాండమైన విజయం సాధించడం తథ్యమని జోస్యం చెప్పారు. చైతన్యం తొణికిసలాడే గడ్డ తెలంగాణ అని, ప్రజలే కేంద్ర బిందువుగా బీఆర్ఎస్ పని చేస్తోందన్నారు.

ఇది ఎన్నికల సంవత్సరమని, అందుకే ప్రతి నాయకుడు, కార్యకర్త నిరంతరం ప్రజల్లో ఉండాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. పనికిమాలిన పార్టీలు పనిగట్టుకుని చేసే దుష్ప్రచారాలను అప్రమత్తతతో తిప్పి కొట్టాలన్నారు. బీఆర్ఎస్‌ను బలోపేతం చేసే బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందని, చివరికి ధర్మమే జయిస్తుందని కేసీఆర్‌ స్పష్టం చేశారు.