విధాత: సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటన వాయిదా పడింది. రేపటికి బదులుగా బుధవారం నాడు కేసీఆర్ కొండగట్టులో పర్యటించనున్నారు. మంగళవారం రోజు కొండగట్టుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగొద్దనే ఉద్దేశంతో కేసీఆర్ తన పర్యటనను బుధవారానికి మార్చుకున్నారు. కాగా కేసీఆర్ పర్యటనకు సంబంధించి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆలయ అభివృద్ధిపై సమీక్షించేందుకు కేసీఆర్ కొండగట్టు పర్యటనను ఖరారు చేశారు. కొండగట్టు పర్యటనలో భాగంగా కోనేరు పుష్కరిణి, కొండలరాయుని గుట్ట, సీతమ్మ వారి కన్నీటిధార, భేతాళ స్వామి ఆలయంతో పాటు తదితర ప్రాంతాలను సీఎం పరిశీలించనున్నారు.
ఆలయాన్ని పరిశీలించిన అనంతరం జేఎన్టీయూ క్యాంపస్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అక్కడే మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది.