రేఖా నాయక్‌పై సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు
ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక్కడున్న ఎమ్మెల్యే చక్కగా లేదు.. మాట్లాడితే లంచాలు తీసుకుంటున్నారని ఫిర్యాదులు వచ్చినట్లు కేసీఆర్ తెలిపారు.

ఖానాపూర్: ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక్కడున్న ఎమ్మెల్యే చక్కగా లేదు.. మాట్లాడితే లంచాలు తీసుకుంటున్నారని ఫిర్యాదులు వచ్చినట్లు కేసీఆర్ తెలిపారు. ఈక్రమంలోనే జాన్సన్ నాయక్‌ను తానే స్వయంగా రాజకీయాల్లోకి ఆహ్వానించినట్లు కేసీఆర్ పేర్కొన్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని, ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ నాయక్‌కు మద్దతుగా ప్రసంగించారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 3,600 పైచిలుకు తండాలను ఆదివాసీ గూడెంలను గ్రామ పంచాయతీలుగా చేశాం. ఇప్పుడు తండాలను ఎస్టీ బిడ్డలే ఏలుతున్నారు. పోడు పట్టాలు ఏ ప్రభుత్వం కూడా సమగ్రంగా చేయలేదు. ఖానాపూర్ నియోజకవర్గంలో 7500 మందికి 22470 ఎకరాలు పోడు పట్టాలు పంపిణీ చేశాం. పోడు పట్టాలు ఇచ్చి చేతులు దులపుకోలేదు. రైతుబంధు కూడా ఇచ్చాం.రైతబీమా కూడా పెట్టాం. త్రీ ఫేజ్ కనెక్షన్లు ఇస్తున్నాం బావుల కాడికి, మోటార్ల వద్దకు. పోడు భూముల కేసులు ఎత్తేశాం అని కేసీఆర్ తెలిపారు.
బంజారాహిల్స్ పేరుకే ఉంది కానీ.. అక్కడ ఎరూ బంజారాలు లేరు. సమైక్య రాష్ట్రంలో తరిమేశారు. అదే బంజారాహిల్స్‌లో పట్టుబట్టి మేమే కోట్లాది రూపాయాలతో సేవాలాల్ మహారాజ్ పేరు మీద బంజారా భవన్ కట్టాం. ఆదివాసీల కోసం కుమ్రం భీం భవన్ కట్టుకున్నాం. రెండు భవనాలు ఎయిర్ కండిషన్డ్‌తో కోట్లాది రూపాయాలు వెచ్చించి కట్టాం. ఈ రకంగా అన్నివర్గాల ప్రజల ఆత్మగౌరవం కాపాడటం కోసం పని చేస్తున్నాం అని కేసీఆర్ తెలిపారు.
సదర్‌మట్‌ను నిజాం సర్కార్ కడితే ఆ రోజుల్లో బ్యారేజ్ లాగా కట్టలేదు. 15వేల ఎకరాలకు నీళ్లు రావాలి కానీ కింద మీద వస్తుండే. పైన బ్యారేజీ కట్టినం. దాని కట్టిందే సదర్‌మట్ కోసం. దాన్ని స్పెషల్ కెనాల్ మంజూరైంది. ఇంకో 20 వేల ఆయకట్టుకు నీళ్లు ఇస్తాం. కాంగ్రెసోళ్ల మాటలు నమ్మే అవసరం లేదు. మీ కోసమే బ్యారేజీ కట్టాం. ఖానాపూర్‌లో డిగ్రీ కాలేజీ, రెవెన్యూ డివిజన్ అడిగారు. అవన్నీ ఇస్తాం అని కేసీఆర్ స్పష్టం చేశారు.
జాన్సన్ నాయక్ నా కొడుకు రాం క్లాస్‌మేట్. ఖానాపూర్‌ను దత్తత తీసుకుంటానని రామారావు చెప్పినట్లు తెలిసింది. రామారావు దత్తత తీసుకున్నాక మీకేం తక్కువ కాదు. జాన్సన్ నాయక్‌కు ఓటేస్తే నాకు వేసినట్టే లేక్క. మంచి మెజార్టీతో జాన్సన్ నాయక్‌ను గెలిపించండి. ఆయన డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదు. ఆయనకు దేవుడు చాలా డబ్బులు ఇచ్చిండు. ఆయనకు అమెరికాలో సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉంది. మీలాంటి చదువుకున్న యువకులు రాజకీయాల్లోకి రావాలని కోరాను. ఇక్కడున్న ఎమ్మెల్యే చక్కగా లేదు. అంత పిచ్చిపిచ్చిగా ఉంది యవ్వారం.
మాట్లాడితే లంచాలు తీసుకుంటున్నారు వాళ్లు. చాలా కంప్లయింట్స్ వస్తున్నాయి. అందువల్ల చదువుకున్న వాళ్లు, నీలాంటి బుద్ధిమంతులు వస్తే లాభం జరుగుతది అని చెప్పి పిలుస్తే వచ్చిండు. ఆ విధంగా రాజకీయాల్లోకి వచ్చిండు. నిస్వార్థంగా సేవ జరుగుతది. కేటీఆర్ దత్తత తీసుకుంటా అంటే నేను తీసుకున్నట్టే. మీకేం కావాలో అవన్నీ నిమిషాల్లో జరిగిపోతాయి. అనుమానం అవసరం లేదు.. ఒక రోజు నేనే వచ్చి సమస్యలను పరిష్కరిస్తాను అని కేసీఆర్ హామీ ఇచ్చారు.