సభకు రాకుండా బయట ప్రగల్భాలు ఎందుకు

మేడిగడ్డలో రెండో మూడో పిల్లర్లు కుంగాయని బ్యారేజీ అంతా బాగుందన్నట్లుగా నల్లగొండ సభలో కేసీఆర్ మాట్లాడారని, మేడిగడ్డతో పాటు సాగునీటి ప్రాజెక్టులపై, కృష్ణా గోదావరి జలాలపైన ప్రభుత్వం అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు

  • By: Somu    latest    Feb 14, 2024 10:50 AM IST
సభకు రాకుండా బయట ప్రగల్భాలు ఎందుకు
  • కేసీఆర్‌పై మండిపడిన సీఎం రేవంత్‌రెడ్డి
  • కేసీఆర్ భాషపై చర్చిద్దామా


విధాత హైదరాబాద్ : మేడిగడ్డలో రెండో మూడో పిల్లర్లు కుంగాయని బ్యారేజీ అంతా బాగుందన్నట్లుగా నల్లగొండ సభలో కేసీఆర్ మాట్లాడారని, మేడిగడ్డతో పాటు సాగునీటి ప్రాజెక్టులపై, కృష్ణా గోదావరి జలాలపైన ప్రభుత్వం అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ప్రతిపక్ష నేత సభకు రాకుండా బయట ఎక్కడో ప్రగల్భాలు మాట్లాడం ఎందుకని సభలో చర్చ చేద్దాం రండని సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు.


తెలంగాణ సమాజం పట్ల, రైతులపట్ల గౌరవం ఉంటే ప్రధాన ప్రతిపక్షం మేడిగడ్డకు వచ్చేదన్నారు. పదే పదే బీఆరెస్ నేతలు భాష గురించి మాట్లాడుతున్నారని, మాజీ సీఎం కేసీఆర్‌ నిన్న నల్లగొండలో మాట్లాడిన భాషపై చర్చిద్దామా? అని సవాల్ చేశారు. ఒక సీఎంను పట్టుకుని మేడిగడ్డకు పీకనీకి పోయారా అని అంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


తెలంగాణ ప్రజలు మొన్నటి ఎన్నికల్లో మీ ప్యాంటు, చొక్కా పీకేశారన్నారు. కేసీఆర్‌ను చంపుతారా అని అంటుండని, చచ్చిన పామును ఎవరైనా చంపుతారా? ఆ అవసరం మాకేంటి? సానుభూతి కోసం వీల్ చైర్‌ నాటకాలు ఆడుతున్నారన్నారు. కాళేశ్వరంలో అవినీతికి పాల్పడకపోతే చర్చకు రావాలి? సభకు రాకుండా అక్కడెక్కడో ప్రగల్భాలెందుకు అని రేవంత్ అగ్రహం వ్యక్తం చేశారు. అని ఎద్దేవా చేశారు.


మేడిగడ్డ కుంగిపోతే.. అందులో నీళ్లు నింపడానికి అవకాశం ఉంటదా? అని, కడియం శ్రీహరి, హరీష్‌లకే పెత్తనం ఇస్తామని, నీళ్లు నింపి చూపించడని సవాల్ చేశారు. కాళేశ్వరంపై, నదీ జలాలపై చర్చకు మేం సిద్ధమని, కేసీఆర్ చర్చకు సిద్ధమైతే మీ సభాపక్ష నేతను అసెంబ్లీకి రమ్మనండని రేవంత్ సూచించారు. సాగునీటి ప్రాజెక్టులపై శ్వేత పత్రం పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానిపై చర్చించండన్నారు. రూ.94వేల కోట్లు వృథా అయి ప్రాజెక్ట్ దెబ్బతింటే ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారన్నారు.