CM Revanth Reddy | పెత్త‌నం మీకే ఇస్తాం… నీళ్లు నింపి చూపించండి

మేడిగ‌డ్డ బ్యారేజీ కుంగిపోతే అందులో నీళ్లు నింప‌డానికి అవ‌కాశం ఉంటదా? అని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో విప‌క్షాన్ని ప్ర‌శ్నించారు.

CM Revanth Reddy | పెత్త‌నం మీకే ఇస్తాం… నీళ్లు నింపి చూపించండి
  • హ‌రీశ్‌రావు, క‌డియం శ్రీ‌హ‌రిల‌కు సీఎం రేవంత్‌రెడ్డి స‌వాల్‌


CM Revanth Reddy | విధాత‌: మేడిగ‌డ్డ బ్యారేజీ కుంగిపోతే అందులో నీళ్లు నింప‌డానికి అవ‌కాశం ఉంటదా? అని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో విప‌క్షాన్ని ప్ర‌శ్నించారు. ఇక్క‌డ మాట్లాడుతున్న హ‌రీశ్‌రావు, క‌డియం శ్రీ‌హ‌రిల‌కు పెత్త‌నం అంతా ఇస్తాం.. అందులో నీళ్లు నింపి చూపించాల‌ని వారికి రేవంత్ రెడ్డి స‌వాల్ విసిరారు. అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్ట్‌ల‌పై చ‌ర్చ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సమాజం పట్ల, రైతులపట్ల గౌరవం ఉంటే ప్రధాన ప్రతిపక్షం మేడిగడ్డ కు వచ్చేదన్నారు.


పదే పదే బీఆరెస్ నేతలు భాష గురించి మాట్లాడుతున్నారపి, మాజీ సీఎం నిన్న( మంగ‌ళ‌వారం) నల్లగొండలో మాట్లాడిన భాషపై చర్చిద్దామా? అని అన్నారు. మాజీ సీఎం ఒక సీఎంను పట్టుకుని పీకనీకి పోయారా అని అంటారా? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ ప్రజలే మొన్నటి ఎన్నికల్లో మీ ప్యాంటు పీకేశారన్నారు. చర్చకు సిద్ధమైతే మీ సభాపక్ష నేతను అసెంబ్లీకి రమ్మనండి..కాళేశ్వరంపై, నదీ జలాలపై చర్చకు మేం సిద్ధం. అని రేవంత్ స్ప‌ష్టం చేశారు. కేసీఆర్ చంపుతారా అని అంటుండని, చచ్చిన పామును ఎవరైనా చంపుతారా? అని ఎద్దేవా చేశారు.


మీరు చెప్పినట్టు మెడిగడ్డలో రెండో మూడో పిల్లర్లు కుంగినయంటే.. సభలో చర్చ చేద్దాం రండి.. అని రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌ను పిలిచారు. పారిపోయి అక్కడెక్కడో ప్రగల్భాలు పలకడం కాదు.. ఇక్క‌డ చ‌ర్చ‌కు రావాల‌న్నారు. సాగునీటి ప్రాజెక్టులపై శ్వేత పత్రం పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దానిపై చర్చించండన్నారు. కాళేశ్వరంపై కూడా మేం చర్చకు సిద్ధంగా ఉన్నామ‌ని రేవంత్ రెడ్డి స్ప‌ష్టంగా చెప్పారు.