కేటీఆర్ ఎన్ఆర్ఐ.. శాసనసభలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో కీలక వ్యాఖ్యలు చేశారు

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీకి ఓటు తేడా 1.85 శాతం మాత్రమే అని అన్నారు. అయింత దానికి మిడిసిపాటు మంచిది కాదు.. ఉలికి పడటం ఏ మాత్రం సరికాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
కొంత మంది ఎన్ఆర్ఐలకు ప్రజాస్వామిక స్ఫూర్తి అర్థం, అవగాహన కాదు. మనం ప్రయత్నం చేసినా కూడా వారు తెలుసుకునే ప్రయత్నం చేయరు. ప్రజాస్వామ్యంలో 49కి సున్నా వాల్యూ ఉంటది. 51 కి 100 శాతం వాల్యూ ఉంటది. 51 శాతం ఉన్నవారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. వారు ప్రతిపక్షంగా కూర్చుని, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను, శాసనాలను సహేతుకంగా విశ్లేషించి సలహాలు, సూచనలు ఇస్తారు. ప్రభుత్వం పెడచెవిని పెడితే ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు చేస్తరు. అవసరమైతే ఆమరణ దీక్షలు చేస్తరు. గతంలో అలాంటివి జరిగాయి. ఆ స్పిరిట్ తీసుకోవాలి తప్ప.. వారు 64 ఉన్నారు.. మేం 39 మంది ఉన్నాం. మేం అచ్చుపోసిన ఆంబోతుల్లాగా ఉన్నాం. మేం పోడియంలోకి వచ్చి కుస్తీలు కొట్లాడుతాం. ఇది వారి గౌరవానికి, సభను నడిపించుకోవడానికి సరికాదు అని రేవంత్ రెడ్డి అన్నారు.
కేసీఆర్‌ను కేంద్ర మంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీనే కదా..?
గత పాలన గురించి బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడుతున్నారు. గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్‌గా కేసీఆర్‌కు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సింగిల్ విండో డైరెక్టర్‌గా పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే ఓడిపోయింది కేసీఆర్. గత పాలనలో కేసీఆర్‌ను ఎంపీగా గెలిపించిదే కాంగ్రెస్ పార్టీ. షిప్పింగ్ మంత్రి, కార్మిక మంత్రి ఇంచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎమ్మెల్యేగా కాకుండానే మంత్రిని చేసి, ఆ తర్వాత ఎమ్మెల్యేను చేసేందుకు సహకరించిందే కాంగ్రెస్ పార్టీ. ఆయనే హరీశ్‌రావు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో హరీశ్‌రావు పని చేశారు అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
కేకే మహేందర్ రెడ్డికి అన్యాయం చేసిందేవరు..?
పోతిరెడ్డి పాడు పొక్క పెద్దది చేసినప్పుడు.. నాయిని నర్సింహారెడ్డి కడప జిల్లా ఇంచార్జి మినిస్టర్. పోతిరెడ్డిపాడు మీద కొట్లాడింది పీ జనార్ధన్ రెడ్డి. సొంత పార్టీ ప్రభుత్వం ఉన్న తెలంగాణ ప్రజల హక్కులను భంగం కలిగించొద్దని కృష్ణా జలాల్లో మా వాటా మాకు ఉండాలని కొట్లాడింది పీ జనార్ధన్ రెడ్డి మాత్రమే. చంద్రబాబు మద్దతుతో సిరిసిల్లలో ఎమ్మెల్యే అయ్యిండు కేటీఆర్. కేకే మహేందర్ రెడ్డిని ఓడించి, ఎన్నారై కోటా కింద ఎమ్మెల్యే అయిండు.
కేకే మహేందర్ రెడ్డికి అన్యాయం చేసి ఇక్కడకు ఈ రోజు వచ్చిండు. ఒక వేళ వారికి గతం గురించి చర్చించాలని ఉంటే ఒకరోజు చర్చిద్దాం. జూన్ 2, 2014 కంటే ముందు చరిత్రపై సంపూర్ణంగా చర్చిద్దాం. ఇవాళ చర్చ జరుగుతున్నది 2014, జూన్ 2 తర్వాత పరిస్థితులపై మాత్రమే. ఐదు సంవత్సరాలు సమయం ఉంది. సంపూర్ణంగా ఎక్స్‌రే తీసినట్టు అన్ని వివరిస్తాం. జరిగిన విధ్వంసం, ఆర్థిక నేరం ఏంది అనేది చర్చకు పెట్టి, విశ్లేషిద్దాం. మేం సిద్ధంగా ఉన్నాం. సంయమనం పాటించి మాట్లాడండి అని రేవంత్ సూచించారు.
పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడవు..
తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలని అనుకుంటే అభినందిస్తూ మీరు ముందుకు రండి. లేదు మేం ఇట్లనే ఉంటాం అంటే.. పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడవు. ఈ శాపనార్థాలు జీవితకాలం పెడుతనే ఉంటరు. ప్రతిపక్షానికి సూచనలు చేస్తున్నాం. మీరు సలహాలు, సూచనలు ఇవ్వండి. స్వీకరించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ప్రతిపక్షాలను గౌరవించే సంప్రదాయం కాంగ్రెస్ పార్టీ ఉందని తెలియజేస్తున్నాను అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.