CM Revanth Reddy | ప్రగల్భాలు కాదు.. అసెంబ్లీకి రా

మేడిగడ్డలో చేసిన వేలకోట్ల దోపిడీ విషయంలో తాను అవినీతిపరుడిగా, ప్రజల ముందు దోషిగా నిలబడాల్సివస్తుందన్న భయంతోనే నల్లగొండలో కేసీఆర్‌ సభ పెట్టారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు

CM Revanth Reddy | ప్రగల్భాలు కాదు.. అసెంబ్లీకి రా
  • సలహాలు ఇవ్వదలిస్తే.. సభకు వచ్చి ఇవ్వు
  • ప్రాజెక్టు కుంగితే.. తేలిగ్గా తీసుకున్నారు
  • నీటి ఎత్తిపోతలపై నిపుణుల సూచన మేరకే
  • మేం కేసీఆర్‌లా ఇంజినీర్‌, డిజైనర్‌ కాదు
  • మేడిగడ్డ బరాజ్‌లో అవినీతిపై చర్చను
  • పక్కదారి పట్టించేందుకే నల్లగొండ సభ
  • కాలు విరిగిందన్న సాకుతో సభకు రాలేదు
  • కానీ.. నల్లగొండ సభకు మాత్రం వెళ్లారు
  • కేసీఆర్ అవినీతిని బయటపెట్టేందుకే వచ్చాం
  • కాళేశ్వరం అవినీతిపై నిగ్గు తేల్చుతాం
  • మేడిగడ్డ సందర్శనలో సీఎం రేవంత్‌రెడ్డి


CM Revanth Reddy | విధాత, హైదరాబాద్‌ : మేడిగడ్డలో చేసిన వేలకోట్ల దోపిడీ విషయంలో తాను అవినీతిపరుడిగా, ప్రజల ముందు దోషిగా నిలబడాల్సివస్తుందన్న భయంతోనే నల్లగొండలో కేసీఆర్‌ సభ పెట్టారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. కాలువిరిగిందన్న సాకుతో శాసనసభకు రాని కేసీఆర్‌, నల్లగొండ సభకు ఎట్లా పోయిండని ప్రశ్నించారు. నల్లగొండ కంటే శాసన సభ దగ్గరే ఉంది కదా! అని ఎద్దేవా చేశారు. మంగళవారం మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి.. కుంగిపోయిన మేడిగడ్డ బరాజ్‌ను రేవంత్‌రెడ్డి సందర్శించారు.


డ్యాం దిగువన నదిలోకి వెళ్లి, కుంగిన పిల్లర్లను పరిశీలించారు. అక్కడ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, లోపాలపై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను పరిశీలించారు. బరాజ్‌, ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన లోపాలపై వివరాలు రాబట్టారు. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ద్వారా 98వేల ఎకరాలకే నీరు పారిన విషయాన్ని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ సభలో కేసీఆర్ తానొక సత్యహరిశ్చంద్రుడి ప్రతిరూపం అన్నట్లు, చావు నోట్లో తల పెట్టి తెలంగాణ తెచ్చిన తననే విమర్శిస్తారా అని మాట్లాడటం మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని అన్నారు.


చావునోట్లో తలపెట్టిన అని నూటకొటోసారి అబద్ధం చెప్పారని విమర్శించారు. ‘ఎన్నిసార్లు అదే అబద్ధం చెబుతావు? నీవు మంది చావుల మీద, పిల్లల బలిదానాల మీద సాగిన ఉద్యమంతో తెలంగాణకు రెండుసార్లు సీఎం అయ్యి దోచుకుతిన్నావు’ అని మండిపడ్డారు. కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పులు వేస్తున్నారని, దీనిపై తీర్మానం పెట్టి చర్చించేందుకు అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరామని తెలిపారు.


కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్నో అపోహలు ఉన్నాయని, అక్కడికి ఎవరినీ రానివ్వడం లేదని, ప్రజలకున్న సందేహాల నివృత్తి కోసం మేడిగడ్డ సందర్శనకు రావాలని కోరామన్నారు. 13వ తేదీన పనులు ఉంటే మరో తేదీకి మారుస్తామని అసెంబ్లీలోనే చెప్పానని గుర్తు చేశారు. అఖిల పక్షం అంతా వెళ్లి మేడిగడ్డ కుంగుబాటు లోపాలను పరిశీలించి, ప్రజాకోర్టులోనే చర్చించి తేల్చుకుందామని కోరితే ఇక్కడికి రాకుండా నల్లగొండకు పోయి కాలువిరిగినా మీ కోసం వచ్చానంటూ పార్లమెంటు ఎన్నికల ముందు ఓట్ల కోసం సానుభూతి ప్రయత్నాలు వేశాడని విమర్శించారు.



పిల్లర్లు కుంగడం తేలిగ్గా తీసుకున్న కేసీఆర్‌


నాలుగైదు పిల్లర్లు కూలితే ఏమైందంటూ కేసీఆర్‌ తేలిగ్గా మాట్లాడుతున్నారని రేవంత్‌రెడ్డి ఆక్షేపించారు. ఆయన అవినీతి బయట పడుతుందన్న భయంతోనే అలాంటి మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు. కేసీఆర్‌కు ఏదీ తప్పు కాదని, తప్పు చేసినందుకు స్వయంగా శిక్ష వేయించుకునేంత నిజాయితీపరుడివని తెలంగాణ సమాజం భావించడం లేదన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో కేసీఆర్‌ లక్ష కోట్ల దోపిడీకి కాళేశ్వరం బలైందన్నారు. మేడిగడ్డ సందర్శనకు వచ్చిన వారిని కేసీఆర్ చులకన చేసిన మాట్లాడారని రేవంత్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.


‘మీరు రాకపోవడం ఒక తప్పిదమైతే తీసుకున్న కార్యక్రమాన్ని చులకన చేసి మాట్లాడటం మీ దిగజారుడుతనానికి నిదర్శనం’ అని విమర్శించారు. ‘కృష్ణా జలాలు, కేఆర్‌ఎంబీలపై మాకు అవగాహన లేకపోతే నన్ను అడిగితే సలహా ఇస్తామన్న కేసీఆర్‌ శాసనసభలో జరిగే సాగునీటి శ్వేత పత్రంపై చర్చకు హాజరుకావాలి’ అని సవాలు చేశారు. కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించబోమంటూ ప్రభుత్వం పెట్టిన తీర్మానం సక్కగ లేదని కేసీఆర్ అన్నారని, తీర్మానం సక్కగ లేకపోతే మీ అల్లుడు స్వాతిముత్యం హరీశ్ రావు ఎట్లా మద్దతు ఇచ్చాడని ప్రశ్నించారు.


అందుకే హరీశ్‌రావు వంటి వారి మాటలకు కేసీఆర్ ముందు విలువ ఉండదని, సభలో వీళ్లు ఒకటి మాట్లాడితే బయట కేసీఆర్ మరొకటిటి మాట్లాడుతారని తాను సభలో అప్పుడే చెప్పానని గుర్తు చేశారు. చర్చకు కేసీఆర్ రావాలని చెప్పానని అన్నారు. తీర్మానంలో లోపాలు ఉంటే సవరించే సూచనలు, సలహాలు చేసేందుకు కేసీఆర్‌ సభకు ఎందుకు రాలేదని నిలదీశారు. కృష్ణా జలాల సమస్యపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలంటున్న కేసీఆర్‌.. అదే విషయాన్ని సభకు వచ్చి ప్రతిపాదన పెట్టాలని సూచించారు.


నల్గొండ సభలో ఉండి దిక్కుమాలిన మాటలు మాట్లాడటం కంటే శాసనసభకు వచ్చి పదేళ్ల సీఎంగా, కేంద్ర మంత్రిగా మీ అనుభవంతో ప్రతిపక్ష నేతగా సలహాలు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి బతకాలని కేసీఆర్ చూస్తున్నాడని అన్నారు. ‘మమ్మల్ని వెంటాడుతానని కేసీఆర్‌ మాట్లాడుతున్నారు.. మేమేం అల్లాటప్పాగా ఆ కుర్చీలో కూర్చోలేదు. ప్రజలు ఎన్నుకుంటే వచ్చాం. నీలాగా ఉద్యమం ముసుగులో మంది పిల్లలను చంపి కుర్చీ ఎక్కలేదు’ అని ఘాటుగా విమర్శించారు. ‘నేను కేసీఆర్‌ను సూటిగా అడుగుతున్నా. కాళేశ్వరం అవినీతిలో మీకు భాగస్వామ్యం లేకపోతే మీరు ఎందుకు అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నారు?’ అని ప్రశ్నించారు.


39 మంది ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించి మీకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే సభలోకి వచ్చి చర్చించకుండా పారిపోయి ఏ రకంగా ప్రజల ముందు ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారని నిలదీశారు. నల్లగొండ జిల్లా ప్రజల్ని మరోసారి వంచించడానికే అక్కడికి వెళ్లారని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు.. అధికారం లేనప్పుడల్లా కేసీఆర్‌కు నల్లగొండ ఫ్లోరైడ్, నదీ జలాలు గుర్తుకొస్తాయని ఎద్దేవా చేశారు. ఎంతసేపూ ప్రజల బాధల పునాదుల మీద అధికారాన్ని ఎక్కాలని ఆలోచన చేస్తున్నారని అన్నారు. ఇంకా మీరు చెప్పే మాటలు తెలంగాణ ప్రజల వింటారని అనుకుంటున్నావా? అని కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.



కుంగుబాటును కూడా మీడియాలో చర్చకు పెట్టు


న్యూయార్క్ లో కాళేశ్వరం ప్రాజెక్టు గూర్చి మానవ నిర్మిత అద్భుతం అని చెప్పారని, నేషనల్ మీడియాలో ఊదరగొట్టారని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు అదే మీడియాలో మేడిగడ్డ కుంగుబాటు, నేషనల్ డ్యాన్స్ సేఫ్టీ అథారిటీ రిపోర్టు, విజిలెన్స్, కాగ్ నివేదికలపై చర్చలు పెట్టాలని కోరారు. కుంగిన మేడిగడ్డ బరాజ్‌ను ఎవరూ చూడడకుండా చేసి, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు, తమ తప్పిదాలను తప్పించుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.


తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేషనల్ డ్యామ్స్‌ సేఫ్టీ అథారిటీ విచారణకు సహకరించామని, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ విచారణ జరిపించామన్నారు. ఎన్‌డీఎస్‌ఏ, విజిలెన్స్‌, కాగ్‌ నివేదికలు మేడిగడ్డ బరాజ్‌ నిర్మాణ లోపాలు, అవినీతిని బట్టబయలు చేశాయన్నారు. మేడిగడ్డ విషయానికి వస్తే 1800 కోట్లతో మొదలు పెడితే 4వేల కోట్లకు పైగా పెంచారని, ఇదే రీతిలో కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ వంటి ప్రాజెక్టులన్నింటిలోనూ అవినీతికి పాల్పడ్డారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.


94వేల కోట్ల ఖర్చు.. 98వేల ఎకరాలకు నీళ్లా?


38 వేల కోట్లతో 16లక్షల ఎకరాలకు సాగునీరందించే ప్రాణహిత-చేవెళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో 94,000 కోట్లు ఖర్చు చేసి 98,500 ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేవలం కరెంట్ బిల్లులకే 10,500 కోట్లు ఖర్చు అవుతుందని వివరించారు. ప్రతి ఏటా బ్యాంకు రుణాలు ఇతర చెల్లింపులకే 25 వేల కోట్లు కావాలన్నారు. ప్రాజెక్టు పూర్తికి రెండు లక్షల కోట్లు కావాల్సివుందన్నారు. ఎలాగూ తాము దిగిపోయామని కేసీఆర్‌, తమ గడువు ముగిసిందంటూ నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ మేడిగడ్డ కుంగుబాటు బాధ్యత నుంచి తప్పించుకుంటున్నాయని విమర్శించారు.


2019లో మేడిగడ్డ బరాజ్‌ పూర్తయితే 2020నుంచి సమస్యలు మొదలవ్వగా, అధికారులు నాలుగేళ్లుగా లేఖలు రాసినా కేసీఆర్‌ ప్రభుత్వం తమ అవినీతి బయటపడుతుందన్న భయంతో పట్టించుకోలేదని చెప్పారు. ఫలితంగానే బరాజ్‌ కుంగిపోయిందన్నారు. 2021 మార్చిలో ప్రాజెక్టు పూర్తయినట్లు సర్టిఫికెట్ ఇచ్చారని, ఈఎన్‌సీ మాత్రం లయబిలిటీ పీరియడ్ 2020 ఫిబ్రవరి నుండే ఇచ్చారని చెప్పారు. అందుకే సదరు అధికారిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. నిర్మాణ సంస్థ చర్యలపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.


ఏనుగు పోయి.. తోక మిగిలింది..


కృష్ణా జలాలను, ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పడంలో బీఆరెస్ హయాంలో ఏనుగు పోయి తోక మిగిలిందన్నట్లుగా ఉందని రేవంత్‌రెడ్డి తెలిపారు. అప్పట్లో ఇందుకు బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించారన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం తోకను పట్టుకుని, తిరిగి కృష్ణా ప్రాజెక్టులపై హక్కులను కాపాడుకునేందుకు పోరాడుతున్నదని తెలిపారు. ఆ పోరాటంలో ప్రతిపక్షంగా కలిసిరాకపోగా కేసీఆర్‌ రాజకీయం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు నింపితే మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు ఉంటాయా పోతాయా తెలుస్తదన్నారు. దీనిపై సాంకేతిక నిపుణుల నివేదిక మేరకే చర్యలు తీసుకుంటామని తెలిపారు. తాము కేసీఆర్‌లాగా ఇంజినీర్‌, డిజైనర్ కాదని చురకలంటించారు.


ఇప్పటికే మేడిగడ్డ ఐదు ఫీట్లు భూమిలోకి కుంగిపోయిందన్నారు. కళ్ళకు కట్టినట్లుగా పగుళ్లు కనిపిస్తున్నాయని, దాని చిన్న సంఘటనగా మాజీ సీఎం మాట్లాడుతున్నారన్నారు. చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోడానికి కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నాలను తెలంగాణ సమాజం గమనించాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎల్‌ఆండ్‌టీని బ్లాక్ లిస్ట్ చేయాలా? వద్దా? నిర్మాణం పూర్తి కాకుండానే పూర్తయినట్లుగా సర్టిఫికెట్లు ఇచ్చిన అధికారులను శిక్షించాలా? వద్దా? అనే అంశాలపై చర్చించేందుకు మాజీ సీఎంగా సాగునీటి శ్వేత పత్రం చర్చలో సభకు వచ్చి అభిఫ్రాయాలు చెప్పాలని కేసీఆర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.


మళ్లీ సానుభూతి యత్నాలు


ఉద్యమకాలంలో ఆసుపత్రిలో పడుకొని.. ఇప్పుడు వీల్ చైర్‌లో కూర్చుని సానుభూతి కోసం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బయట సభలలో తాను భయపడనని, మళ్లీ మనమే వస్తామంటూ ప్రగల్భాలు ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల పట్ల బాధ్యత ఉంటే సభకు వచ్చి, చర్చలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. చంద్రశేఖర రావు కుట్రలను కుతంత్రాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత తెలంగాణ సమాజంపై ఉందని, కవులు కళాకారులు మేధావులు కాళేశ్వరానికి వచ్చి చూడాలని కోరారు. ఒకప్పుడు కేసీఆర్ ఇదే ప్రాజెక్టును చూపించేందుకు బస్సులు పెట్టారని, గ్రామాల నుంచి ప్రజలను తీసుకొచ్చి అద్భుతమని చూపించారని, నిర్మాణ లోపాలు బయటపడగానే ఎవరిని రాకుండా కాపలాపెట్టారని ఆరోపించారు.


మేడిగడ్డకు రమ్మంటే రాకుండా నల్లగొండ సభలో తాము కూడా మేడిగడ్డ పోతామంటున్నాడని, ఆయన పోవాల్సింది ఇక కాశీకి బిచ్చమెత్తుకోవడానికేనని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కాళేశ్వరం అవినీతిపై పెద్ద మాటలు మాట్లాడిన కిషన్ రెడ్డి మేడిగడ్డకు వాళ్ల పార్టీ ఎమ్మెల్యేలను ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. కేసీఆర్ చీకటి మిత్రుడైన బీజేపీ వ్యవహారం పార్లమెంటు ఎన్నికల్లో బయటపడక తప్పదని అన్నారు. కాళేశ్వరం అవీనీతి విచారణను సీబీఐకి అప్పగిస్తే కళ్లెం తమ చేతికే వస్తే కేసీఆర్ వద్ద గిల్లుకోవచ్చన్న ఆలోచనతో బీజేపీ ఆ డిమాండ్ చేస్తుందన్నారు.


పారదర్శకంగా ఉండేందుకే తమ ప్రభుత్వం జ్యూడిషియల్ విచారణకు ఆదేశించిందన్నారు. పదేళ్లలో కేంద్రం కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర దర్యాప్తు సంస్థలతో ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. కేసీఆర్ కాళేశ్వరం అవినీతిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ కూడా చేపడుతామని, అన్ని విషయాలు అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కేసీఆర్ తమను కేఆర్‌ఎంబీ పేరుతో పక్కదారి పక్కదారి పట్టించే ప్రయత్నం చేసున్నాడని, తాము ఆయన ఉచ్చులో పడేది లేదని చెప్పారు. కాళేశ్వరం అవినీతిపై నిగ్గు తేల్చే పనిలో ఉన్నామని స్పష్టం చేశారు.