విధాత, హైదరాబాద్ : మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని కేసీఆర్, మోదీ కుట్రలు చేస్తున్నారని, ప్రభుత్వాన్ని పడగొడతామని ఎవరైనా వస్తే.. మా ఆడబిడ్డలు చీపురు కట్టలు మర్లేసి కొడతారని, కాంగ్రెస్ వైపు కన్నెత్తి చూస్తే మా ఆడబిడ్డలు మీ గుడ్లుపీకి గోలీలు ఆడుకుంటారని సీఎ రేవంత్‌రెడ్డి బీజేపీ, బీఆరెస్‌లను హెచ్చరించారు. స్వశక్తి మహిళా సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ మా ప్రభుత్వాన్ని పడగొడతామని కేసీఆర్ కుటుంబం ఫామ్ హౌస్ లో చిందులు వేస్తోందని, రైతుబిడ్డ సీఎం కుర్చీలో కూర్చోవడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కుర్చీలో దొరలే కూర్చోవాలా? రైతు బిడ్డ కూర్చో కూడదా? అని ప్రశ్నించారు. మా ఇందిరమ్మ ప్రభుత్వానికి కాపాడుకునేందుకు మా సైన్యం మీరే.. మా బలగం మీరే అని మహిళలను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. రాబోయే కొద్ది రోజుల్లో 10లక్షల మహిళ ఆడబిడ్డలతో కవాతు చేస్తామని ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో మా ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే బాధ్యత ఇందిరమ్మ ప్రభుత్వానిదేనన్నారు. ఎంతసేపు మోదీతో కేసీఆర్ చీకటి ఒప్పందాలు, కుట్రలలో నిమగ్నమయ్యారన్నారు. తెలంగాణ ప్రజలను అవమానించిన ప్రధాని మోదీ ఓట్లెలా అడుగుతారని ఫ్రశ్నించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని కాల్చి చంపారని విమర్శించారు. పేదోళ్ల ఖాతాల్లో 2లక్షలు వేస్తామని వేయలేదని, ఏటా 2కోట్ల ఉద్యోగాలిస్తామని ఇవ్వలేదన్నారు. పార్లమెంటులో తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మహిళా శక్తి సోనియమ్మ అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరమ్మ.. సోనియమ్మ.. ప్రియాంక గాంధీ అని, కాంగ్రెస్ పార్టీని నడిపిస్తోంది ఒక మహిళ అని మేం గర్వంగా చెప్పుకుంటామన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో మహిళా సంఘాలు దివాళా తీశాయని, డబుల్ బెడ్‌రూమ్‌లు ఇస్తామని మోసం చేసిండని, అందుకే మా ఆడబిడ్డలు కంకణం కట్టుకుని ఎన్నికల్లో కేసీఆర్ ను బండకేసి కొట్టారన్నారు. 7లక్షల కోట్లు అప్పుల పాలు చేసిన కేసీఆర్ రాష్ట్రాన్ని దివాళ తీయించగా ఒక్కోక్క చిక్కుముడి విప్పుకుంటు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.
కోటీ మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తాం
ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని స్పష్టం చేశారు. మేం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తే, కేసీఆర్, హరీష్, కవిత, కేటీఆర్ కిరాయి ఇచ్చి ఆటో డ్రైవర్లతో ధర్నాలు చేయిస్తున్నారని ఆరోపించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పథకాన్ని అమలు చేయొద్దంటున్నారని, ఎవరు అడ్డు వచ్చినా సరే..బస్సులకు అడ్డుపడినా తొక్కించి మరి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కొనసాగిస్తామన్నారు. మా ప్రభుత్వాన్ని ఎందుకు పడగొట్టాలని ప్రశ్నించారు. చెప్పిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్ ప్రయాణ వసతి అందించామని, కేసీఆర్ నిర్వీర్యం చేసిన ఆరోగ్య శ్రీ 10లక్షలకు పెంచి పేదల ఆరోగ్యానికి భరోసానిస్తున్నామని వివరించారు. రూ.500లకే మహిళలకు గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని, గృహాలక్ష్మి పథకం ద్వారా పేదల ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. భద్రాద్రి రామచంద్ర స్వామి ఆశీస్సులతో ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని ప్రారంభించుకున్నామని, ఇల్లు కట్టుకునే పేదలకు రూ.5లక్షలు ఆర్ధిక సాయం అందించబోతున్నామని చెప్పారు. రాష్ట్రంలో 4.50లక్షలకు పైగా ఇండ్లు కట్టించబోతున్నామన్నారు. రాష్ట్రంలో 63 లక్షల మంది స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు ఉన్నారని, 63 లక్షలు కాదు.. కోటి మంది సభ్యులు కావాలని, ఐదేళ్లలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే బాధ్యత మాది అని హామీ ఇచ్చారు. అప్పుడే తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుందని, ధనిక తెలంగాణగా మారుతుందని చెప్పారు. రాబోయే నెల రోజుల్లో శిల్పారామం పక్కన స్వయం సహాయక సంఘాల మహిళలకు స్టాల్స్ ఏర్పాటు చేస్తామని, మీరు తయారు చేసిన ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేసుకునే సదుపాయం కల్పిస్తామని తెలిపారు. కేసీఆర్ ఉన్నన్నిరోజులే బతుకమ్మ నుంచి అన్ని ఆయన బిడ్డకే అవకాశం ఇచ్చారన్నారు. మేం మీ అందరికి సహాయం చేయాలని, ఆర్ధికంగా బలోపేతం చేయాలని భావిస్తున్నామన్నారు.
లక్షకోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తాం: డిప్యూటీ సీఎం భట్టి
రాష్ట్రంలో రానున్న ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసేందుకు మహిళా సంఘాలకు లక్ష కోట్ల రుణాలు ఇచ్చి వాటి వడ్డీ కూడా ప్రభుత్వమే కడుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.మహాలక్ష్మి, అభయ హస్తం ఆరుగ్యారంటీల అమలులో మహిళల కోసం పెద్దపీట వేశామన్నారు. 6లక్షల 40వేల మంది మహిళలకు వడ్డీలేని రుణాలు అందింబోతున్నామని తెలిపారు. పదేళ్ల బీఆరెస్ ప్రభుత్వం మహిళలను గౌరవించకపోగా, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు నిలిపివేసిందని విమర్శించారు. జనాభాలో సగభాగమైన మహిళలను గౌరవించి వారిని ఆర్ధికంగా బలోపేతం మహిళా సాధికారిత దిశగా నడిపించాలని నిర్ణయించామన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క, కొండా సురేఖ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.